
- కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలు రాఫెల్ లాంటి యుద్ధ విమానాలే నడుపుతుంటే, ఆర్మీ లీగల్ బ్రాంచ్‌లో ఆడవాళ్లను ఎందుకు తీసుకోవట్లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జడ్జి అడ్వకేట్ జనరల్(జేఏజీ) పోస్టుల్లో మహిళలు తక్కువగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ పోస్టుల్లో 50% మహిళా కోటా నిబంధన ఉన్నప్పటికీ ఎందుకు మహిళలను నియమించట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఇద్దరు ఆర్మీ మహిళా అధికారులు అర్షనూర్ కౌర్, అస్థా త్యాగి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 8న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఇద్దరు మహిళా అధికారులు జేఏజీ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షలో వరుసగా 4, 5 ర్యాంకులు సాధించారు. మగవాళ్ల కంటే మెరిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ తమకు పోస్టులు కేటాయించలేదని వారు ఆరోపించారు.
మహిళలకు కేటాయించిన పోస్టులు తక్కువగా ఉన్నాయని చెప్పి తమను ఎంపిక చేయలేదని, మొత్తం 6 పోస్టుల్లో మహిళల కోటా ఖాళీల్లేవంటూ తమను అపాయింట్ చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలకు రాఫెట్ ఫైటర్ జెట్ నడిపేందుకు పర్మిషన్ ఉన్నప్పుడు, జేఏజీలో ఎక్కువమంది మహిళలను ఎందుకు అనుమతించట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. జెండర్‌తో సంబంధం లేకుండా అన్నీ న్యూట్రల్ పోస్టులే అయినప్పుడు మహిళలకు తక్కువగా ఎందుకు కేటాయిస్తున్నారని నిలదీసింది.
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు వివరణ ఇచ్చారు. ఆర్మీలో ఆడవాళ్లు, మగవాళ్లు వేర్వేరు సర్వీస్ సెలెక్షన్ బోర్డుల ద్వారా ఎంపికవుతారని తెలిపారు. మగవాళ్లు ఆర్టిలరీ యూనిట్లలో శిక్షణ పొందుతారని, ఇందులో వీళ్లు టోడ్ గన్స్, మల్టిపుల్ రాకెట్ లాంచర్లను ఎలా నిర్వహించాలో నేర్చుకునే కంబాట్ రోల్ మెయింటెయిన్ చేస్తారని చెప్పారు. మహిళలు కంబాట్ రోల్‌కు సిద్ధం కారని చెప్పారు. అందుకే సెలెక్షన్ ప్రాసెస్‌లో వేర్వేరు ఎంపికలు అవసరమవుతాయని కోర్టుకు వివరించారు.