సెల్ఫోన్ పోయిందా..ఈ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే మీ ఫోన్ దొరికినట్లే

సెల్ఫోన్ పోయిందా..ఈ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే మీ ఫోన్ దొరికినట్లే

రంగారెడ్డి: మీ సెల్ ఫోన్ పోయినా.. దొంగిలించబడినా..CEIR యాప్ లో నమోదు చేసుకుంటే పోలీసులు స్వాధీనం చేసుకొని అప్పగిస్తారని రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం (డిసెంబర్21) రాజేంద్ర నగర్ డీసీపీ కార్యాలయంలో 57 మంది బాధితులకు  సెల్ ఫోన్లు అప్పగించారు. డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం టెలిక సంస్థ ద్వారా CEIR యాప్ తీసుకొచ్చిందని..ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. సెల్ ఫోన్  ఎక్కడైనా పడిపోయినా.. ఎవరైనా దొంగిలించినా .. CEIR యాప్ లో వివరాలు నమోదు చేస్తే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తారని తెలిపారు. గతంలో ఈ యాప్ ద్వారా 200 మంది బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించామని డీసీపీ గుర్తు చేశారు. 

57 సెల్ ఫోన్లు అందజేత

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 33, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులను పిలిపించి అప్పగించినట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. గతంలో సెల్ ఫోన్లు పోతే తీవ్ర ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు ఎంతో సులువుగా ఉందని తెలిపారు. ప్రస్తుతం సెల్ ఫోన్లు పోతే ఎఫ్ఐఆర్ నమోదు, కోర్టు వ్యవహారాలు అలాంటివి ఏమీ లేవని, పోలీసులు బాధితులను పిలిపించి అప్పగిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు సీఐఈఆర్ యాప్ వినియోగిస్తే బాధితులతో పాటు పోలీసులకు ఎంతో సులభంగా ఉంటుందన్నారు. సి ఈ ఐ ఆర్ యాప్ పై విరివిగా ప్రచారం నిర్వహించి ప్రజలు వినియోగించేలా మీడియా చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్, అత్తాపూర్ ఇన్స్పెక్టర్లు  నాగేంద్రబాబు, పులి యాదగిరి పలువురు ఎస్సైలు పోలీసు సిబ్బందిపాల్గొన్నారు.