హైదరాబాద్లో అక్రమ నల్లా కనెక్షన్లపై నజర్

హైదరాబాద్లో అక్రమ నల్లా కనెక్షన్లపై నజర్
  •  గుర్తించేందుకు వాటర్ బోర్డు స్పెషల్ డ్రైవ్  
  • దాదాపు లక్షకు పైగానే అక్రమ కనెక్షన్లు 
  • కిందస్థాయి సిబ్బంది నిర్వాకంతో నీటి దోపిడీ
  •  సిటీలో సంస్థ ఆదాయానికి భారీగా గండి 
  • దొంగ కనెక్షన్లపై రెగ్యులరైజ్​ లేదా చర్యలు

హైదరాబాద్,వెలుగు: సిటీలో నల్లా అక్రమ కనెక్షన్లు వాటర్​బోర్డుకు తలనొప్పిగా మారాయి. కిందిస్థాయిలో కొందరు సిబ్బంది నిర్వాకం కారణంగా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. తద్వారా బోర్డు ఆదాయానికి గండిపడుతుంది. లైన్​మెన్ల స్థాయి సిబ్బంది, కొందరు కాంట్రాక్టర్లు లంచాల తీసుకుంటూ బోర్డుకు నష్టం తెస్తున్నారు. రాత్రికి రాత్రే కొన్ని ప్రాంతాల్లో రోడ్లను తవ్వేసి కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు.

దీంతో బోర్డు సరఫరా చేసే నీటికి లెక్కలు లేకుండా పోతున్నాయి. రావాల్సిన ఆదాయానికి కూడా పొంతన ఉండడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. వచ్చేది  వేసవి కావడంతో గ్రేటర్​ సిటీలో  నీటి డిమాండ్​మరింత పెరిగే చాన్స్ ఉంది. అధికారులు సమ్మర్​యాక్షన్​ప్లాన్​ రూపొందిస్తున్నారు. అన్ని ప్రాంతాలకు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమ కనెక్షన్లు ఉన్నవారే పెద్దమొత్తంలో నీటిని వాడేస్తున్నారనే  ఆరోపణలు ఉన్నాయి.

వీరితో బోర్డుకు ఆదాయం రాకపోగా నష్టాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.  అక్రమ కనెక్షన్లతో వాటర్​బోర్డు పరిధిలోనే కాకుండా ఓఆర్ఆర్​వెలుపల గ్రామాలు, మున్సిపాలిటీలు, విల్లాలు తదితర వాటికి నీటిని సరఫరా చేస్తుండగా బోర్డుకు పైసా ఆదాయం లేదని, తీవ్రంగా నష్టాలు వస్తున్నట్టు పేర్కొంటున్నారు. విజిలెన్స్​సెల్​కూడా తరచూ తనిఖీలు చేస్తున్నట్టు చెబుతున్నారు. 

   తనిఖీలు చేసేందుకు ప్లాన్ 

సమ్మర్ లో నీటి సమస్యలు తీవ్రంగా ఉండే చాన్స్ ఉంది. ఇప్పటికే  గ్రేటర్ హైదరాబాద్​కు  నీటి సరఫరా చేసే ప్రధాన జలాశయాలైన నాగార్జునసాగర్​, ఎల్లంపల్లి, సింగూరు, మంజీరా, ఉస్మాన్​సాగర్​, హిమాయత్​సాగర్​లో నీటి నిల్వలు గతేడాది కంటే తక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా సిటీతో పాటు ఓఆర్ఆర్​పరిధిలోని మున్సిపాలిటీలు, పంచాయితీలకు కలిపి రోజుకు 550 మిలియన్​గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వాటర్​బోర్డు పరిధిలోని 29 ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్​డివిజన్ల పరిధిలో 13.80 లక్షల నీటి కనెక్షన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

మరో లక్షకు పైగానే అక్రమ కనెక్షన్లు ఉన్నట్టు కూడా పేర్కొంటున్నారు. విజిలెన్స్​చేసే తనిఖీలతో పాటు ఈసారి వేసవిలో అక్రమ కనెక్షన్లు వెలికి తీసేందుకు స్పెషల్​డ్రైవ్​ నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారి తెలిపారు. ప్రతి డివిజన్​పరిధిలో సెక్షన్ల వారీగా సిబ్బందిని తనిఖీలకు పంపాలని నిర్ణయించారు. తద్వారా  క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎన్ని అక్రమ కనెక్షన్లు ఉన్నాయనేదానిపై క్లారిటీ వస్తుందంటున్నారు. అక్రమ కనెక్షన్లు గుర్తించిన వెంటనే జరిమానాతో రెగ్యులరైజ్​ చేయడం లేదా వాటర్​బోర్డు యాక్ట్​ ప్రకారం చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. 

 స్పెషల్ డ్రైవ్ ద్వారా గుర్తించి..

ఇప్పటికే వాటర్​బోర్డు నీటి సరఫరాను 20 నుంచి 50 ఎంజీడీలను పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తుంది. ఓఆర్ఆర్​ పరిధిలోని చాలా గ్రామాలు, కాలనీల్లో  నీటి సమస్య ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాలకు సమస్య రాకుండా చూడాలని భావిస్తున్నారు. ఇలా అదనంగా సరఫరా చేసే నీరు కూడా అక్రమార్కులకు వరంగా మారకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే గ్రేటర్​ సిటీలో పరిధిలో అక్రమ కనెక్షన్లను స్పెషల్ డ్రైవ్​లో భాగంగా సెక్షన్ల వారీగా, బస్తీలు, కాలనీల్లో తనిఖీలు చేసి గుర్తించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిపింది.