కష్టకాలంలో ఆసరాగా అటల్‌ పెన్షన్ యోజన

కష్టకాలంలో ఆసరాగా అటల్‌ పెన్షన్ యోజన
  • అటల్‌ పెన్షన్ యోజన.. కష్టకాలంలో ఆసరా
  • అటల్ పెన్షన్ యోజనతో ఎన్నో లాభాలు
  • రిటైర్ మెంట్ తరువాత పెన్షన్
  • పన్ను లాభాలు వర్తిస్తాయి
  • బీమా ధీమా కూడా ఉంటుంది

న్యూఢిల్లీ: రిటైర్మెంట్ తరువాత లేదా వయసు పైబడిన తరువాత జీవితం గడవాలంటే ఏదో విధంగా కొంత మొత్తం నెలానెలా చేతికి అందాలి. ఉద్యోగులకు పెన్షన్‌‌ వస్తుంది కానీ పేదలకు, కార్మికులకు, కూలీలకు మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇలాంటివారికి నెలకు కొంత మొత్తం పెన్షన్‌‌ రూపంలో చెల్లించేందుకు కేంద్రం అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)ను 2015లో తీసుకొచ్చింది. ఈ స్కీములో చేరిన వారి వయసు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు ఒకసారి పెన్షన్ వస్తుంది. జాబ్‌‌ సెక్యూరిటీ లేని అసంఘటిత రంగంలోని కార్మికులు ఏపీవైలో తప్పక చేరాలి. ఏపీవైలో చేరడం చాలా ఈజీ. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏపీవై యాప్‌‌ని డౌన్‌‌లోడ్ చేసుకొని రిజిస్టర్‌‌ కావాలి. యాప్‌‌లో  ఖాతా సమాచారాన్ని, బ్యాలెన్స్‌‌ను, స్టేట్‌‌మెంట్లను చూసుకోవచ్చు. వీలైనంత ఎక్కువ మందిని పథకంలో చేర్చేందుకు ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన రూల్స్ చాలా ఈజీ చేసింది. దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడు అయి ఉండాలి. దరఖాస్తు చేసినప్పుడు వయస్సు 18– 40 ఏళ్ల మధ్య ఉండాలి. కేవేసీ కంప్లయంట్ బ్యాంక్ ఖాతా తప్పనిసరి. ఆధార్‌‌ కార్డు, మొబైల్‌‌ నంబరు తప్పనిసరి.

ఏపీవై ఫీచర్లు:
1.నెల లేదా మూడు నెలలు లేదా ఆర్నెళ్లకు ఒకసారి ఏపీవై ప్రీమియం చెల్లించవచ్చు. పాలసీహోల్డర్‌‌ వయసు, స్కీమ్‌‌ ఇన్‌‌స్టాల్‌‌మెంట్లు, 60 సంవత్సరాల తర్వాత అతడు కోరుకునే మొత్తాన్ని బట్టి ప్రీమియాన్ని నిర్ణయిస్తారు. 
2. పాలసీహోల్డర్‌‌ కట్టిన ప్రీమియాన్ని బట్టి నెలకు రూ.వెయ్యి, రూ. రెండు వేలు, రూ. మూడువేలు, రూ. నాలుగు వేలు,  రూ.ఐదు వేలు వస్తాయి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల తరువాత నెలకు రూ.రెండు వేల పెన్షన్‌‌ కావాలంటే నెలకు రూ.231 చొప్పున.. అంటే ఏడాదికి రూ.2,772 చెల్లించాలి. 
3.  స్కీమ్ ముగియక ముందే కట్టిన డబ్బును వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు.  తీవ్రమైన అనారోగ్యం వంటి అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే డబ్బు వాపసు ఇస్తారు. 
4. ఏపీవై అప్లికేషన్లను ఆన్‌‌లైన్ లేదా ఆఫ్‌‌లైన్‌‌లోనూ సమర్పించవచ్చు. ఆఫ్‌‌లైన్ దరఖాస్తును బ్యాంక్ బ్రాంచ్‌‌లో ఇవ్వాలి.
5. పాలసీహోల్డర్ అకౌంట్‌‌ నిర్వహణకు కొంత మొత్తం చెల్లించాలి. లేకపోతే నెలవారీ కిస్తీలో రూ. 100కు రూపాయి చొప్పున జరిమానా వేస్తారు.
6. పాలసీహోల్డర్లకు జీవిత భాగస్వామి డిఫాల్ట్ నామినీ కాబట్టి  సబ్‌‌స్క్రయిబర్ మరణిస్తే, జీవిత భాగస్వామికి డెత్‌‌ బెనిఫిట్స్‌‌ దక్కుతాయి.  కట్టిన కిస్తీల ఆధారంగా, 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, వారి ఖాతాకు  పెన్షన్ ఆటోమేటిక్‌‌గా క్రెడిట్ అవుతుంది. కనీసం రూ.వెయ్యి వస్తుంది.
7. ఏపీవై పాలసీహోల్డర్లకు ప్రభుత్వం పన్ను ప్రయోజనాలు కల్పిస్తోంది. సెక్షన్ 80సీ కింద మినహాయింపుతో పాటు, అటల్ పెన్షన్ యోజన ద్వారా వచ్చే మొత్తంలో రూ.50 వేలపై పన్ను రాయితీ ఇస్తారు. బహుమతుల వచ్చినా సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.