- బాధితురాలి వాంగ్మూలమే శాసనంగా తీర్పులు
- 20 ఏండ్లకు తగ్గకుండా జైలు శిక్షలు విధిస్తున్న కోర్టులు
- ఈ ఏడాది దాదాపు 124 మందికి శిక్షలు ఖరారు
- నిరుడు 82 మందికి జీవిత ఖైదు, 49 మందికి 20 ఏండ్లకు పైగా శిక్ష
- గత మూడేండ్లలో నలుగురికి ఉరిశిక్ష విధింపు
హైదరాబాద్, వెలుగు: గుడ్ టచ్, బ్యాడ్‌టచ్‌కు తేడా తెలియని అమాయకపు చిన్నారుల మీద లైంగిక దాడులకు తెగబడుతున్న కామాంధులపై పోక్సో చట్టం ఆయుధంగా మారింది. పక్కింటి అంకుల్.. ఎదురింటి యువకుడు.. చుట్టపుచూపుగా వచ్చిన మామయ్య.. బడిలో చదువుచెప్పే టీచరు.. ఇలా తెలిసినవాళ్లే చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడుతుండడంతో పోక్సో కేసుల విచారణను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయగా, ఆయా కేసుల్లో సత్వర తీర్పులు వెలువడుతున్నాయి బాధితురాలి వాంగ్మూలాన్నే ప్రామాణికంగా చేసుకుంటున్న న్యాయమూర్తులు.. నిందితులకు కఠిన శిక్షలు ఖరారు చేస్తున్నారు. గతేడాది 77 కేసుల్లో 82 మందికి జీవిత ఖైదు విధించగా, 49 కేసుల్లో 20 ఏండ్లకు పైగా శిక్షలు విధించారు. ఈ ఏడాది గడిచిన 9 నెలల వ్యవధిలో దాదాపు 124 మందికి పైగా శిక్షలు ఖరారు కాగా, అత్యాచారం జరిపినట్లు నిరూపితమైన కేసుల్లో 20 ఏండ్లకు తగ్గకుండా శిక్షలు విధించారు. కాగా, గడిచిన మూడేండ్లలో నాలుగు కేసుల్లో నలుగురికి కోర్టులు ఏకంగా ఉరిశిక్ష విధించాయి.
1,190 కేసుల్లో తీర్పులు..
రాష్ట్రవ్యాప్తంగా లైంగిక వేధింపులు, దాడులకు గురవుతున్న మైనర్లలో మూడేండ్ల చిన్నారులు మొదలుకొని 15 ఏండ్ల లోపు బాలికలు ప్రధాన బాధితులుగా ఉంటున్నారు. పోక్సో చట్టం కింద గతేడాది దాదాపు 1,954 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 400కు పైగా కేసులు ఫైల్అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నాటికి 51,972 కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో 1,190 కేసుల్లో కోర్టులు తీర్పు వెల్లడించాయి. నిర్భయ ఫండ్ కింద బాధితులకు నష్టపరిహారం సైతం చెల్లిస్తున్నారు. పోక్సో కేసుల దర్యాప్తుతో పాటు సాక్ష్యాధారాల సేకరణలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తున్నారు. బాధితురాలు సహా కుటుంబ సభ్యుల వివరాలు, నివాస ప్రాంతాలను గోప్యంగా ఉంచుతున్నారు. మహిళా పోలీసుల సమక్షంలోనే బాధితులకు ఆరోగ్య, న్యాయ సహాయం అందజేస్తున్నారు.
బాధితుల వాంగ్మూలమే శాసనంగా..
రాష్ట్రంలో ప్రత్యేకంగా 9 పోక్సో స్పెషల్ కోర్టులు సహా మొత్తం 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేస్తున్నాయి. ఫాస్ట్ ట్రాక్, చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుల్లో మూడు నెల్లలోపు ట్రయల్స్ పూర్తి చేసి శిక్షలు పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అత్యాచారం మాత్రమే కాదు.. చిన్నారులు, మైనర్లను అసభ్యకరంగా తాకడం, ఎక్కడపడితే అక్కడ టచ్ చేయడం, అసభ్యంగా మాట్లాడడం కూడా పోక్సో చట్ట పరిధిలోకి వస్తాయి. మైనర్‌ను పెండ్లి చేసుకుని ఆమెతో శారీరకంగా కలిసిప్పటికీ.. బాధితురాలు ఫిర్యాదు చేస్తే పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేస్తారు. ఇలాంటి కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకుంటున్న కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నాయి. దీనికి తోడు డీఎన్ఏ, నిందితుల ఫింగర్ ప్రింట్స్ , ప్రాసిక్యూషన్ సమర్పించే సాక్ష్యాలు నిందితులను దోషులుగా నిరూపించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
రేప్ కేసులో జీవితఖైదు..
బాలికను కిడ్నాప్‌చేసి అత్యాచారం చేసిన కేసులో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం గురజాడకు చెందిన తలారి లక్ష్మీనారాయణ (20)కు సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధించింది. ఈ తీర్పు కూడా బుధవారమే వెలువడింది. గురజాడ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ 2018లో ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. జహీరాబాద్ రూరల్ పోలీసులు పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితురాలి వాంగ్మూలం సహా పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలతో లక్ష్మీనారాయణను కోర్టు దోషిగా తేల్చింది. జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
లైంగిక దాడి కేసులో 32 ఏండ్ల జైలు శిక్ష..
మైనర్ బాలికను పెండ్లి చేసుకొని, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నల్గొండ జిల్లా పానగల్ గ్రామానికి చెందిన చందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు 32 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెల్లడించింది. బాధితురాలి వాంగ్మూలం, పోలీసులు అందించిన సాంకేతిక ఆధారాలతో చందును దోషిగా నిర్ధారించింది. మైనర్‌పై లైంగిక దాడి చేసినందుకుగాను పోక్సో చట్టం సెక్షన్ 5(1) కింద 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా, ప్రలోభపెట్టి కిడ్నాప్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ 366, 376(2) కింద 10 సంవత్సరాల జైలు, రూ.25 వేల జరిమానా విధించింది. బాల్య వివాహ నిషేధ చట్టం కింద మరో రెండు సంవత్సరాల జైలు, రూ.25వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.10 లక్షలు పరిహారంగా అందించాలని తీర్పు వెల్లడించింది.
గతేడాది 20 ఏండ్లకు పైగా విధించిన శిక్షల వివరాలివీ..
కేసులు దోషుల సంఖ్య శిక్ష
43 43 20 ఏండ్లు
1 1 21 ఏండ్లు
4 4 25 ఏండ్లు
1 1 30 ఏండ్లు
