ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టోఫెల్ పరీక్ష

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టోఫెల్ పరీక్ష

ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం జగన్. ఏప్రిల్ 10వ తేద సోమవారం రాష్ట్ర విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష చేశారు. వచ్చే ఏడాది విద్యా కానుకపైనా జగన్ చర్చించారు. పిల్లలు ప్రతి రోజు స్కూల్ కి హాజరుకాకుంటే తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు అందించే పుస్తకాల ముద్రణ ముందే పూర్తి చేయాలని సీఎం జగన్ వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో సబ్జెక్ట్ ఉపాధ్యాయులపైనా సీఎం దృష్టి పెట్టారు. సబ్జెక్ట్ టీచర్లకు ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు.

మేథమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలు పెంచేలా ఈ కోర్సులు ఉంటాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా టీచర్లు కొరత ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్ పీ) ఏర్పాటుపైనా సీఎం జగన్ చర్చించారు. జూన్ నాటికి ఐఎఫ్ పీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు చెప్పారు. 

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టోఫెల్ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఉత్తీర్ణులైన వారికి టోఫెల్‌ ప్రైమరీ సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు. 6 నుంచి 10 గ్రేడ్ల వారికి జూనియర్‌ టోఫెల్‌ పరీక్షలు నిర్వహించాలని, వీరికి జూనియర్‌ స్టాండర్డ్‌ టోఫెల్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు.

మొత్తం మూడు దశల్లో వీరికి టోఫెల్‌ పరీక్ష నిర్వహించాలని.. ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్‌ నైపుణ్యాల పరీక్ష నిర్వహించాలని తెలిపారు. జూనియర్‌ స్టాండర్డ్‌ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్‌ నైపుణ్యాల పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ– కంటెంట్‌ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నెంబరును స్కూల్లో ఉంచాలన్నారు.