ఈ ఊళ్లో అమ్మాయి పుడితే.. పండుగ చేస్తరు

ఈ ఊళ్లో అమ్మాయి పుడితే.. పండుగ చేస్తరు

అమ్మ లేకుంటే సృష్టే లేదంటరు. ఇంటికి  వెలుగు ఇల్లాలే అంటరు. చదువులతల్లి అని సరస్వతిని కొలుస్తరు.  ఆడవాళ్ల గురించి ఇట్ల మస్తు గొప్పలు చెప్తరు. కానీ, అమ్మను కీర్తిస్తూనే చివరికి అమ్మాయి మీద వివక్ష చూపించెటోళ్లే ఎక్కువమంది! ‘‘ఆడపిల్ల పుట్టడం మీ ఫ్యామిలీకి భారం కాదు. మన ఊళ్లో పుట్టడం మనందరికి గౌరవం” అనుకున్నరు ఆ ఊరోళ్లు. ఊళ్లె ఆడపిల్ల పుట్టిందంటే చాలు… ఊరంతా పండుగ చేస్తున్నరు. ఆ చిన్నారి భవిష్యత్‌‌కి బాటలు వెయ్యడానికి ఆ ఊరి గ్రామపంచాయతీ కొన్ని పైసలు కూడా సాయం చేస్తున్నది. ఇంతకీ ఎందుకిట్ల చేస్తున్నరు? అంటే దానికి ఓ కథ ఉంది!

సంగారెడ్డి జిల్లాలో హరిదాస్‌‌పూర్ అని ఒక చిన్న పల్లె ఉన్నది. కొన్నాళ్ల కింద ఈ ఊరు ఉందని కూడా చానమందికి తెల్వదు. ‘ఆడపిల్ల పుడితే.. ఊరంత పండుగ చేస్తున్నరు. ఆడ పిల్ల భారం కాదు అని ఆ ఫ్యామిలీకి భరోసా ఇస్తున్నరు’ అని తెల్వంగనే.. తెలంగాణ మొత్తం ఇప్పుడు ఈ ఊరివైపు చూస్తున్నది. ఉన్న వనరులతోటే.. ఎట్ల మనుషులను ఆదుకోవచ్చు? ఒక మంచి పనిని చిన్నగా మొదలు పెట్టినా సరే.. దానికి ఎంతోమంది సాయం చెయ్యడానికి ఎట్ల చేతులు కలుపుతారని ఈ ఊరిని చూస్తే అర్థమైతది.

రెండేండ్ల కింద..

ఇది రెండేండ్ల కిందటి ముచ్చట. హరిదాస్‌‌పూర్‌‌‌‌లో సత్యవతి అనే ఆమెకు మొదట ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన్రు. ‘ఇద్దరు బిడ్డలు చాలు…ఈ సారైనా కొడుకు పుట్టాలె’అని కోటి మొక్కులు మొక్కుకొని.. మూడో కాన్పుకు హాస్పిటల్‌‌కి పోయింది. పండంటి ఆడపిల్లను తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టిండు డాక్టరు‌‌. ఆమె బిడ్డను చూసుకొని ఏడ్చింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయింది. కానీ, ఆమె మనసు ఇంకా దుఃఖంలనే ఉన్నది. ఆ రోజు ఊళ్లె ‘పల్లె ప్రగతి’ ప్రొగ్రామ్‌‌ జరుగుతున్నది. సర్పంచ్‌‌ షఫీ, సెక్రెటరీ రోహిత్‌‌ కులకర్ణీతో పాటు గ్రామ పెద్దలంతా ఊరంతా తిరుగుతున్నరు. ప్రతిఒక్కరి ఇంటికిపోయి మంచి, చెడ్డలు అర్సుకుంటున్నరు. ఆ వరుసలో సత్యవతి వాళ్ల ఇల్లు కూడా వచ్చింది. ఆమె వాళ్లతోటి మాట్లాడలేకపోయింది. ఆమెను ఏమడిగినా పెదవి విప్పట్లేదు. ఆమె చానా బాధతో ఉందని చూస్తేనే అర్థమైతుంది. ‘ఏమైంది’ అనడిగితే.. పక్కనే ఉన్న ఆశా వర్కర్ మూడో కాన్పుల కూడా ఆమెకు ఆడపిల్లనే పుట్టిందని చెప్పింది. ‘అర్రె.. ఈమె లెక్క ఆడబిడ్డ పుడితే.. ఎవరూ డీలా వడొద్దు.. దీనికి మనం ఏదన్న చెయ్యాలె. ఒక భరోసానియ్యాలె’ అనుకున్నరు .

మంచి ఆలోచన..

కొన్ని ఆయుధాలు మన అమ్ములపొదిలోనే ఉంటయ్‌‌. కానీ, అవి ఉన్నయనే సంగతి కూడా చానామందికి తెల్వదు. ఉన్నయని తెలిసినా వాటిని వాడటం తెల్వనోళ్లు కూడా ఉంటరు. అట్లాంటి ఆయుధమే ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం. ‘‘ఆడపిల్లలకు ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నం. మా విలేజ్‌‌ సెక్రటరీ రోహిత్‌‌కి సుకన్య సమృద్ధి యోజన మైండ్‌‌లోకి వచ్చింది. వీళ్లకు ఒక అకౌంట్‌‌ తీసి, ముందుగా గ్రామ పంచాయతీ నుంచి వెయ్యి రూపాయలు ఇద్దాం.  తర్వాత ప్రతి నెలా రెండు వందలు ఆ అకౌంట్‌‌లో వేస్తూ.. కొన్ని రోజులపాటు అలవాటు చేద్దాం. ఆ అలవాటుతో తర్వాత నెలకు కొన్ని  పైసలు అందులో వాళ్లే జమ చేస్తరు అన్నడు. వెంటనే ‘మనం స్టార్ట్ చేద్దాం’’ అని చెప్పిన’ అన్నడు  సర్పంచ్‌‌ షఫీ.

పండుగలా..

వెయ్యి ఇచ్చినా, రెండు వేలు ఇచ్చినా వాళ్లు సంతోషపడరు. అసలు ఈ పథకం ఎలా పని చేస్తుంది? ఫ్యూచర్‌‌‌‌లో అది చదువు లేదా పెండ్లికి ఎట్లా ఉపయోగపడ్తది? చెప్పాలనుకున్నరు. ఆడపిల్ల భారం కాదని వివరించాలనుకున్నరు. దీనికోసం ఆడపిల్ల పుట్టిన సందర్భంగా ఊరంతా పండుగ చెయ్యాలనుకున్నరు. దీనికోసం ప్రత్యేకంగా ఒక రోజు గ్రామపంచాయతీకి మొత్తం లైట్లతో డెకరేషన్ చేస్తరు. పాప తల్లిదండ్రులను పిలిపిస్తరు. ఈ వేడుకకు ఊరి పెద్దలు, యూత్‌‌ అంతా కచ్చితంగా అటెండ్ అయితరు. ఊరంతా స్వీట్స్ పంచుతరు. తర్వాత చెక్కు అందజేస్తరు. “అమ్మా.. ఆడ పిల్ల పుట్టినందుకు బాధ పడకు.. నీ పాపతో  స్టార్ట్ అయింది. ఇగ, ఊళ్లె ఎవరికి పుట్టినా.. గ్రామపంచాయతీకి లైట్లు వేసి.. ఇట్లనే స్వీట్స్ పంచుతం. ఇప్పటి నుంచి ఊళ్లె ఆడపిల్ల పుడితే.. ఆ రోజు ఊరంతా పండుగ చేస్తం”అని గ్రామపెద్దలు సత్యవతికి భరోసా ఇచ్చిన్రు. ఇది మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది ఆడపిల్లలు పుట్టిన్రు. అందరికీ ఇట్లనే పండుగ చేసి భరోసా ఇచ్చిన్రు.

ఊరికే పోస్ట్‌‌మెన్‌‌

వెయ్యి రూపాయల చెక్కులో సర్పంచ్‌‌, సెక్రెటరీ కలిసి చెరో ఐదొందలు ఇస్తరు. తర్వాత ప్రతి నెలా వాళ్ల స్తోమతకు తగ్గట్టుగా ఎంతైనా డిపాజిట్‌‌ చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి పద్దెనిమిదేళ్లు వచ్చే సరికి ఎనిమిది శాతం వడ్డీతో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.  మండలంలో ఉండే పోస్టాఫీసు దాకా అందరూ పోలేరు.  కానీ,  ఇప్పుడు  పోస్ట్‌‌మెన్ ఊళ్లకే వస్తున్నడు. ఆయన దగ్గర్నే అకౌంట్‌‌ తీస్తే ఫించన్ ఇయ్యడానికో, ఊపాధి హామీ పథకం డబ్బులు ఇయ్యడానికో ఊరికి వచ్చినప్పుడు డబ్బులు జమ చేసుకుంటున్నరు. -గణేశ్​ తండ

మంచిపనికి అండగా..

చిన్నదైనా సరే.. మంచిపని మొదలు పెడితే మనసున్నోళ్లు చానామంది సాయం చెయ్యడానికి ముందుకొస్తరు. ఈ ఊరువాళ్లు చేస్తున్న పని గురించి తెలుసుకుని ఆదివారం కొంతమంది సార్లు తమ వంతు సాయం చేస్తం అని చెప్పిన్రు. సంగారెడ్డి జిల్లా జైల్‌‌ సూపరింటెండెంట్‌‌ నవాబ్ శివకుమార్‌‌‌‌గౌడ్‌‌.. ‘‘పిల్లలు మంచిగుండాలె అంటే.. ముందుగా బడి బాగుండాలె. పిల్లల కోసం బుక్స్‌‌ ఇప్పిస్తా. స్కూల్‌‌ బిల్డింగ్‌‌కు రంగులు వేయిస్తా’’ అని చెప్పిండు. పన్నెండేళ్ల లోపు ఆడపిల్లలందరికీ సంగారెడ్డిలో ఉన్న తమ హస్పిటల్‌‌లో ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ ఇస్తామని  చిన్న పిల్లల డాక్టర్‌‌‌‌ చక్రపాణి చెప్పిండు. ఈ సంవత్సరం పుట్టిన ఆడపిల్లలకు, వాళ్ల తల్లిదండ్రులకు కొత్త బట్టలు పెట్టిన్రు జోగిపేట గవర్నమెంట్ హస్పిటల్‌‌ పెద్ద డాక్టర్‌‌‌‌ శంకర్‌‌‌‌బాబు. ఇప్పుడు పుట్టినోళ్లకే కాకుండా, ఊళ్లో ఉన్న ప్రతి ఆడపిల్లకు సుకన్య యోజన అకౌంట్‌‌ తీయడానికి రెడీ అయిన్రు సర్పంచ్‌‌, సెక్రెటరీ. దీనికి అకౌంట్‌‌కి వెయ్యి రూపాయల చొప్పున 45 వేలు ఇస్తానని,  ఇప్పటి నుంచి పదేళ్ల వరకు పుట్టబోయే ప్రతి ఆడపిల్లను సుకన్య యోజన పథకంలో చేర్చడానికి అవసరమైన నాలుగు నెలల కిస్తీలు తనే కడ్తానని నారాయణఖేడ్‌‌ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌‌ కళింగ కృష్ణకుమార్‌‌‌‌ చెప్పిండు. ‘‘పదేండ్లలోపు ఉన్న ప్రతి ఆడపిల్లకు హరిదాస్‌‌ పూర్‌‌‌‌లో ఎకౌంట్‌‌ ఉండాలె. మేమే తీసిస్తం. దాంట్లో వాళ్లు నెలనెలా డబ్బులు జమ చేసుకోవాలె. ఆడపిల్లలు బాగా చదువుకోవాలె. హరిదాస్‌‌పూర్ పేరు నిలబెట్టాలె’’ అని సర్పంచ్ షఫి చెప్పిండు.

For More News..

త్వరలో టీ10 క్రికెట్‌‌ రీస్టార్ట్​

అక్కెర తీరింది.. ఇక వెళ్లిపోండి.. హెల్త్​ స్టాఫ్​ను తొలగిస్తున్న సర్కారు

ఆసుపత్రి బిల్లులు లక్షల్లో.. సీఎం రిలీఫ్ మాత్రం వేలల్లో..