పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు చెప్పినం

పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు చెప్పినం

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేకుండా పోలవరం ఎత్తు తగ్గించాలని గతంలోనే కోరామని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎత్తు పెరిగితే భద్రాచలంకు ప్రమాదమని.. పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం పట్టణంలోకి భారీగా నీళ్లొచ్చాయన్నారు. భద్రాచలం పక్కనే ఉన్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. 

1986 లో నిర్మించిన కరకట్ట ప్రస్తుతం ఉందని.. భవిష్యత్తులో వరదలు నివారించేందుకు, కరకట్ట నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ 1000 కోట్లు కేటాయించారని, నిపుణులు హైదరాబాద్ నుండి వెళ్లి ప్రణాళికలు సిద్ధం చేస్తారని తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద వరద తగ్గుతోందని.. మరో గంటలో మూడో ప్రమాద హెచ్చరిక విరమించే అవకాశం ఉందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ముంపునకు గురైన కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరించామని.. ఇప్పటి వరకు 8 సబ్ స్టేషన్ల పరిధిలో కరెంటు సరఫరా పునరుద్ధరించామన్నారు. 

పునరావాస కేంద్రాలు మరికొద్ది రోజులు కొనసాగిస్తాం

కొన్ని పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్లు కొంత మంది తమ ఇళ్లకి వెళ్లిపోయారని.. ఇప్పటికీ ఇంకా 25వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారని తెలిపారు. వరద పూర్తిగా తగ్గిపోయి సాధారణ పరిస్థితి నెలకొనే వరకు మరికొద్ది రోజులు పునరావాస కేంద్రాలు కొనసాగిస్తామని మంత్ర పువ్వాడ తెలిపారు. సీఎం ప్రకటించినట్లు.. ప్రతీ వరద బాధిత కుటుంబానికి 10వేల సాయం నేరుగా వారి బ్యాంకు అకౌంట్లోనే వేస్తామన్నారు. 25కిలోల బియ్యం, 5కిలోల పప్పు దినుసుల సాయం అందిస్తామన్నారు. ఎక్కడ కూడా రోగాల బారిన పడకుండా తగు  చర్యలు తీసుకున్నామన్నారు. 

విభజన ముందు భద్రాచలం ముంపు ఏడు మండలాలు అన్యాయంగా ఏపీకి కేటాయించారని.. ఎన్డీయే ప్రభుత్వం కూడా తెలంగాణా కు ఈ విషయంలో అన్యాయం చేసిందన్నారు. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా మా ఎంపీలు కొట్లాడుతున్నరని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో భద్రాచలం కింద ఉన్న ఏపీ కి కేటాయించిన 5 గ్రామాలు తిరిగి తెలంగాణకు కేటాయించేలా బిల్లు ప్రవేశ పెట్టాలని మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు.