‘ఇందిరమ్మ’ జాగలకు అక్రమ రిజిస్ట్రేషన్లు

‘ఇందిరమ్మ’ జాగలకు అక్రమ రిజిస్ట్రేషన్లు

జనగామ, వెలుగు: జనగామ టౌన్ శివారు ఇందిరమ్మ కాలనీలోని ప్లాట్లను కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఖాళీ ప్లాట్​ కనిపిస్తే నకిలీ పేపర్లు సృష్టించి, వాటిని అమ్మేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్లాట్లను అమ్మడానికి, కొనడానికి వీలు లేకున్నా.. తమ పలుకుబడితో దర్జాగా క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఒక్కో ప్లాట్​ ను ఇద్దరు ముగ్గురికి కూడా కట్టబెడుతూ.. సొమ్ము చేసుకుంటున్నారు. దళారుల దందా వెనక రెవెన్యూ స్టాఫ్​ లోని కొందరి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ సంగతి..

జనగామ జిల్లా కేంద్రంలో గత కాంగ్రెస్​ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేసింది. 2005 నుంచి 2014 వరకు జనగామ టౌన్​ పరిధిలో 2,843 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,103 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా 740 ఇండ్ల పనులు వివిధ దశల్లో ఆగిపోయాయి. వీటితో పాటు అప్పటి రచ్చబండ కార్యక్రమాల్లోనూ వైయస్ఆర్ పలువురికి ఇండ్ల జాగలకు అలాట్​మెంట్​ లు ఇచ్చారు.

ఖాళీ ప్లాట్లే టార్గెట్

జనగామ శివారు బాణాపురంలోని ఇందిరమ్మ ఇండ్ల జాగాలపై దళారుల కన్ను పడింది. అధికార, విపక్ష లీడర్లతో పాటు బ్రోకర్లు అక్రమాలకు తెర లేపారు. రెవెన్యూ కార్యాలయ వర్గాల సహకారంతో అది ఎవరి పేరుమీద ఉందనే సమాచారం కనుక్కుని దళారులు కొనుగోలు చేసినట్లు నకిలీ పట్టాలు సృష్టించి, అమ్మకాలు చేస్తున్నారు. ఆఫీసర్లను తప్పుదోవ పట్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. అమాయక జనాలు ప్లాట్లు కొని ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్ల క్రయవిక్రయాలు అసలు లబ్ధిదారులకు తెలియకుండానే చేతులు మారుతున్నాయి.

ఆధార్​, రేషన్​ నంబర్ల బాగోతం

నకిలీ డాక్యుమెంట్లను సృష్టించే క్రమంలో తప్పుడు ఆధార్​ నెంబర్​లను, రేషన్​ కార్డులను పొందుపరుస్తున్నారు. మరి కొందరు బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపిస్తున్నారు. కొన్ని నెట్​ సెంటర్ల అండదండలతోనే ఈ అక్రమాల తంతు ఈజీగా జరుగుతుందన్న ఆరోపణలు మెండుగా ఉన్నాయి. ఇక బాణాపురం వార్డుకు చెందిన అధికార పార్టీ ముఖ్య లీడర్​ వసూళ్ల దందా ఎక్కువ చేసినట్లు అక్కడి జనం ఆరోపిస్తున్నారు. ప్లాట్ల క్రయవిక్రయాలకు అడ్డు తగులుతూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అక్రమాలు ఫుల్

ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు అమ్మకానికి కొనడానికి వీలు లేదు. కానీ బాణాపురం ఇందిరమ్మ ఇండ్లలో సగానికి పైగా అమ్ముడు పోయి చేతులు మారినట్లు ఆఫీసర్లే చెబుతున్నారు. ఇక్కడి నిర్మాణాల తీరు, అవకతవకలపై గతంలో ఇక్కడ కలెక్టర్​గా పనిచేసిన వినయ్​ కృష్ణారెడ్డి హయాంలో విచారణకు ఆదేశించారు. ఎంక్వైరీ జరిగి రిపోర్ట్​ తయారు చేసినా నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతోనే లీడర్లు, బ్రోకర్​లు తమ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. ఈ అక్రమ దందాను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.