వర్కవుట్​ తర్వాత ప్రొటీన్ షేక్స్ తాగితే..

వర్కవుట్​ తర్వాత ప్రొటీన్ షేక్స్ తాగితే..

బరువు తగ్గాలనుకునేవాళ్లు వర్కవుట్స్​ చేయడంతో పాటు డైట్​రూల్స్​ పక్కాగా పాటిస్తారు. కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటారు. కొందరేమో పీనట్ బటర్, చాక్లెట్ అరటిపండుతో ప్రొటీన్​ షేక్​ చేసుకొని తాగుతారు.  మరికొందరు వర్కవుట్ తర్వాత  ప్రొటీన్ పౌడర్ తీసుకుంటారు. ప్రొటీన్ షేక్స్, ప్రొటీన్ పౌడర్ తీసుకుంటే  బరువు తగ్గుతారా? అనే సందేహం ఉంటుంది చాలామందికి.  ఇదే విషయం గురించి న్యూట్రిషన్ కన్సల్టెంట్ వివేక్ నేవార్ ఏం చెప్తున్నారంటే... 

మెటబాలిజం రేటు ఎక్కువ ఉన్నవాళ్లు తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంది. అందుకని చాలామంది ప్రొటీన్  ఫుడ్ ఎక్కువ తింటారు. కొందరు ప్రొటీన్​ షేక్స్ తాగుతారు. ప్రొటీన్​ ఎక్కువ తీసుకుంటే  మెటబాలిజం వేగంగా జరగడమే కాకుండా క్యాలరీలు తొందరగా కరుగుతాయి. అంతేకాదు ఆకలిని కంట్రోల్ చేసే లెప్టిన్, గ్రెలిన్ వంటి హార్మోన్​ లెవల్స్ మారతాయి. ప్రొటీన్ షేక్స్ తాగడం వల్ల ఆకలి వేయదు. శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు రోజుకి సరిపోను ప్రొటీన్​ తీసుకుంటే శరీరంలో ఫ్యాట్ చేరదు. కండరాల సైజ్ కూడా తగ్గదు. 

వర్కవుట్​ తర్వాత ప్రొటీన్ షేక్స్ తాగితే..  21 నుంచి 25 గ్రాముల ప్రొటీన్ శరీరానికి అందుతుంది. దాంతో కండరాల అలసట తగ్గుతుంది కూడా. అంతేకాదు తినాలనే కోరికని పెంచే హార్మోన్లను కంట్రోల్ చేస్తాయి ప్రొటీన్లు. అందుకని ప్రొటీన్లు ఎక్కువ ఉండే ఫుడ్ తినేవాళ్లకు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. తొందరగా ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గుతారు.

ప్రొటీన్ పౌడర్ వాడుతుంటే...

ప్రొటీన్ పౌడర్​లో వే ప్రొటీన్ ఐసోలేట్, హైడ్రోలైసేట్​ ఉంటాయి. వీటిలో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ. అయితే అదనపు చక్కెర, అడిటివ్స్ వంటివి లేని ప్రొటీన్​ పౌడర్ వాడితే రిజల్ట్ ఉంటుంది. వే ప్రొటీన్​ని తక్కువ మోతాదులో నీళ్లు లేదా పాలు, పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.   అయితే, డాక్టర్​ సలహా తీసుకున్న తర్వాతే ప్రొటీన్ పౌడర్ వాడితే మరీ మంచిది.