
న్యూఢిల్లీ: రైతుల పక్షాన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడొద్దంటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ బెదిరించారన్న రాహుల్ గాంధీ కామెంట్లపై జైట్లీ కొడుకు రోహన్ జైట్లీ తీవ్రంగా మండిపడ్డారు. తన తండ్రి 2019లోనే చనిపోయారని, అలాంటప్పుడు 2020లో రాహుల్ ను ఎలా బెదిరిస్తారని ప్రశ్నించారు.
‘‘అగ్రి చట్టాల డ్రాఫ్ట్ బిల్లులను కేంద్ర కేబినెట్ 2020, జూన్ 3న ఆమోదించింది. ఆ బిల్లులు 2020 సెప్టెంబర్ లో చట్టాలుగా మారాయి. అయితే, మా నాన్న అరుణ్ జైట్లీ 2019, ఆగస్ట్ 24ననే మరణించారు. ఆయన మరణించేనాటికి అగ్రి చట్టాల బిల్లులపై ఎలాంటి చర్చలు గానీ, మద్దతు, వ్యతిరేకత గానీ లేవు. మరి రాహుల్ ను ఎలా బెదిరిస్తారు?” అని ఆయన తప్పుపట్టారు.
అసలు తన తండ్రి ఎవరినీ, ఎప్పుడూ బెదిరించిన వ్యక్తి కూడా కాదన్నారు. ఈ లోకంలో లేని వ్యక్తి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దని, ఆయన ఆత్మకు శాంతి కలగనివ్వాలని కోరారు. రాహుల్ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయాలని చూస్తున్నారని, మాట్లాడేముందు వాస్తవాలను సరి చూసుకోవాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కూడా ‘ఎక్స్’లో ఫైర్ అయ్యారు.