
- గురువారం - కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
గద్వాల, వెలుగు: నడిగడ్డ ప్రాంతంలో నెలకొన్న సీడ్ కొనుగోలు సంక్షోభానికి తెరపడింది. జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు గురువారం కలెక్టరేట్ లో సీడ్ కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని 16 సీడ్ కంపెనీలు రాతపూర్వకంగా హామీ ఇచ్చాయి. కొన్ని రోజులుగా సీడ్ కొనుగోలు విషయంలో అస్పష్టత ఉండటంతో, గురువారం ఉదయం రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. కలెక్టర్ సంతోష్ ఎన్‌యు, రాశి, కావేరి, వేద, శ్రీరామ, ఖుషిదన్, నాథ్ తదితర 16 కంపెనీల ప్రతినిధులతో కలెక్టరేట్ లో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీడ్ ఇచ్చిన కంపెనీలు పంట కొనకుండా రైతులను మోసం చేస్తే చీటింగ్ కేసులు పెడతామని హెచ్చరించారు.
కంపెనీలు తమ లెటర్‌ప్యాడ్‌పై రాతపూర్వక హామీ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో 16 కంపెనీలు సీడ్ కొంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చాయి. ఇప్పటివరకు 40 వేల ఎకరాల్లో ఫౌండేషన్ సీడ్ పంపిణీ జరిగింది. మిగతా 15 కంపెనీలతో కూడా త్వరలో చర్చలు జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, అగ్రికల్చర్ జేడీ సుచరిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.