గుండె ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే.. తీరని నష్టం తప్పదు

గుండె ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే.. తీరని నష్టం తప్పదు
  • మై హార్ట్ ఈజ్ బీటింగ్.. అదోలా..ఈ  పాట గుర్తుందా.. ఇది ప్రేమలో ఉన్న యూత్​కి కనెక్ట్​ అయ్యేలా రాశారు. అందరూ అలానే ఆస్వాదించారు కూడా. అయితే కొన్ని సందర్భాల్లోఈ లిరిక్​ని వాడితే.. ‘ఏమయిందో కాస్తచూపించుకోరా..’ అంటూ ఫ్రెండ్స్ తమాషా పట్టిస్తుంటారు. అయితే అదే ఇప్పుడు  నిజమవుతుంది అంటే నమ్ముతారా? యంగ్​ఏజ్​లో ఉన్నా.. హెల్త్ విషయంలో ఏదైనా అనుమానించదగ్గ సమస్య అనిపిస్తే.. కచ్చితంగా చెకప్ చేయించుకోవాల్సిందే’అంటున్నారు ఎక్స్​పర్ట్స్.

మొన్నటికి మొన్న జూన్ 28న.. ప్రముఖ నటి, మోడల్, బిగ్​బాస్ ఫేం షెఫాలీ జరివాలా 42 ఏండ్ల వయసులో గుండెపోటుతో మరణించింది. ఈ సంఘటనకు ముందు.. వ్యాపార వేత్త సంజయ్ కపూర్ జూన్ 13న, 53 ఏండ్ల వయసులో గుండెపోటుకు గురయ్యారు. అలాగే గతంలో 46 ఏండ్లలో పునీత్ రాజ్ కపూర్, 40 ఏండ్లకు సిద్ధార్థ్​ శుక్లా, 35 ఏండ్ల వయసులో చిరంజీవి సర్జా.. ఇలా ఎంతోమంది ఫేమస్ సెలబ్రెటీలు గుండె పోటు వల్ల మరణించారు.

 ఈ వార్తలు చదవడానికి, వినడానికి, చూడడానికి భయాందోళనలు కలిగిస్తున్నప్పటికీ.. ఇవి వాస్తవాలు. అయితే వీళ్లు సెలబ్రెటీలు కాబట్టి వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఇంత చిన్న వయసులో ఎందుకిలా జరిగింది? అంటూ ఆరా తీస్తున్నాం. కానీ సామాన్యుల్లోనూ క్రికెట్ ఆడుతూ ఒకరు, జిమ్ చేస్తూ మరొకరు, రన్నింగ్ చేస్తూ.. ఇలా సడెన్​గా చనిపోయిన వార్తలు కూడా చూశాం. ఇన్ని తెలిసినా అదొక వార్తగా చదివి పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. సమస్య చిన్నదైనా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు.

కర్నాటకలో ఈ మధ్య కాలంలో గుండె పోటు కేసులు వెంటవెంటనే నమోదయ్యాయి. అలా సడెన్​ డెత్ అయినవాళ్లలో చాలామంది యంగ్ ఏజ్ వాళ్లు ఉండడం ఆందోళనకరంగా మారింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుల గురించి లోతుగా స్టడీ చేయాలని ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే అసలు గుండె సమస్యల గురించి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్​ అమరేశ్​ రావు మాటల్లో..

గుప్పెడు గుండె.. మన శరీరమంతా సజావుగా రక్త ప్రసరణ చేస్తుంది. అలాంటి గుండె ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే.. తీరని నష్టం తప్పదు. రీసెంట్​గా 20 – 40 ఏజ్ గ్రూప్​లో ఎక్కువగా హార్ట్ ఎటాక్​ కేసులు వస్తున్నట్టు తెలుస్తోంది. పక్క రాష్ట్రంలో ఇది కొవిడ్ వ్యాక్సిన్ వల్లేనని ప్రచారం జరుగుతోంది.  కానీ.. అందులో నిజం లేదని తేలింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న కేసులు చూస్తే లైఫ్ స్టయిల్​ మీద ఆధారపడి ఉన్నాయి. కొవిడ్ తర్వాత లైఫ్ స్టయిల్​లో చాలా మార్పులు వచ్చాయి. వాటిలో పాజిటివ్​గా చెప్పుకోవాల్సింది చాలామంది హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారు. మరి నెగెటివ్​ ఏంటి అంటే.. కొవిడ్ తర్వాత చాలామంది స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ వంటి దురలవాట్లకు బానిసలయ్యారు. అలాగే బయటి ఫుడ్​, ప్రాసెస్డ్​ ఫుడ్​ ఆర్డర్ పెట్టుకుని తినడానికి అలవాటు పడిపోయారు. ఎక్సర్​సైజ్ చేయనివాళ్లు ఎక్కువ శాతం వీటికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. 

మత్తు వదలకపోతే..

మరీ ముఖ్యంగా కొవిడ్ తర్వాత చాలామంది కొకైన్ వంటి మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. అందులో కొంతమంది ‘జిమ్​కి వెళ్తున్నాం.. ఎక్సర్​సైజ్ చేస్తున్నాం.. డైట్ పాటిస్తున్నాం.. మాకేం కాదు..’ అనుకుంటున్నారు. కానీ, మార్నింగ్ జిమ్ చేసి నైట్ కొకైన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మత్తు పదార్థాలు కచ్చితంగా హార్ట్ ఎటాక్​కు గురయ్యేలా చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. 

అన్ని హెల్దీ హ్యాబిట్స్ ఉన్నా.. ఒక్క డ్రగ్స్​ అలవాటు మానుకోకపోతే మాత్రం సడెన్​ కార్డియాక్​ అరెస్ట్​కు నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అని పలు స్టడీల్లో, కేసుల్లోనూ తేలింది. అలాగే జిమ్​కి వెళ్లి అన్​హెల్దీ డైట్ పాటిస్తున్నా.. యంగ్​గా కనపడడానికి డాక్టర్ సూచించని మందులు వాడడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

కొవిడ్​కుముందే.. 

కొవిడ్​కు ముందే నిమ్స్, ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ జెనెటిక్స్​తో కలిసి హార్ట్​ ఎటాక్​లపై రీసెర్చ్ చేశాం. దాంట్లో తేలింది ఏంటంటే.. 40 ఏండ్ల లోపు ఉన్న పేషెంట్స్​ అందులో ఆల్రెడీ స్టంట్ వేయించుకున్నవాళ్లు, హార్ట్​లో హోల్ ఉన్నవాళ్లను స్టడీ చేశాం. ఇండియాలో ఈ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్​లోనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ స్టడీలో చాలా తక్కువ మందికి డయాబెటిస్, ఒబెసిటీ, స్మోకింగ్, బీపీ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. జన్యుపరంగా లేదా వంశపారంపర్యంగా ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉన్నట్టు తెలిసింది. కానీ పూర్తిస్థాయిలో ఇంకా స్పష్టత లేదు.

►ALSO READ | చాతుర్మాస దీక్ష ( జులై 6 నుంచి నవంబర్ 2వరకు ) : నాలుగు నెలల పాటు పాటించాల్సిన నియమాలు ఇవే..!

 అయితే ఒక అమెరికన్ కార్డియాలజిస్ట్​.. కూడా దీనిపై రీసెర్చ్ చేయాలని మొదట ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్​ని స్టడీ చేశారు. ఆ రీసెర్చ్​లో విదేశీయుల​తో పోలిస్తే.. ఇండియన్స్​లో సాధారణంగానే రక్తనాళాలు సన్నగా ఉంటాయని, అందువల్ల మనవాళ్లు ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నట్టు ఆయన తేల్చారు. వాస్తవంగా మన దేశంలో గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటివి ఎక్కువ. జన్యుపరంగా వచ్చేవి కూడా ఉంటాయి. కాబట్టి ఇవి గుండె సమస్యలకు దారి తీసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. 

నిర్లక్ష్యం ఖరీదు..

యంగ్ ఏజ్​లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా బాడీ దాన్ని అధిగమించగలుగుతుంది. ఏమాత్రం హెల్త్ ఇష్యూస్ ఉన్నా.. నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నప్పుడు ఫిట్స్ వచ్చింది.. ఆ తర్వాత రాలేదు కదా అని కొందరు. ఆస్తమా పెద్దయ్యాక లేదు కదా అని మరికొందరు. తినకపోవడం వల్ల కళ్లు తిరిగాయి.. తింటే సెట్ అవుతుందని, అప్పుడప్పుడు వచ్చే తలనొప్పే పెద్దగా పట్టించుకో నక్కర్లేదని అనుకుంటారు. అలాగే, ఎక్కువగా ఆయాస పడడం, ఇంతకుముందు చేసిన పని ఇప్పుడు చేయలేకపోవడం, అనూహ్యంగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటి కొన్ని సమస్యలను చిన్నవే అనుకుని పెద్దగా పట్టించుకోరు.

 ఆ తర్వాత మళ్లీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా? లేక అది దీర్ఘకాలిక సమస్యకు సంకేతమా? అని ఆలోచించలే కపో తున్నారు. ‘సమస్య చిన్నదే కదా’ అని నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే.. మున్ముందు దేనికైనా దారితీయొచ్చు. కాబట్టి బేసిక్ చెకప్​లు చేయించుకోవడం తప్పనిసరి. హార్ట్, బ్రెయిన్​కి సంబంధించిన సమస్యలను వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్​ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. 

సడెన్ డెత్​లకు కారణం

ప్రతి సడెన్ డెత్.. కార్డియాక్ డెత్ కాదు.. గుండెలో కొలెస్ట్రాల్ బ్లాకేజీ ఉండడం వల్ల కావొచ్చు. కొన్ని గుర్తించలేని వ్యాధులు లేదా అనారోగ్య సమస్యల వల్ల కూడా ఇలా జరగొచ్చు. కొన్ని పరిస్థితుల్లో రక్తనాళాలు చీలిపోవడం, గుండెలో రంధ్రం ఉన్నా గుర్తించకపోవడం, గుండె జబ్బు ముదిరిపోవడం వంటి కండిషన్స్​లో సడెన్ డెత్ అయ్యే ప్రమాదం ఉంటుంది. 

బేసిక్ టెస్ట్​ అవసరం

ఈ మధ్య ప్రభుత్వం చొరవతో స్కూల్ హెల్త్ స్ర్కీనింగ్ వంటివి చేస్తున్నారు. ఉద్యోగాల్లో చేరే ముందు ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం తప్పకుండా టెస్ట్​లు చేయించుకోవాలి. ఇప్పుడు నిజాం ఇనిస్టిట్యూట్​లో కూడా స్టూడెంట్స్​ని జాయిన్ ​చేసుకునే ముందు వాళ్లకు స్క్రీనింగ్ జరుగుతుంది. తద్వారా ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే వెంటనే దాన్ని పరిష్కరించొచ్చు. అయితే చాలామంది ఏంటంటే.. టెస్ట్​ చేస్తే ఏదో ఒక సమస్య ఉందని చెప్తారు అని భయపడిపోతుంటారు. అలాకాకుండా బేసిక్ ఫిట్​నెస్ టెస్ట్ చేయించుకోవడం వల్ల చాలా వరకు వ్యాధులను పసిగట్టొచ్చు. 

ఆరోగ్యంగా ఉండడమంటే..

‘ఎక్సర్​సైజ్​, డైట్​ చేస్తే చాలు.. ఆరోగ్యంగా ఉంటాం’ అనుకుంటే పొరపాటు. అవి రెండే సరిపోవు.. మరికొన్ని అంశాలు కూడా బాగుండాలి. అవేంటంటే.. ఒత్తిడి లేకుండా ఉండాలి. మనశ్శాంతి, సంతోషం, సంతృప్తి, లైఫ్ వ్యాల్యూస్ తెలుసుకోవడం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్​ వంటివన్నీ ఉంటేనే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలడు. - డాక్టర్ అమరేశ్ రావు మాలెంపాటిప్రొఫెసర్ అండ్ హెడ్​ డిపార్ట్​మెంట్ ఆఫ్​ కార్డియో థొరాసిక్ సర్జరీ, నిమ్స్, హైదరాబాద్​