ఎల్​కేజీలో సీటు కావాలన్నా.. టెస్ట్ రాయాల్సిందే!

ఎల్​కేజీలో సీటు కావాలన్నా.. టెస్ట్ రాయాల్సిందే!

 

  • ఎల్​కేజీలో సీటు కావాలన్నా.. టెస్ట్ రాయాల్సిందే!
  • కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఇష్టారాజ్యం..  టెస్టులు పెట్టొద్దన్న నిబంధనలు గాలికి 
  • ఇంటర్మీడియెట్​ వరకూ ఇదే దుస్థితి.. పట్టించుకోని ఎడ్యుకేషన్ అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. స్కూల్, కాలేజీ అనే తేడా లేకుండా ప్రవేశపరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు ఇస్తున్నాయి. చిత్రంగా ఎల్​కేజీ, యూకేజీ పిల్లలకూ పరీక్షలు పెడుతున్నారు. నిబంధనల ప్రకారం ఎంట్రెన్స్ టెస్టులు పెట్టి.. అడ్మిషన్లు ఇవ్వొద్దనే విషయం తెలిసినా, పట్టించుకోవడం లేదు. వీటిని ఆపాల్సిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు.. పట్టించుకోవడం లేదు. స్టేట్​లో కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు సుమారు11 వేలు ఉన్నాయి. వాటిలో 30 లక్షల మందికి పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. జూన్ 12న 2023–-24 విద్యాసంవత్సరం ప్రారంభం కానుండగా, కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఇప్పటికే అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి.

ఏప్రిల్ నుంచే అడ్మిషన్లు

రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు 2022–23  విద్యా సంవత్సరం ముగియక ముందే.. మార్చి, ఏప్రిల్ నుంచే 2023-–24 అకడమిక్​ ఇయర్​కు అడ్మిషన్లు ప్రారంభించాయి. టెస్టులు పెట్టి.. వాటిలో మేనేజ్‌‌మెంట్లు నిర్ణయించిన మార్కులు వస్తేనే, సీట్లు ఇస్తున్నాయి. లేదంటే అడ్మిషన్ లేనట్టే. టెస్టు రాసేందుకు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఆన్​లైన్​లో దరఖాస్తులు తీసుకుంటుండగా, కొన్ని నేరుగా స్కూళ్లలో ఫారాలు ఇస్తున్నాయి. దీనికి ఒక్కో స్కూల్​లో రూ.500 నుంచి రూ.5,500 వరకు వసూలు చేస్తున్నాయి. సీటు వచ్చినా, రాకపోయినా ఈ డబ్బులు తిరిగి ఇవ్వరు. ఎల్​కేజీ, యూకేజీ క్లాసులకూ టెస్టులు పెడుతుండటంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇంటికి దగ్గర్లో ఉందనో, మంచి స్కూల్​ అనో.. చేసేదేమీ లేక తల్లిదండ్రులు పరీక్షలు రాయిస్తున్నారు.  

పట్టించుకోని ఆఫీసర్లు

విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకూ అడ్మిషన్​ టెస్టులు నిషేధం. కానీ, కొన్ని మేనేజ్​మెంట్లు తమ వెబ్​సైట్లలోనే పరీక్షల గురించి బహిరంగంగా వెల్లడిస్తున్నాయి. అయినా, అధికారులు పట్టించుకోవడం లేదు. స్టూడెంట్​ యూనియన్లు ఫిర్యాదు చేసినా.. ఆ స్కూళ్లవైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పందించి, అడ్మిషన్ టెస్టులు పెడుతున్న స్కూల్ మేనేజ్మెంట్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

విద్యానగర్​కు చెందిన మహేశ్.. తన ఇంటికి దగ్గర్లోని ఓ ప్రైవేటు స్కూల్​లో తన ఇద్దరు కొడుకులను చేర్పించాలనుకు న్నాడు. వారికి యూకేజీ, మూడో తరగతిలో అడ్మిషన్లు కావాలని స్కూల్​ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రతినిధిని కోరాడు. కానీ, ఇద్దరూ టెస్టులు రాయాలని, వాటిలో పాసైతేనే సీటు ఇస్తామని తెలిపారు. చిన్నపిల్లలకు ఏం టెస్టు అని అడగగా, తమ స్కూల్ పాలసీ అంతే అని చెప్పారు. చేసేదేమీ లేక మహేశ్​ తన కొడుకులతో పరీక్షలు రాయించాడు. యూకేజీలో సీటు కోసం చిన్న కొడుకుకు ఇంగ్లిష్, మ్యాథ్స్​లో.. థర్డ్  క్లాస్​ సీటు కోసం పెద్ద కొడుకుకు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్​ ల్లో ఎగ్జామ్ పెట్టారు. ఇద్దరూ పాస్ కావడంతో వారికి సీట్లు ఇస్తామని మేనేజ్​మెంట్​ చెప్పింది.