హంగ్ వస్తే.. మళ్లీ ఎన్నికలు పెట్టాలె

హంగ్ వస్తే.. మళ్లీ ఎన్నికలు పెట్టాలె
  •  జమిలి ఎన్నికలపై కేంద్రానికి కోవింద్ కమిటీ నివేదిక 
  • పార్లమెంట్, అసెంబ్లీల్లో అవిశ్వాస తీర్మానం పాస్ అయినప్పుడూ మళ్లీ ఎలక్షన్స్  
  • రాష్ట్రపతి ముర్ముకు 18 వేల పేజీలతో రిపోర్టు అందజేత 
  • ఫస్ట్ ఫేజ్ లో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు కీలక సిఫారసులు చేసిన కమిటీ 

న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికలు  నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన హైలెవల్ కమిటీ సూచించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా రెండు దశల్లో మూడు స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఫస్ట్ ఫేజ్ లో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. రెండో దశలో 100 రోజుల్లోగా లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’పై స్టడీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరుడు సెప్టెంబర్ 2న కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.

 ఈ కమిటీ 191 రోజుల పాటు వివిధ వర్గాల ప్రజలు, నిపుణులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి రిపోర్టు తయారు చేసింది. ఆ రిపోర్టును గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. మొత్తం 18,626 పేజీలున్న రిపోర్టులో కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలని  సూచించింది. వీటిలో చాలా వాటికి రాష్ట్రాల ఆమోదం అక్కర్లేదని తెలిపింది. కాగా, ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చారిత్రాత్మక రోజు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.  

32 పార్టీలు ఓకే.. 15 పార్టీలు నో.. 

జమిలి ఎన్నికలపై ప్రజలు, నిపుణులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిటీ తీసుకుంది. మొత్తం 62 పార్టీలను సంప్రదించగా, అందులో 47 పార్టీలు స్పందించాయి. వీటిలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలపగా, 15 పార్టీలు వ్యతిరేకించాయి. కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం, డీఎంకే, ఎస్పీ తదితర పార్టీలు వ్యతిరేకించిన వాటిలో ఉన్నాయి. బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తదితర పార్టీలు అభిప్రాయాన్ని తెలియజేయలేదు.  ప్రజల్లోనూ మొత్తం 21,558 మంది సలహాలు ఇచ్చారు. 

వీరిలో 80 శాతం మంది జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపారు. కాగా, నలుగురు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లు, 12 మంది హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లు, నలుగురు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, 8 మంది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ల అభిప్రాయాలను కూడా కమిటీ తెలుసుకుంది. వీరిలో ముగ్గురు హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లు, తమిళనాడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పళనికుమార్ జమిలి ఎన్నికలను వ్యతిరేకించారు. 

కమిటీ చేసిన సిఫారసులివే.. 

  •     దేశవ్యాప్తంగా మూడు స్థాయిల్లో రెండు దశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలి. మొదటి దశలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు పెట్టాలి. రెండో దశలో వంద రోజుల్లోగా మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి. 
  •     ఒకవేళ హంగ్ పార్లమెంట్ ఏర్పడినా, అవిశ్వాస తీర్మానం లాంటి పరిస్థితులు వచ్చినా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఇలాంటి సందర్భాల్లో గత లోక్ సభ టర్మ్ లో మిగిలిన కాలానికి మాత్రమే కొత్త లోక్ సభ ఉంటుంది. ఒకవేళ రాష్ట్రాల్లో ఇలా జరిగితే లోక్ సభ టర్మ్ ముగిసే వరకూ కొత్త అసెంబ్లీలు కొనసాగుతాయి. ఇందుకోసం ఆర్టికల్ 83 (పార్లమెంట్ డ్యూరేషన్), ఆర్టికల్ 172 (అసెంబ్లీల డ్యూరేషన్)ను సవరించాలి. ఈ రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అక్కర్లేదు. 
  •     జమిలి ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలి. దీన్ని ఎలక్షన్ కమిషన్ రూపొందించాలి. రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి ఓటర్ ఐడీ కార్డులు జారీ చేయాలి. ఉమ్మడి ఓటర్ల జాబితా కోసం ఆర్టికల్ 325ని సవరించాల్సి ఉంటుంది.  

జమిలి ఎన్నికలు ఎందుకంటే.. 

ప్రస్తుతం మన దేశంలో ఏటా పలు రకాల ఎన్నికలు జరుగుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వాలపై భారం పడుతున్నది. అంతేకాకుండా రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ప్రజలు, కోర్టులు, సిబ్బందిపైనా భారం పడుతున్నది. వ్యాపారాలపైనా ప్రభావం పడుతున్నది. అందుకే జమిలీ ఎన్నికలు అవసరం. జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వీటి ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఇవి దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సహాయపడతాయి. ఎన్నికల్లో పారదర్శకత పెరుగుతుంది. 
  రిపోర్టులో కమిటీ అభిప్రాయం 

రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర: జైరాం రమేశ్ 

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరుతో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ మండిపడ్డారు. ‘‘ప్రధాని మోదీ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన 400 సీట్లు ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నారు. మోదీ కుట్ర ఇప్పుడు బయటపడ్డది. ఆయన ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ పేరుతో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు” అని జైరాం ఆరోపించారు.