ఈడబ్ల్యూఎస్​పై సుప్రీంకోర్టు తీర్పు బాధాకరం

ఈడబ్ల్యూఎస్​పై సుప్రీంకోర్టు తీర్పు బాధాకరం

మన వ్యవస్థకు పట్టిన వివక్ష, ఆధిపత్యపు చీడకు సుప్రీం కోర్టు అతీతం కాదని ఈడబ్ల్యూఎస్​పై వెలువడిన ప్రమాదకరమైన తీర్పు చెప్తున్నది! అసలు అన్యాయాన్ని న్యాయంగా వంత పాడటం మన వ్యవస్థ దౌర్భాగ్యం! మనస్సాక్షి లేని న్యాయాలు, రాజకీయ నాయకులు, విచక్షణ లేని పాలకులను చూస్తే సిగ్గనిపిస్తుంది. బహుజన ప్రజా నాయకులు కండ్లు మూసుకొని పార్లమెంట్ అన్యాయపు ఈడబ్ల్యూఎస్​ బిల్లుకు ఓటేస్తే, అన్యాయాన్ని న్యాయమని సుప్రీం కోర్టు దానికి ఇప్పుడు తీర్పు ఇచ్చింది. సామాన్యులు నమ్మే న్యాయ వ్యవస్థ అన్యాయం చేసిందని చెప్పడానికి ఇంత కన్నా ఏం సాక్ష్యం కావాలి? ఎందుకిలా అన్యాయం నిరంతరంగా నడుస్తుందో ఆలోచించాలి. 

50 శాతం ఇవ్వా ల్సిందేనని మాట్లాడాలి

బహుజన లీడర్లరా నిలబెట్టి బట్టలూడదీస్తున్న అగ్ర వర్ణాలతోటి అంటకాగుతున్నందుకు సిగ్గుపడాలి! అన్యాయపు బిల్లులు వ్యతిరేకతే లేకుండా గెలుస్తాయి. 75 శాతం పైన ఉన్న వర్గాల నుంచి నాయకులు రారు.10 శాతం జనాభా ఉన్న వాళ్ల నుంచే పాలకులు వస్తారు! మరి వాళ్లకు ఈ డెబ్బై శాతం మందే ఓటు వేస్తారు. ఎన్ని తరాలు మీరు పల్లకీలు మోసే కూలీలుగా ఉంటారు? పట్టుమని పది శాతం జనాభా లేని వారికి10 శాతం రిజర్వేషన్లు ఇస్తారా? మరి 50 నుంచి 60 శాతం ఉన్న వెనకబడిన వారికి ఏమి ఇస్తారు?  ఈ అగ్రవర్ణ ఆధిపత్య వ్యవస్థను మీరెందుకు ప్రశ్నించరు? 50 నుంచి 60 శాతం మాకూ ఇవ్వాల్సిందే అని కూడా మాట్లాడలేని వెనకబడిన జాతులారా.. తప్పంతా మీదే! ఇకనైనా మేల్కోండి. 

కాల పరిమితి ఎందుకు?

రిజర్వేషన్లకు కాలపరిమితి విధించడం కూడా సరికాదు. ఉన్న రిజర్వేషన్లకు కాల పరిమితి పెట్టాలన్న న్యాయమూర్తులకు ఈ కొత్త10 శాతం అగ్రవర్ణాల రిజర్వేషన్ల అంశం సరైందనిపించింది. ఇదెక్కడి(అ)న్యాయం?  కాల పరిమితి కాదు కావాల్సింది.. జీవన ప్రమాణ తులనం. అధికారులు, న్యాయమూర్తులు, నాయకులు అన్ని అధికార వ్యవస్థల్లోనూ జనాభా నిష్పత్తి ప్రకారం ఇంచు మించు అగ్రవర్ణాలను అనుకునే వాళ్లకు సమాన స్థాయిలో బహుజన వర్గాలు నిలబడితే అప్పుడు ఈ రిజర్వేషన్ల అవసరం ఉండదు! కాల పరిమితి పెడితే అంత లోపల లేనోళ్లు ఉన్నోళ్లయితరా? నిమ్న కులాలకు సాధికారత వచ్చేస్తదా? వందల ఏండ్లు అణగదొక్కబడ్డవాళ్లకు న్యాయం జరుగుతదా? కాల పరిమితి పెట్టాలన్న సుప్రీం కోర్టు మరి రిజర్వేషన్ల లక్ష్యం ఎట్లా నెరవేరుతదో  కూడా చెప్పాల్సి ఉంటుంది. అసలు రిజర్వేషన్ల గురించి మాట్లాడే వాళ్లు ముందు అవి ఎందుకు పెట్టిండ్రో తెలుసుకుంటే మంచిది! అవి అనుకున్న లక్ష్యాలు సాధించాయా లేదా అని ఆలోచించాలి. ఏ రకంగా చూసినా ఒక 10 శాతం లక్ష్యం మాత్రమే నెరవేరిందని చెప్పగలం! కనీస విచక్షణ ఉన్న ఏ ఒక్కరికైనా అర్థం కాని విషయం ఇందులో ఏముంది? బహుజనులారా.. కండ్లు తెరవండి! మీ చుట్టూ ఏం జరుగుతుందో చూడండి. 

=చాట్ల విజయకృష్ణ