హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని, వీటి మధ్య అంతర్గత ఒప్పందం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై కేసులు ఉన్నాయని భయంతో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సీపీఐ స్టేట్ ఆఫీసు మఖ్దూం భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులు ఉన్నాయని ఉద్దేశంతో కీలక ఎన్నికల్లో బీజేపీ అనుకూల వైఖరిని బీఆర్ఎస్ తీసుకుందన్నారు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ అదే వైఖరిని అవలంబిస్తుందని దుయ్యబట్టారు.
మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను, ఓటు చోరీని తిప్పికొట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘సర్’ పేరుతో ప్రజల ఓటు హక్కుకు భంగం కలిగిస్తున్నదని, బీజేపీకి అనుకూలంగా లేని వారికి ఓటు హక్కును తిరస్కరిస్తున్నారని, ఇలాంటి అనేక కుట్రలపై ఆధారపడి అధికారం నిలబెట్టుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మావోయిస్టులు సాయుధ పోరాటం విరమించాలి
“కొంతమంది మావోయిస్టులు మంచి ఉద్దేశంతో లొంగిపోతున్నారని, ఇప్పటికీ మావోయిస్టుల పట్ల ప్రజల కు అభిమానం ఉందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ, అనంతరం పునర్ విమర్శ చేసుకుని సాయుధ పోరాటాన్ని విరమించిందని’ కూనంనేని పేర్కొన్నారు . ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులను అత్యంత భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని చెప్పారు. మావోయిస్టులు కూడా మంచి ఆలోచన చేసి సాయుధ పోరాటాన్ని విరమించాలని విజ్ఞప్తి చేశారు.
