
ఆషాఢ శుద్ధ ఏకాదశి ( జులై 6 ) నుంచి కార్తీక మాసంలో వచ్చే ప్రభోదిని ఏకాదశి వరకు ( నవంబర్ 2 ) నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష ను ఆచరిస్తారు.హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, దేవశయని ఏకాదశి రోజున ( జులై 6) శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని భక్తుల నమ్మకం. . ఈ యోగ నిద్ర నాలుగు నెలల పాటు కొనసాగి, ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారు తిరిగి మేల్కొంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు.
చాతుర్మాస్యం: వ్రత నియమాలు
ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః
ఇక చాతుర్మాస్య వ్రతంలో భాగంగా ఉదయాన్నే స్నానం చేయాలి. క్షురకర్మలు చేయరాదు. నాలుగు నెలలు బ్రహ్మచర్యం పాటించాలి. రోజూ ఒకే పూట భోజనం చేయాలి. ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండాలి. నేలపై నిదురించాలి. అహింస పాటించాలి. యోగాభ్యాసం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇష్టదేవతల అష్టోత్తర శత, సహస్ర నామావళి పారాయణం చేయాలి.
చాతుర్మాస్య వ్రతం ఆచరించే వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మోక్ష ప్రాప్తి లభిస్తుందని పద్మ పురాణం చెబుతోంది.చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస) వారు పాటించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడానికి కుల, వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదని పండితులు చెబుతున్నారు.చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది.
చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం
చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను.... భాద్రపద మాసంలో పెరుగును....ఆశ్వయుజ మాసంలో పాలను...కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు .పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును
భాగవతం వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామ పొలిమెరలు ( గ్రామం వదలి వెళ్లకూడదు) దాటరాదు. కోవిడ్ కాలంలో ఈ విషయంలో కఠినమైన ఆంక్షలను విధించిన విషయం మనందరకూ తెలిసిందే..! ఈ కాలంలో అరుణోదయవేళ ( తెల్లవారుజామున) స్నానం చేయడం అవసరం. వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింసపాటించాలి.
ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి. ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. యోగసాధన చేయడం శ్రేయస్కరం.దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి
కొన్ని ముఖ్య నియమాలు:
- నిత్యం నదీస్నానం చేయాలి. అలా చేయడానికి అవకాశం లేని వారు బోరు దగ్గర కాని.. బావి దగ్గర కాని స్నానం చేయాలి. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి.... నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు.. అనే మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. అందుకే పీఠాధిపతులు.. స్వామీజీలు నదీతీరంలో గుడారాలు ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటారు.
- గురువు గారు ఉపదేశించిన మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి.
- బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస వంటి నియమాలు పాటించాలి.
- ఇష్ట దేవతను పూజించాలి. నిత్యం రోజూ సాయంత్రం సమయంలో తులసి మొక్క ( అమ్మవారి) దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.
- లక్ష్మీ నారాయణులను ఆవాహన చేసి పూజించాలి.. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కోరిన కోర్కెలుతీరుతాయి. లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది. ఒక చదవడం రాకపోయినా.. అవకాశం లేకపోయినా శ్రద్దగా.. భక్తితో విన్నా అదే ఫలితం కలుగుతుంది.
- భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి.
- కోపం.. అసూయ.. అబద్దాలు ఆడటం.. అహంకారం వంటి భావోద్వేగాలకు దూరంగా ఉండాలి.
- చాతుర్మాస సమయంలో ( జులై 6 నుంచి నవంబర్ 2వరకు ) క్షవరం ( జుట్టు కత్తిరించుకోవడం) చేయకూడదు. పూర్వ కాలంలో కనీసం తలను కూడా దువ్వుకునే వారు కాదు.
- దానాలు చేయాలి.. పేదలకు అన్నం పెట్టాలి. అన్నిటికంటే గోదానం చాలా శ్రేష్టమైనది. గోవుకు ఆహారం పెట్టినా అంతే ఫలితం లభిస్తుంది.