
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మిలిటరీ అధికారి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ భారత్‌పై నోరు పారేసుకున్నారు. సింధు జలాలు ఆపితే, ఇండియన్లను గొంతుకోసి చంపుతామని కామెంట్చేశారు. పాకిస్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. సింధు నీళ్లు ఆపితే, ఆ నీళ్లు ప్రవహించే నదుల్లో ఇండియన్ల రక్తం పారుతుందని రెచ్చగొట్టేలా మాట్లాడాడు. లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా ఇటీవలే ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ‘‘మీరు (భారత్) సింధు నీళ్లు ఆపితే.. దేవుడి మీద ఒట్టు, మీ ఊపిరి తీస్తాం” అని హఫీజ్ పేర్కొన్నాడు.
తాజాగా పాక్ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ కూడా హఫీజ్ భాషలో మాట్లాడి ఇండియాపై నోరు పారేసుకున్నాడని ఆన్ లైన్లో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్మీ అధికారి అయి ఉండి, అలా ఎలా మాట్లాడతాడని నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. అఫ్గానిస్తాన్ మాజీ ఎంపీ మరియం సోలైమాంఖిల్ కూడా అతని వ్యాఖ్యలను ఖండించారు. ఉన్నత స్థాయిలో ఉన్న ఓ ఆర్మీ అధికారి అలా మాట్లాడడం కరెక్టు కాదన్నారు. అతను హఫీజ్ సయీద్‌ను ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నాడని ఎద్దేవా చేశారు. కాగా.. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే.