
కల్లు అంటే తెలంగాణలో సంస్కృతి, సంప్రదాయం, పరస్పర మర్యాదలు కలగలిపినఒక గౌరవ పదం. ధనికులైనా...పేదవారైనా కల్లులేకుండా తెలంగాణ ఆవాసాలలో మర్యాద లేదు, పండుగనేది లేదు. గీతా కార్మికులుగా గౌడన్నలు సమాజానికి అందించే సేవలు ఉన్నతమైనవి. అలాంటి పవిత్రమైన కులవృత్తి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుతున్న గౌడులు అజరామరులు. చిన్నప్పటినుండి తన కులం పట్ల, కుల మర్యాదల పట్ల, పద్ధతుల పట్ల, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచుకుంటూ తన వృత్తికి జరుగుతున్న అన్యాయాలను అవమానాలను దగ్గరుండి చూసిన వాడు శీలం భద్రయ్య. ఎన్నాళ్ళ నుంచో తనలో రగులుతున్న భావావేశానికి అక్షర రూపాన్ని ఇచ్చి “ముస్తాదు” పేరుతో ఈ కవిత్వాన్ని భద్రంగా పాఠకులకు అందించాడు. తన కులవృత్తి గొప్పతనాన్ని నిలబెట్టడానికి నిలబడిన రక్షకుని వలె కవచం ధరించాడు. ఆ కవచమే “ముస్తాదు” కవిత్వం.
“కల్లుందా పిల్లుందాని అడగకండి మండువాలో అమ్మ చెల్లి ఉంది”ఈ కవితలో కవి తనలో గూడుకట్టుకున్న బాధాకర అనుభవం తాలూకు అవమానం,
ఆత్మగౌరవం, ప్రతీకారం ధ్వనిస్తుంది. “తాటి చెట్టుతోబాటుగౌడు నడుముకు మోకు బిడ్డ మెడలో బొడ్డుతాడు” అంటూ మనిషికి ప్రకృతికి మధ్యనున్న తల్లి బిడ్డల పేగుబంధాన్ని వ్యక్తీకరిస్తాడు. కల్లును “తల్లి రొమ్ముల చనుబాల తీపి” అని చెట్టుకు మానవీయతను ఆపాదించాడు. “శబరీ! వనంలో కల్లు దొరకలేదా!
రేగుపళ్ళు పెట్టావు!”త్రేతా యుగంలో కూడా కల్లు వాడుకలో ఉందని చెప్పకనే చెప్తాడు. రాముని పర్ణశాల తాటాకులతో కప్పబడిందని కూడా ఒక కవితలో చెప్పాడు. “ఆకాశంలో తారలు కల్లు లొట్టి వైపు లొట్టలేసుకుంటూ చుట్టుకున్నాయంటూ...” చమత్కరిస్తాడు. ఒకచోట “కల్లు తాగిన కక్కడు తత్వాలు చెప్పాడ”ని, మరో కవితలో “తెలంగాణ ఉద్యమంలో నిజాంకు ఎదురు తిరిగారని, విప్లవకారులు పాటలు కట్టారని...” కల్లు చరిత్రను చెబుతూ చరిత్రకారుడుగా కవి కనిపిస్తాడు.
►ALSO READ | నెరవేరిన 18 ఏళ్ల కల.. ఏఐతో గర్భం దాల్చిన మహిళ. !..అది ఎలా అంటే.?
గౌడ వృత్తిలో వాడుకలో ఉన్న పదజాలాన్నీ సందర్భానుసారంగా ప్రయోగించడం ఈ కవిత్వంలో కనిపిస్తుంది. గుజి, గురిగి, పట్వ, తాటి జగ్గలు, దూలం, తాటి బెల్లం, పట్టు పట్టడం (కల్లు ఆత్రంగా తాగడం) మోకు, రేక, తేట, పోతుకల్లు, పరుపులు, దొంగ బొత్తలు, వంపగోలలు, బుంగ వంటి పదాలు చాలా కనిపిస్తాయి.శీలం భద్రయ్య కవిత్వంలో ఊహించని ఉపమానాలు కనిపిస్తాయి. “మయసభ కాదు మండువా... గౌడమ్మ నవ్వులను ఆపలేదు” అని మయసభలో ద్రౌపది నవ్వును పోల్చుతాడు.
“ఎంతెత్తు తాడెక్కినా... జీవితాలు కురచ”...: అంటూ... “అరచేతిలో రేకలున్నా... ఓట్ల పండుగట..కల్లు బేరం నిండు సున్నా” అని వాపోతూ...గౌడవృత్తిదారుల దీనావస్థను తన కవిత్వంలో వెలిబుచ్చాడు.
“ముస్తాదు” కవిత్వంలో ప్రధానంగా మూడు రకాల తపనలు కనిపిస్తాయి. ఒకటి ఆత్మ పరమైనది, రెండు భౌతికపరమైనది. మూడవది దైవికపరమైనది. నేటి సమాజంలో గౌడ కులస్తులు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కవిత్వీకరించడం ఆత్మపరమైన కవిత్వంగా, సమాజంలో వారికి దక్కుతున్న గౌరవమర్యాదల పట్ల, సమాజ విపరీత పోకడలను నిరసించడం ద్వారా భౌతికపరమైన కవిత్వంగా, పౌరాణిక అంశాలను, పాత్రలను స్పృశించడం ద్వారా దైవపరమైన కవిత్వంగా మూడు రకాల తాపాలు శీలం భద్రయ్య కవిత్వంలో కనబడుతాయి. ఈ తపన కవికి మాత్రమే పరిమితం కాదు. శీలం భద్రయ్య తాడిచెట్టును కలంగా భావించి, ఆ చెట్టులోంచి బొట్లు బొట్లుగా రాలిపడ్డ నీరాలాంటి ముస్తాదు కవితలను దూపతీరా పాఠకులు ఆస్వాదించేలా కవితల నిర్మాణం ఉండడం మరొక ప్రత్యేకత. గౌడన్నను వస్తాదులా ముస్తాబు చేసి, గౌడ వృత్తికి అక్షరగౌరవాన్ని అద్దాడు శీలం భద్రయ్య.
- మద్దోజు వెంకట సుధీర్ బాబు