25 రోజులు కష్టపడితే ఫలితం మనదే : వంశీచంద్​రెడ్డి

25 రోజులు కష్టపడితే ఫలితం మనదే : వంశీచంద్​రెడ్డి

 షాద్ నగర్, వెలుగు: దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని మహబూబ్​నగర్​కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విమర్శించారు. ధర్మం కోసం దేవుడిని పూజించాలి కానీ.. రాజకీయం కోసం కాదన్నారు. సోమవారం షాద్ నగర్ లో ఫరూఖ్ నగర్, షాద్ నగర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వంశీ చంద్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ.. పాతిక రోజులు కష్టపడి పనిచేస్తే తాను ఎంపీగా గెలుస్తానన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసే విషప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

 ఎన్నికల కోడ్ కారణంగానే రైతు బంధు రాలేదని, లోక్​సభ ఎన్నికల తర్వాత వారి వారి ఖాతాలలో డబ్బు జమ చేస్తామని చెప్పారు. త్వరలో ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. డీకే అరుణ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుందో ఆమెకు కూడా తెలియదని, చివరికి ఎంఐఎంలోకి వెళ్తుందని ఎద్దేవా చేశారు. జడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, నాయకులు బాబర్ ఖాన్, రఘు, తిరుపతిరెడ్డి, ఇబ్రహీం, యాదయ్య, ముబారక్, బాలారాజ్ గౌడ్, విశ్వం, జామృత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.