ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు అర్హతల సడలింపు: 75% మార్కుల నిబంధన తొలగింపు

ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు అర్హతల సడలింపు: 75% మార్కుల నిబంధన తొలగింపు

ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక క్యాంపస్‌లలో సీటు సాదించి ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ కోర్సుల్లో చదువు పూర్తి చేయాలని దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కలలు కంటుంటారు. ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం భారీ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తలు చేసుకుని పోటీపడతారు. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్/ప్లస్ 2 పరీక్షలే రద్దు చేసి, విద్యార్థులందరినీ పాస్ చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్లు ఇచ్చాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పోటీపడే ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ నిబంధనలతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాలకు సంబంధించిన అర్హతల్లోనూ సడలింపు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం మధ్యాహ్నం వెల్లడించారు.

ఈ అర్హతలు చాలు..

జేఈఈ పరీక్ష ఫలితాల్లో ఇంటర్మీడియట్ మార్కులకు గతంలో ఉన్న వెయిటేజీ విధానాన్ని ఈ ఏడాది తొలగించినట్లు ఇప్పటికే ప్రకటించిన ఆయన తాజాగా సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డులో మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని టెక్నికల్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌లో 75 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కనీస అర్హతగా ఉండేదని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దానిని తొలగిస్తున్నామని చెప్పారు. అలాగే జేఈఈలో టాప్ 20 పర్సెంటైల్ వచ్చి ఉండాలన్న నిబంధనను కూడా ఎత్తేస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్ మార్కులతో సంబంధం లేకుండా పాస్ అయి ఉంటే చాలని, జేఈఈ మెయిన్ 2020 పరీక్ష మెరిట్ ఆధారంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కల్పిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్.