సరైన పాలసీలు ఉంటే... మన క్రిప్టో ఇండస్ట్రీకి డబ్బే డబ్బు

సరైన పాలసీలు ఉంటే... మన క్రిప్టో ఇండస్ట్రీకి డబ్బే డబ్బు

ముంబై:  బ్లూచిప్​ వెంచర్​ క్యాపిటల్​ ఫండ్స్​ ఇండియాలోని క్రిప్టో, బ్లాక్​చెయిన్​ స్టార్టప్స్​లో ఇన్వెస్ట్​ చేయాలనుకుంటున్నా సరయిన పాలసీలు లేకపోవడంతో వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నాయి. ఎక్కువ రిస్కయినా తీసుకోవడానికి సాధారణంగా ఈ వెంచర్​ క్యాపిటల్​ ఫండ్స్​ ముందుంటాయి. ఇదే టైములో కొన్ని ఇంటర్నేషనల్​ ఫండ్స్​ మాత్రం ఇండియన్స్​ పెట్టిన స్టార్టప్​ కంపెనీలలో బెనిఫిట్స్​ను తీసుకుంటున్నాయి.  సెకోవియా, లైట్​ స్పీడ్​, ఎలివేషన్​ క్యాపిటల్​ వంటి ఫండ్స్​ మన దేశంలోని క్రిప్టోకరెన్సీ, బ్లాక్​చెయిన్​ ఇండస్ట్రీ స్టార్టప్స్​లో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నాయి.

రెగ్యులేటరీ ఫ్రేమ్​ వర్క్​ స్పష్టంగా లేకపోవడంతోపాటు, క్రిప్టోకరెన్సీ సంబంధిత కార్యకలాపాలన్నింటిపైనా బ్యాన్​ పెట్టే సూచనలుండటంతో ఇండియాలోని వెంచర్​ క్యాపిటల్​ ఫండ్స్​ ఆ రంగంలోని స్టార్టప్స్​లో పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయి. గ్లోబల్​గా క్రిప్టో, బ్లాక్​చెయిన్​ కంపెనీలలో చాలా ఫండ్స్​ మొత్తం 5.5 బిలియన్​ డాలర్లు ఇన్వెస్ట్​ చేశాయని ఇండియా టెక్​ వైట్​పేపర్​ వెల్లడించింది. ఇండియాలోని కంపెనీలలో  ఇందులో 0.2 శాతం మాత్రమే పెట్టినట్లు పేర్కొంది. ఇండియాటెక్​ అనేది ఇండస్ట్రీ అసోసియేషన్​. ఇందులో కన్జూమర్​ ఇంటర్​నెట్​ స్టార్టప్స్​, యూనికార్న్స్​, ఇన్వెస్టర్లూ కూడా మెంబర్లు. పాలసీలో స్పష్టత లేకపోవడం వల్ల ఇండియాలోని కంపెనీలలోకి రావల్సిన 400 మిలియన్​ డాలర్ల పెట్టుబడులకు బ్రేక్​ పడిందని లెడ్జర్​ప్రైమ్​ (డిజిటల్​ ఎసెట్​ ఇన్వెస్ట్​మెంట్​ కంపెనీ)  ప్రిన్సిపల్ జోయల్​ జాన్​ చెప్పారు.

ఇండియన్లు పెట్టిన క్రిప్టో, బ్లాక్​చెయిన్​ స్టార్టప్స్​లో ఇప్పటికే పాంటెరా క్యాపిటల్​, కాయిన్​బేస్​ వెంచర్స్​తోపాటు, మార్క్​ క్యూబన్​ వంటి ఎంట్రప్రెనూర్లు కూడా పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది జూన్​ 15 నాటికి ఇలా పెట్టిన పెట్టుబడులు మొత్తం 99.7 మిలియన్​ డాలర్లు ఉంటుందని ట్రాక్స్​న్​ డేటా వెల్లడిస్తోంది. ఇండియాలో క్రిప్టో, బ్లాక్​చెయిన్​ సెక్టార్​కి ​ సాఫ్ట్​వేర్​–యాజ్​–ఏ–సర్వీస్​ (శాశ్​)లాగే ఎదిగే కెపాసిటీ ఉందని ఎలివేషన్​ క్యాపిటల్​ వాస్​ భాస్కర్​ చెప్పారు. పేటీఎం, మీషో, స్విగ్గీ వంటి కంపెనీలలో భాస్కర్​ పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో, బ్లాక్​చెయిన్​ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ఉందని, గత ఏడాది కాలంగా చాలా కంపెనీలను తాను కలిశానని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కొన్ని పెట్టుబడులు ఫైనలయ్యే అవకాశాలున్నాయని వెల్లడించారు. మన ఎంట్రప్రెనూర్లు పెట్టిన పాలిగాన్, ఇన్​స్టాడ్​ఆప్​ వంటి వాటి సక్సెస్​ వల్లే ఇక్కడ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి అందరూ క్యూలు కడుతున్నారు. పాలిగాన్​లో ఇథిరియమ్​ కో క్రియేటర్​ విటాలిక్​, ఇన్​స్టాడ్​ఆప్​లో పాంటెరా క్యాపిటల్​లు ఇన్వెస్ట్​ చేశాయి. అయితే 2017తో పోలిస్తే  మన క్రిప్టో ఇండస్ట్రీ పరిస్థితులు ఇప్పుడు మారాయని, ఇండియన్​ డెవలపర్ల కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్​గా ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారని పాలిగాన్​ కో ఫౌండర్​ జయంతి కానాని చెప్పారు. ఈ పెట్టుబడుల రేసులో ఇండియన్​ ఫండ్స్​ తొందరపడకపోతే, ఆపర్చునిటి పోగొట్టుకున్నట్లేనని ఎనలిస్టులు చెబుతున్నారు.