ఈ యోగాసనాలు చేస్తే.. గుండె బలంగా ఉంటుంది

ఈ యోగాసనాలు చేస్తే.. గుండె బలంగా ఉంటుంది

మొన్న బాలీవుడ్ నటుడు సిద్దార్ధ శుక్లా.. నిన్న అనంతపురంలో ఇరవై ఏండ్ల కుర్రాడు. ఇద్దరూ చిన్న వయసులో హార్ట్ టాక్ తో చనిపోయారు. వాళ్లే కాదు ఈ మధ్యకాలంలో మనచుట్టూ చాలామంది ఇలానే ప్రాణాలు వదులుతున్నారు. ఇప్పుడు ఉన్న స్ట్రెస్, టెన్షన్స్, గుండె సమస్యలు పెరిగిపోతున్నాయి. గుండెను కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో యోగా కూడా ఒక మార్గమే.

ప్రతి రోజు యోగా చేస్తే గుండె హెల్దీగా పనిచేస్తుంది. దాంతో పాటు స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ లాంటివి దూరమవుతాయి. యోగాసనాలు వేస్తే రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అవి ఎలా వేయాలంటే?

త్రికోణాసనం

• యోగా మ్యాట్ పైన నిటారుగా నిలబడాలి. రెండు కాళ్లు వీలైనంత దూరంగా పెట్టాలి. కుడిపాదం బయటి వైపుకు తిప్పి, ఎడమ పాదం కొంచెం లోపలివైపుకు ఉంచాలి.

• ఊపిరి పీల్చి రెండు చేతులు పైకి లేపాలి. తర్వాత గాలి వదులుతూ కుడి చేతితో కుడి పాదాన్ని పట్టుకోవాలి. ఎడమ చేతినిపైకి లేపాలి. వేళ్లు సీలింగ్ వైపుకు ఉంచి పైకి చూడాలి.
• ఈ ఆసనం వేసేటప్పుడు చెయ్యి, పాదం, మెడ ఒకే లైన్లో ఉండాలి. ఇలా కుడివైపు 2 - 3 నిమిషాల పాటు బ్యాలెన్స్ చేశాక ఇంకో వైపు చేయాలి.

సేతు బంధాసనం

• కాళ్లను వెడల్పుగా చేస్తూ మ్యాట్ పైన పడుకోవాలి. రెండు చేతులను మ్యాట్ పైన
ఉంచాలి.
• ఊపిరి పీల్చుకుంటూ పాదాలను నేలపైనే ఉంచి నడుం మాత్రం పైకి లేపాలి. భుజాలు, అరచేతులు నేలకు ఆనిస్తూ నడుము భాగం వీలైనంత పైకి లేపాలి.
• ఇలా కొద్దిసేపు చేశాక మామూలు స్థితికి వచ్చి రిలాక్స్ అవ్వాలి.

గోముఖాసనం

• మ్యాట్ పైన పద్మాసనంలో కూర్చోవాలి. కుడి కాలిని ఎడమ కాలు తొడపై, ఎడమ కాలిని కుడి కాలు తొడ కింద ఉంచాలి.
• ఎడమ చేతిని పైకి లేపి వీపు పైన ఉంచాలి. కుడి చేతిని కిందివైపు నుంచి వెనక్కి వంచి ఎడమ చేతి వేళ్లను పట్టుకోవాలి.
• 30 సెక్షను చేశాక ఎడమవైపున కూడా ఇలానే చేయాలి.

పశ్చిమోత్తనాసనం

• కాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి. చేతులు రెండు కాళ్ల పక్కన ఉంచాలి.
• తర్వాత రెండు చేతులను పైకి లేపాలి. ఊపిరి తీసుకుంటూ వెన్నెముకను నిటారుగా పెట్టాలి. • మెల్లగా ఊపిరి వదులుతూ ముందుకు వంగాలి.
• తలను కాళ్లకు ఆనిస్తూ, రెండు చేతులతో రెండు పాదాలను గట్టిగా పట్టుకోవాలి. ఈ ఆసనం వేస్తున్నప్పుడు పొట్ట.. తొడలపై ఉండేలా చూడాలి. అలా కొన్ని సెకన్లు ఈ పొజిషన్లో ఉండి తిరిగి మామూలు స్థితికి వెళ్లాలి.

అర్ధ మత్స్యేద్రాసనం

• కాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి.
• కుడి కాలును మ్యాట్ పైనే ఉంచి ఎడమ కాలును వంచాలి. తర్వాత ఎడమ కాలు పాదాన్ని కుడి మోకాలుకు ఆనించాలి.
• కుడి చేతిని పైకి లేపి ఎడమ మోకాలిపై ఉంచాలి. ఎడమ చేతిని నేలమీద ఉంచి ముఖం,
భుజాలు, నడుము ఎడమవైపుకు తిప్పి ఎడమ చేతిని చూడాలి.
• రెండు నిమిషాల తర్వాత మరోవైపు కూడా ఇలానే చేయాలి.