కరోనాపై కలిసి ఫైట్​ చేయకుంటే.. 20 లక్షల మంది చనిపోయే ప్రమాదం

కరోనాపై కలిసి ఫైట్​ చేయకుంటే.. 20 లక్షల మంది చనిపోయే ప్రమాదం

న్యూఢిల్లీ: కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​వో) ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. అన్ని దేశాలు కలిసికట్టుగా కరోనాపై పోరాడకపోతే మరణాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాకు సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసరికి చాలామంది ప్రాణాలు కోల్పోతారని చెప్పింది. ‘‘కరోనా కట్టడికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోకపోతే మరణాల సంఖ్య 20 లక్షలకు చేరొచ్చు. ఇది ఊహించలేనంత పెద్ద సంఖ్య. కానీ జరిగేందుకు అవకాశం ఉంది” అని డబ్ల్యూహెచ్​వో ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ హెడ్ మైక్ ర్యాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కరోనాతో చనిపోయినోళ్ల సంఖ్య ఇప్పటికే 10 లక్షలకు చేరువైందని తెలిపారు. వైరస్ కట్టడికి సరైన చర్యలు తీసుకోకపోయినా, వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోయినా మరణాల సంఖ్య డబుల్ అవుతుందని ఆయన హెచ్చరించారు. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయని, దీనికి యువతను బద్నాం చేయొద్దని ర్యాన్ అన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ రూల్స్ ను సడలించడంతో యువత బయట తిరుగుతున్నారని, వారే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని చెప్పారు. మరోవైపు ఇండోర్ మీటింగ్ లు కూడా వైరస్ వ్యాప్తికి కారణమన్నారు.

‘‘కోవాక్స్’’లోకి 159 దేశాలు..

అన్ని దేశాలకూ వ్యాక్సిన్ అందజేయాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ వో ‘‘కోవాక్స్” స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో ఇప్పటి వరకు 159 దేశాలు చేరాయని డబ్ల్యూహెచ్ వో సీనియర్ అడ్వైజర్ బ్రూస్ ఐల్వర్డ్ తెలిపారు. డబ్ల్యూహెచ్ వోలో సభ్య దేశం కానప్పటికీ, తైవాన్ స్కీమ్ లో చేరిందని చెప్పారు. మరో 34 దేశాలు దీనిపై ఆలోచిస్తున్నాయన్నారు. ‘‘కోవాక్స్’’లో చేరే విషయమై చైనాతోనూ చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకం కోసం అవసరమైన గైడ్​ను రిలీజ్ చేశామని డబ్ల్యూహెచ్​వో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మారియాంజెలా సిమావో తెలిపారు. దీనిపై ప్రజలు అక్టోబర్ 8లోపు అభిప్రాయం చెప్పొచ్చన్నారు.