రాహుల్​ యాత్రలో మూడు బహిరంగ సభలు

రాహుల్​ యాత్రలో మూడు బహిరంగ సభలు
  • తెలంగాణ తల్లి విగ్రహాన్ని సబ్బండ వర్గాల తల్లిగా మారుస్తం
  • అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా చేస్తం
  • రాష్ట్రానికి ప్రత్యేక జెండాను రూపొందిస్తామని ప్రకటన
  • కాంగ్రెస్​ విస్తృత స్థాయి సమావేశంలో ఆమోదం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాల నంబర్​ ప్లేట్​పై ‘టీజీ’ అని పెట్టుకునే వాళ్లమని, రాష్ట్రం వచ్చాక చరిత్రను కేసీఆర్​ వక్రీకరించి ‘టీఆర్​ఎస్​’కు అనుకూలంగా ‘టీఎస్’​గా మార్చారని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే టీఎస్​ను టీజీగా మారుస్తామని ప్రకటించారు. సోమవారం గాంధీభవన్​లో రేవంత్​ మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు జరిగిన కాంగ్రెస్​ విస్తృత స్థాయి సమావేశంలో ఈ అంశంతోపాటు మరో మూడింటిపై ప్రతిపాదనలు పెట్టి ఆమోదించినట్లు చెప్పారు. మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. 
టీఆర్​ఎస్​ సృష్టించిన తెలంగాణ తల్లికి సబ్బండ వర్గాల ఆమోదం లేదని, కొత్త ప్రతిరూపం సృష్టించుకోవాల్సిన అవసరం ఉందనే ప్రతిపాదన చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి కేసీఆర్​ కుటుంబ సభ్యుల రూపాలను పోలి ఉందని, అది సబ్బండ వర్గాల ప్రతిరూపం కాదని తెలిపారు. ఈ రూపాన్ని కేసీఆర్​ బలవంతంగా తెలంగాణపై రుద్దారని, ఇందుకు తెలంగాణ సమాజం ఆమోదం లేదన్నారు. అందుకే కొందరు కళాకారులతో కాంగ్రెస్​ ప్రత్యామ్నాయ ప్రతిరూపాన్ని తయారుచేయిస్తున్నదని చెప్పారు. సెప్టెంబర్​ 17  వజ్రోత్సవాల సందర్భంగా కొత్త రూపాన్ని గ్రామాల్లో ప్రదర్శించి ప్రజల ఆమోదం పొందుతామన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్నే అధికారంగా స్వీకరిస్తామని రేవంత్​  తెలిపారు.

అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఉద్యమ సమయంలో ఉద్యమ గీతంగా ఆలపించేవాళ్లమని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ గీతాన్ని కేసీఆర్​ కాలగర్భంలో కలిపేశారని ఆయన మండిపడ్డారు. అందెశ్రీ రాసిన గీతాన్ని కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే రాష్ట్ర గీతంగా చేస్తామని ప్రకటించారు. తెలంగాణకు ప్రత్యేకమైన జెండా లేదని, జాతీయ జెండాతోపాటు రాష్ట్ర జెండా కూడా రూపొందించుకోవచ్చని అన్నారు. తెలంగాణకు అలాంటి జెండా లేనందున కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే రాష్ట్ర జెండాను ఆవిష్కరిస్తుందని వివరించారు. ఈ అంశాలను వజ్రోత్సవాల సందర్భంగా ఏడాది పాటు ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పారు. 

రాహుల్​ యాత్రలో మూడు బహిరంగ సభలు

భారత్​ జోడో యాత్రలో భాగంగా మహబూబ్​నగర్​, శంషాబాద్​, జోగిపేటలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని రేవంత్​ అన్నారు. అక్టోబర్​ 24న రాహుల్​యాత్ర కృష్ణా బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. 15 రోజుల పాటు 350 కిలోమీటర్లు సాగే యాత్రలో రోజుకో పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి నేతలు ఆయన వెంట నడుస్తారని 
రేవంత్​ అన్నారు. 

మునుగోడులో డోర్​ టు డోర్​ క్యాంపెయిన్​
మునుగోడు ఉపఎన్నికలో ప్రతి మండలానికి ఒక ముఖ్య నేతను ఇన్​చార్జ్​గా నియమిస్తామని, వీరికి సహాయకులుగా మరో ఇద్దరు ఉంటారని రేవంత్​ చెప్పారు. నియోజక వర్గంలోని 300 బూత్​లకు 150 మంది ఇన్​చార్జులుగా ఉంటారన్నారు. ఈ ఎన్నికను నాయకులు, కార్యకర్తలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని రేవంత్​  పిలుపునిచ్చారు. సెప్టెంబర్​ 18 నుంచి అందరం కలిసి క్షేత్రస్థాయిలో పని చేద్దామని వారికి పిలుపునిచ్చారు. మునుగోడులో రాష్ట్రంలోని 200 మంది నాయకులు తిష్ట వేసి పార్టీ గెలుపు కోసం శ్రమిస్తారని చెప్పారు. సభల వల్ల ఉపయోగం లేదని డోర్​ టు డోర్​ క్యాంపెయిన్​ ఉత్తమమని అన్నారు. విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేష్​ కుమార్​ గౌడ్​, అంజన్​కుమార్​ యాదవ్​, మాజీ మంత్రి షబ్బీర్​ అలీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్​ పాల్గొన్నారు.