
- లైంగిక దోపిడీకి గురవుతున్న బాధితులు
- మానవతా సాయం మాటున చీకటి కోణం
గాజాస్ట్రిప్: యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలోని ప్రజలు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో రోజురోజుకు ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. పలు సంస్థలు మానవతా సాయం కింద స్వచ్ఛందంగా పంపిణీ చేస్తున్న ఆహారం అందరికీ అందట్లేదు. దీంతో తినేందుకు ఫుడ్ దొరక్క అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
తమ పిల్లలకు భోజనం కావాలంటే బదులుగా వాలంటీర్ల కోరిక తీర్చాల్సిన దుస్థితి ఏర్పడింది. కుటుంబాన్ని సాకేందుకు తమ శరీరాన్ని తాకట్టు పెట్టాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మానవతా సాయం మాటున ఇలాంటి చీకటి కోణాలున్నట్లు ఓ ఇంటర్‌నేషనల్ మీడియా చేసిన సర్వేలో తేలింది.
ఉపాధి ఆశ చూపి లొంగదీసుకుంటున్నరు
యుద్ధంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఉపాధి లేక ఆహారం దొరకట్లేదు. యునైటెడ్ నేషన్స్, యునిసెఫ్‌తో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు గాజాలో ఆహారం, దుస్తులు, మెడిసిన్ పంపిణీ చేస్తున్నాయి. ఇలా సంస్థల తరఫున మానవతా సాయం చేసేందుకు వచ్చిన కొందరు సర్వం కోల్పోయిన మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు.
సాయం అందించేందుకు వచ్చిన ప్రతినిధులతో పరిచయమున్న కొంతమంది స్థానికులు కూడా ఇదే అదనుగా ఉపాధి, ఆహారం ఆశ చూపి మహిళలను లైంగికంగా దోచేస్తున్నారు. ఓ వ్యక్తి వాలంటీర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను ఖాళీ అపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు 38 ఏండ్ల ఆరుగురు పిల్లల తల్లి తెలిపినట్లు సర్వే రిపోర్టు పేర్కొంది. కొద్దిరోజుల తర్వాత ఆమెకు 30 డాలర్లు, ఆహారం, మెడిసిన్ ఇచ్చి పంపించాడని, ఉద్యోగం మాత్రం ఇవ్వలేదని వెల్లడించింది. కోరిక తీరిస్తే బదులుగా ఫుడ్, మనీ, నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పి తమను లొంగదీసుకున్నారని మరో ఆరుగురు మహిళలు వెల్లడించినట్లు సర్వే రిపోర్టులో వివరించారు.
లైంగిక దోపిడీ కారణంగా గాజాలో బాధిత మహిళలు కొందరు గర్భం దాల్చినట్లు హ్యూమన్ రైట్స్ సంఘాలు తెలిపాయని పేర్కొన్నారు. అయితే, యుద్ధ కల్లోలిత ప్రాంతాల్లో మహిళలు ఇలాంటి అఘాయిత్యాలు ఎదుర్కోవడం తమకు తెలుసని యునైటెడ్ నేషన్స్,
యునిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్న పలు సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి. కానీ, అఘాయిత్యాలు జరిగాయనేందుకు ఎలాంటి ఎవిడెన్సులు లేవని యూఎన్‌కు చెందిన లైంగిక వేధింపుల రక్షణ కమిటీ కొట్టిపారేస్తోంది.