ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్‌గా ఉండటానికి జిమ్‌కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన చిన్ననాటి మిత్రుడు 'సైకిల్' తొక్కితే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మనసొంతమవుతాయి. బరువు తగ్గడం దగ్గర నుంచి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పును తగ్గించే వరకు సైక్లింగ్ ఎలా సహాయపడుతుందో అంతర్జాతీయ పరిశోధనలతో సహా తెలుసుకుందామా....
సైక్లింగ్ వల్ల లాభాలు
*గుండెకి చాలా మంచిది. కండరాలు బలంగా, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. కీళ్ల పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఒంట్లో కొవ్వు తగ్గుతుంది. రోగాలు రాకుండా నివారించొచ్చు. యాంగ్జెటీ, డిప్రెషన్ తగ్గుతాయి.
*ఎక్సర్సైజ్ చేయడం వల్ల వారానికి రెండు వేల క్యాలరీలు తగ్గితే, సైకిల్ తొక్కడం వల్ల గంటకు మూడు వందల క్యాలరీలు తగ్గుతాయని ఒక స్టడీలో తేలింది. అంతేకాదు, రోజుకి అరగంట సేపు సైకిల్ తొక్కినా, సంవత్సరానికి ఐదు కిలోలు తగ్గొచ్చని బ్రిటీష్ రీసెర్చ్ లు చెప్తున్నాయి.
*సైకిల్ తొక్కడం వల్ల గుండె కండరాలు ఫిట్ గా ఉంటాయి. ఊపిరితిత్తులు, గుండె, రక్తప్రసరణ పనితీరు మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారిస్తుంది.
*పద్నాలుగేండ్లపాటు 30వేల మందిపై జరిపిన డానిష్ రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం, రెగ్యులర్గా సైకిల్ తొక్కే 20 నుంచి 93 ఏండ్ల వాళ్లకు హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పు తప్పిందట.
*రెగ్యులర్ సైకిల్ తొక్కడం వల్ల బొవెల్, బ్రెస్ట్ క్యాన్సర్లు రావు.
*రోజూ అరగంట పైన సైకిల్ తొక్కే వాళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువని ఫిన్లాండ్ రీసెర్చ్లో తేలింది.
*సైకిల్ తొక్కడం వల్ల దృఢత్వం, బ్యాలెన్స్, కో- ఆర్డినేషన్ మెరుగవుతుంది. దానివల్ల పడిపోవడం వంటి ఇబ్బందులు ఉండవు.
*ట్రైసైకిల్ వాడేవాళ్లు చేతులు వాడతారు. అలా కూడా బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు.
ట్రైసైకిల్ తయారి
మొట్టమొదట ట్రైసైకిల్ తయారుచేసింది జర్మనీకి చెందిన స్టెఫన్ ఫార్ ఫ్లెర్. ఈయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్. 1600ల కాలంలో దీన్ని కనిపెట్టాడు. వాచిలు తయారుచేస్తుండే స్టెఫన్ నడవలేడు. దాంతో 'ఉన్నచోటనే ఉండిపోకూడదు. ఎలాగైనా సరే నేను కదలాలి' అనుకున్నాడు. చేతులతో నడిపేలా ఒక వెహికల్ తయారు చేశాడు. 1789లో పెడల్స్ వాడేలా మూడు చక్రాల సైకిల్ని డెవలప్ చేశారు ఇద్దరు ఫ్రెంచ్ ఇన్వెంటర్లు. ఆ తర్వాత బ్రిటీష్ ఇన్వెంటర్ డెనిస్ జాన్సన్ పేటెంట్ కూడా తీసుకున్నాడు.
సైకిల్ ఫ్యాక్టరీ వచ్చాక కూడా ఎన్నో ఎక్స్ పరిమెంట్స్ జరిగాయి. రకరకాల సైకిల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. మొదటి సైకిలికి పెడల్స్ లేవు. ఆ తర్వాత వచ్చినవాటికి చెయిన్ లేదు. అలా రకరకాల మార్పులు జరిగి ఒక పర్ఫెక్ట్ సైకిల్ రెడీ కావడానికి చాలాకాలమే పట్టింది. దాన్ని తయారు చేసింది.. స్టార్లే కంపెనీ. 1886లో 'రోవర్' అనే మోడల్ కనిపెట్టారు. అదే మనం ఇప్పుడు వాడుతున్న సైకిల్. దాన్ని గుర్తుగా బ్రిటీష్ మోటార్ మ్యూజియంలో భద్రంగా ఉంచారు.
1870లో సైకిల్ క్లబ్ లు కూడా వచ్చాయి.1878లో అట్లాంటిక్ లో 'ది బైసైకిల్ టూరింగ్ క్లబ్' నడిపారు.1888లో ఇంగ్లాండ్లోని నాటింగ్హామ్లో రాష్ట్రీ బైసైకిల్ కంపెనీ మొదలు పెట్టారు. అది సైకిల్స్ తయారుచేసే అతిపెద్ద కంపెనీగా ఫేమస్ అయింది.
టూర్లకు వెళ్లడానికి, పర్వతాల్లో నడపడానికి, ఫిజికల్ ఫిట్ నెస్ కి, రకరకాల సైకిల్ రేసింగ్లకు... సైకిల్ వాడుతున్నారు. వాటిలో కొన్ని రకాలు చూస్తే...... మామూలుగా సైకిల్ అంటే రెండు చక్రాలుండాలి. కానీ, ఒకటి, మూడు, నాలుగు చక్రాలుండేవి కూడా ఉన్నాయి. ఒక చక్రం ఉంటే 'యూనీ సైకిల్', మూడుంటే 'ట్రైసైకిల్', నాలుగుంటే 'క్వాడ్ర సైకిల్' అంటారు. మామూలు సైకిల్ రకాల్లో యుటిలిటీ, మౌంటైన్, రేసింగ్, టూరింగ్, హైబ్రిడ్, క్రూయిజర్, బిఎంఎక్స్ ఉన్నాయి. కొంచెం తక్కువగా టాండెమ్, లో రైడర్స్, టాల్, ఫిక్స్డ్ గేర్, ఫోల్డింగ్ మోడల్స్, యాంబిషియస్, కార్గో, రికంబెంట్స్, ఎలక్ట్రిక్ సైకిల్స్ అనే రకాలు వాడుతున్నారు.
