కడెం నల్ల మట్టిని తోడేస్తున్నరు..ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు 

కడెం నల్ల మట్టిని తోడేస్తున్నరు..ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు 
  • అడ్డుకున్న అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు
  • 3 జేసీబీలు,12 ట్రాక్టర్లు సీజ్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం బీర్ నంది పంచాయతీ పరిధిలోని ఇప్పమాడ గ్రామ శివారులో కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు బ్యాక్ వాటర్​కు సంబంధించిన నల్ల మట్టిని కొందరు గుత్తేదారులు అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రాజెక్టు అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రైతుల పేరుతో నల్ల మట్టి దందా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడాది కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎండిపోయింది.

దీంతో అక్కడ సారవంతమైన నల్ల మట్టి లభ్యమవుతోంది. ఇదే అదునుగా బడా వ్యాపారులు రైతుల పేరిట ఈ దందాకు తెరలేపారు. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో మూడు జేసీబీ లతో మట్టిని తవ్వుతున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రాత్రీపగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న  ప్రాజెక్టు ఏఈఈలు నితిన్ కుమార్, విశాల్, మురళీకృష్ణ అక్కడికి చేరుకొని మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. తవ్వకాలు చేపడుతున్నవారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 జేసీబీలు,12 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.