మన పూర్వీకుల జీవన విధానం చూడాలని ఉందా..?

మన పూర్వీకుల జీవన విధానం చూడాలని ఉందా..?

ఇప్పుడు మన చేతిలో ఉన్న జ్ఞానం..ఎన్ని చేతులు కలిపితే వచ్చిందో? కానీ,  ఉట్టిగనే పుట్టింది రాత అనుకుంటున్నరు. అక్షరం, సంగీతం, కళలు ఇప్పుడే పుట్టినయ్‌‌, కంప్యూటర్ల దొరుకుతయ్ అనుకుంటున్నరు. బువ్వ పెట్టిన అవ్వను మర్చిపోయినంత ఈజీగా నడిచొచ్చిన తొవ్వనూ మర్చిపోతున్నరు.మన పూర్వీకుల రోల్‌‌ లేకుండా ఇక్కడి వరకూ వచ్చేవాళ్లమా? అందుకే, వాళ్లు  ఏం చేశారు? ఏం ఉపయోగించారో ఒక్కసారైనా గుర్తు చేసుకోవాలి అంటున్నరు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. ఆయన నలభై ఏళ్లు తిరిగి సేకరించిన ప్రాచీన రాత ప్రతులు, డోక్రా మెటల్ క్రాఫ్ట్స్‌‌, ట్రైబల్‌‌ మ్యూజిక్ ఇనుస్ట్రుమెంట్స్‌‌ని కారా ఆర్ట్‌‌ ఫెస్టివల్‌‌లోఉంచిన్రు.

మన జ్ఞానానికి మూలం ఎక్కడున్నది? మన సంస్కృతికి మూలం ఎక్కడ ఉన్నది? అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. మనకు మన ప్రాచీనులు చేసిన కృషి ఏంటో మొత్తం అర్థమవుతుంది. తన జ్ఞానాన్ని ముందు తరాలకు అందించాలని, ముందు తరాలు మనకన్నా గొప్పగా బతకాలని అనుకున్నాడు ప్రాచీన మానవుడు. అందుకే, తనకు తెలిసినదాన్ని రికార్డ్ చేయడం  మొదలుపెట్టాడు.  గుట్టల్లో, గుహల్లో బొమ్మలు గీశాడు.  తర్వాత పెంకులూ,  ఎముకల మీద రాసుకున్నాడు. ఆ తర్వాత శిలాశాసనాలు, తాళపత్రాలు,  మెటల్,  చర్మం, పేపర్‌‌‌‌.. ఇలా ఆర్డర్‌‌‌‌గా ఒక్కొక్క దశను దాటుకుంటూ ఈ కంప్యూటర్ వరకూ వచ్చాడు. కంప్యూటర్ తయారు చేయడం  సైన్స్ అయినప్పుడు ఇలా ఎముకల మీద రాయాలి. చర్మం మీద రాయాలి. తాళ పత్రాల మీద రాయాలనే ప్రాసెస్‌‌ సృష్టించడం… వాటిని ముందు తరాలకు అందించేలా జాగ్రత్తగా దాచిపెట్టడం కూడా సైన్సే అవుతుంది! జానపద కళలే.. నేడు మనం ఎంజాయ్ చేస్తున్న ఆర్ట్​కి మూలం అని కూడా అర్థమవుతుంది.  వీటి గురించి తెలియచేయడమే ఉద్దేశంగా..  ఎముకల నుంచి మొదలుపెట్టి పేపర్‌‌‌‌ వరకూ ఉన్న అన్ని రకాల రాతప్రతులను ఈ ఎగ్జిబిషన్‌‌లో ఉంచారు.

ఆదివాసీ డోక్రా లోహ కళ

 

రెండో సెక్షన్‌‌లో ఆదివాసుల డోక్రాలోహ కళారూపాలు ఉన్నాయి.  నాలుగువేల ఏళ్ల నాటి  డోక్రా లోహ ఆకృతులు మన దేశంలో కనిపిస్తున్నాయి.  ఇవి ఆనాటి ప్రజల కళలు, అభిరుచులను తెలియజేస్తాయి.  మొహంజదారో నాగరికతలో  కనిపించే అనేక ఆకృతులు ఈ ఆదివాసుల సంస్కృతిలో, కళల్లో ఇంకా నిలిచే ఉన్నాయి.  మొహంజదారోలో దొరికిన డాన్సింగ్‌‌ గర్ల్‌‌ బొమ్మ తయారీలోని అభరణాలు, హావభావ భంగిమలు, ఇప్పటికీ గోండు, ఆదివాసీ డోక్రా ప్రతిమల్లో క్లియర్‌‌‌‌గా కనిపిస్తాయి. మన దేశంలో ఏడు రాష్ట్రాల్లో డోక్రా వస్తువులు తయారవుతాయి. ఏ ప్రాంతం ప్రత్యేకత దానిదే. మన రాష్ట్రంలో గోండు ఆదివాసుల కోసం వాళ్ల ఉప తెగ ‘జాజా’లు  ఇప్పటికీ వీటిని తయారు చేస్తున్నారు. వీళ్లు ఆదివాసుల కోసం గుర్రాలు, నాగోబా విగ్రహం, కొలత పాత్రలు, దీప జ్యోతి, గంటలు, మువ్వలు, నగలు, జే గంటలు తయారు చేస్తారు. ఇత్తడి, కంచు, రాగిని డోక్రా వస్తువులు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు.  మైనం కరిగించి  లాస్ట్ వ్యాక్స్‌‌ క్యాస్టింగ్ టెక్నిక్‌‌లో వీటిని తయారు చేస్తారు. ఎగ్జిబిషన్‌‌లోని మూడో సెక్షన్‌‌లో ఆదివాసుల, జానపదుల మ్యూజిక్ ఇనుస్ట్రుమెంట్స్‌‌ ఉంటాయి. 240 రకాల వాయిద్యాలు ఉండగా.. ఒక్కొక్క వాయిద్యాన్ని వాయించే వాళ్లు నెమ్మదిగా అంతరించిపోతున్నారు.

ఎక్కడి నుంచి సేకరించారు…

‘‘నేను తెలుగు యూనివర్సిటీలో టీచర్‌‌‌‌ని, తెలుగు అకాడమీలో  ఉద్యోగిని.  నాది ఫీల్డ్‌‌ వర్క్‌‌తో సంబంధం కాబట్టి, ఫీల్డ్ విజిట్ పేరుతో విలేజెస్‌‌కి వెళ్లడం వల్ల ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలిసేవి. పాతికేళ్ల వయసు అప్పటి నుంచి ఈ అభిరుచి పెరుగుతూ ఉంది. డప్పులు ఉన్నాయి అనగానే ఎన్ని రకాల డప్పులు ఉన్నాయి? మన రాష్ట్రంలోనే ఇట్ల ఉన్నాయా? వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో ఎట్ల ఉన్నయ్‌‌? ఆదీవాసి డప్పు వేరు , జానపద డప్పు, శిష్ట డప్పు వేరా? ఇట్ల ప్రశ్నలు వచ్చేస్తయ్‌‌ నాకు. అలాగే,  ప్రాచీన గ్రంథాలు, కళాకృతుల మీద కూడా!  ప్రాచీన మనిషి తాలూకు గొప్ప జ్ఞానాన్ని ముందు తరాలకు చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సేకరించడం స్టార్ట్‌‌ చేశాను’’

ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్‌‌?

ప్రాచీనమైనది ఏదైనా.. గత మానవులు ఉపయోగించినవి, తయారు చేసినవే ఈ యుగానికి బాటలు వేశాయి. దాన్ని మనం మర్చిపోతున్నాం. ఒక నది ఏర్పడటానికి ఎన్ని పర్వతాలు, లోయలు ఒరుసుకంటూ వస్తుందో..  అట్లనే సాహిత్యం, జ్ఞానం కూడా నది లాగే ముందుకుపోతుంది.  దాన్ని ముందు తరాలకు అందించడానికి వాళ్లు సృష్టించిన ప్రాసెస్‌‌ సైన్స్‌‌.  ఒక తాళపత్రం మీద రాయాలంటే ముందుగా తాటిచెట్టు మొగిలి నుంచి నాణ్యమైన తాటాకును కోయాలి. దానిని పాలల్లో, తేనెలో నానబెట్టాలి. తర్వాత దాన్ని చల్లటి గాలి వస్తున్న వెన్నెల రాత్రిలో ఆరబెట్టాలి. అప్పుడే అది స్మూత్ అవుతుంది. కాబట్టి, ఘంటంతో రాయగలం. దాని మీద బచ్చలి పండ్ల రసం లేదా పసరు రాస్తే అక్షరాలు కనపడతాయి. ఒకవేళ ఎండలో ఆరేస్తే తాటాకు  విరిగిపోతుంది. మరి ఇలా ప్రాసెస్‌‌  చేయమని ఎవరు చెప్పారు? ఇదొక ప్రయోగం, సైన్స్‌‌.  ఇది భారతీయుల నాలెడ్జ్. ఇది మనందరికీ తెలియాలి’ అన్నారు ప్రొ. జయధీర్‌‌‌‌ తిరుమలరావు.

మూడు సెక్షన్స్‌‌

ఈ ఎగ్జిబిషన్‌‌లో మొత్తం మూడు సెక్షన్స్ ఉన్నాయి. రాగి రేకుల మీద రాసిన అన్నమయ్య కీర్తనలు, ఎముకలపై రాసిన ద్రవిడ అక్షరాలు, తాళ పత్రాల్లో రాసిన పోతన భాగవతం, తిక్కన మహాభారతం ప్రతులతో పాటు మొత్తం 150 తాళ పత్ర గ్రంథాలు ఉన్నాయి.  ఇందులో బడుగు, బహుజనులు రాసినవే ఎక్కువగా ఉన్నాయి.  రకరకాల రాతప్రతులతో పాటు, రాయడానికి ఉపయోగించిన ఘంటాలు  ఇక్కడ చూడొచ్చు.  తాళ పత్రాలు అనగానే సాహిత్యమే ఉంటుందని అనుకుంటారు. కానీ, ఇక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాల్లో  సాహిత్యంతో పాటు..  వైద్య గ్రంథాలు, రెవెన్యూ, మంత్ర, తంత్ర శాస్త్రాలు కూడా ఉన్నాయి.  గురు పీఠాలు, మఠాల్లో, మారుమూల గ్రామాల్లో వీటిని సేకరించారు. ఇవన్నీ మన తెలుగువారి కళాభిరుచికి, జ్ఞానానికి అద్దం పడతాయి.

బంజారాహిల్స్‌‌ రోడ్‌‌ నెంబర్‌‌‌‌ 8లో ఉన్న సప్తపర్ణిలో ఈనెల 8 వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. పొద్దున పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వెళ్లొచ్చు. ప్రవేశం ఉచితం.