సర్కారు జాగల్లో లీడర్ల ఇండ్లు..ఒక రోజులోనే రెడీ మేడ్ ఇండ్లు

సర్కారు జాగల్లో లీడర్ల ఇండ్లు..ఒక రోజులోనే రెడీ మేడ్ ఇండ్లు
  • రెగ్యులరైజేషన్ దరఖాస్తులకు గడువు పొడిగింపుతో కబ్జాలు
  • ఆఫీసర్లను మేనేజ్ చేసి పాత తేదీలతో ఇంటిపన్ను రసీదులు
  • మెదక్ జిల్లాలోజోరుగా అక్రమ నిర్మాణాలు
  • ఇప్పటికే 5 లక్షలు దాటిన రెగ్యులరైజేషన్ అప్లికేషన్లు


మెదక్/పాపన్నపేట, వెలుగు: 58, 59 జీవోలు అధికార పార్టీ లీడర్లకు, అక్రమార్కులకు వరంగా మారాయి. ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు తెచ్చిన ఈ జీవోలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సర్కారు జాగల్లో రాత్రికి రాత్రే ఇండ్లు కట్టేస్తున్నారు. 2014 జూన్​2 కంటే ముందు కబ్జాలో ఉన్న జాగలను మాత్రమే రెగ్యులరైజ్ చేస్తామని అప్లికేషన్లు తీసుకున్న సర్కారు.. తర్వాత 2020 జూన్ 2  దాకా కబ్జాలో ఉన్న ఇండ్ల జాగలకు కూడా పట్టాలిస్తామని ప్రకటించింది. ఇటీవల దరఖాస్తుల గడువు కూడా పెంచింది. ఇదే అదనుగా కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడ సర్కారు జాగ ఖాళీగా కనిపిస్తే అక్కడ రాత్రికి రాత్రే ఇండ్లు కట్టేసి, ఇంటి నంబర్లు​ తీసుకొని జీవో 59 కింద పట్టాల కోసం అప్లికేషన్లు పెAట్టుకుంటున్నారు. పాత తేదీలతో ఇంటి పన్ను, నల్లా రసీదులు తీసుకుంటున్నారు. వీళ్లలో లీడర్లు, వాళ్ల అనుచరులే ఎక్కువగా ఉండడంతో ఆఫీసర్లు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. మెదక్ కొత్త కలెక్టరేట్ సమీపంలో వందల ఇండ్లు పుట్టుకొస్తున్నా కన్నెత్తి చూసినవారు లేరు. ఇండ్ల జాగల కోసం ఏండ్ల తరబడి పోరాడుతున్న పేదలు ఎక్కడన్న చిన్న గుడిసెలు వేసుకుంటే కూల్చేస్తున్న ఆఫీసర్లు.. బీఆర్ఎస్ లీడర్ల ఆక్రమణలను పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూములు, అర్బన్ సీలింగ్ యాక్ట్ పరిధిలోని భూముల్లో ఇండ్లు కట్టుకున్న పేదల స్థలాల రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌కు తెలంగాణ వచ్చిన కొత్తలో సర్కారు జీవో 58, 59 తెచ్చింది. దీని ప్రకారం 2014 జూన్ 2 కంటే ముందు కబ్జాలో ఉన్న ఇండ్ల జాగలకు జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు అయితే ఉచితంగా, 125 చదరపు గజాలు దాటితే జీవో 59 కింద మార్కెట్ రేటు ప్రకారం చార్జీలు విధించి క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరిలో మరోసారి అప్లికేషన్లను ఆహ్వానించగా, మొత్తం 3.96 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 125 గజాల పైన భూమికి సంబంధించిన అప్లికేషన్లు 70 వేలకు పైగా ఉన్నాయి. ఈ రెగ్యులరైజేషన్​ స్కీమ్​కు మంచి స్పందన వస్తుండడం, ఫీజుల రూపంలో రూ.4 వేల కోట్లు వచ్చే చాన్స్ ఉండడంతో 58, 59 జీవోలను సవరిస్తూ ఈ ఏడాది జనవరి 3న సర్కారు 29 జీవో తెచ్చింది. దీని ప్రకారం 2020 జూన్ 2 దాకా కబ్జాలో ఉన్న ఇండ్ల జాగలను కూడా రెగ్యులరైజేషన్ చేస్తోంది. మొదట ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ దాకా నెల రోజుల పాటు అప్లికేషన్లు స్వీకరిస్తామని చెప్పి.. తర్వాత మే 31 దాకా గడువు పొడిగించారు. ఈ క్రమంలో అప్లికేషన్లు 5 లక్షలు దాటినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.

రూల్స్ ఇట్ల

  • 125 గజాలలోపు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని, నివాసం ఏర్పాటు చేసుకున్న పేదలకు జీవో 58 కింద ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తారు.
  • జీవో 59 ప్రకారం 126 నుంచి 250 గజాల లోపు స్థలాన్ని ఆక్రమించుకున్న వారు మార్కెట్ వ్యాల్యులో 50 శాతం చెల్లించాలి.
  • 251 నుంచి 500 గజాల లోపు అయితే మార్కెట్ వ్యాల్యూలో 75 శాతం చెల్లించాలి.
  •  500 గజాల పైగా ఉంటే 100 శాతం మార్కెట్ రేటు చెల్లించాల్సి ఉంటుంది.
  • బిజినెస్, హాస్పిటల్స్, స్కూల్స్ వంటి కమర్షియల్ అవసరాల కోసం వాడుకునే స్థలమైతే విస్తీర్ణంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలి.

పాత తేదీలతో మస్కా

ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం ప్రభుత్వ భూములు, అర్బన్ సీలింగ్ యాక్ట్ పరిధిలోని భూముల్లో 2020 జూన్​2 నాటికి ఉన్న ఇండ్ల స్థలాలను మాత్రమే రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇండ్లను కడుతున్న అక్రమార్కులు రెగ్యులరైజేషన్​ కోసం పాత తేదీలతో ఇంటిపన్నులు, నల్లా బిల్లుల రసీదులు తీసుకుంటున్నట్లు తెలిసింది.

సంతకాలు ఫోర్జరీ చేస్తున్నరు

పొడ్చన్‌‌పల్లి పరిధిలోని ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ కట్టడాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఎవరికీ పర్మిషన్లు ఇవ్వలేదు. వారే నకిలీ స్టాంపులు తయారు చేసుకుని, కారోబార్ సంతకాలు ఫోర్జరీ చేసి పాత తేదీలతో నల్లా బిల్లులు, రశీదులు సృష్టించారు. 
- శ్రీకాంత్, సర్పంచ్, పొడ్చన్​పల్లి తండా

మా దృష్టికి రాలేదు

మెదక్ పట్టణంలోని నర్సాపూర్ రోడ్డు పక్కన ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల విషయం నా దృష్టికి రాలేదు. మున్సిపల్ సిబ్బందిని పంపించి ఇళ్ల నిర్మాణ పనులు జరగకుండా చూస్తా.
- జానకీ రాంసాగర్, 

మెదక్ మున్సిపల్ కమిషనర్
ఒక్కరోజులోనే రెడీ మేడ్ ​ఇండ్లు

59 జీవో కింద రెగ్యులరైజేషన్​కు చాన్స్ దొరకడంతో మెదక్ జిల్లాలో కొందరు అధికార పార్టీ లీడర్లు రెచ్చిపోతున్నారు. పాపన్న పేట మండలం పోడ్చన్ పల్లి తండా, శానాయిపల్లి పరిధిలోని సర్కారు భూముల్లో మెదక్ – బొడ్మట్ పల్లి మెయిన్ రోడ్డుకు ఇరువైపులా నెల రోజుల్లో వందలాది టెంపరరీ ఇండ్లు నిర్మించారు. మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో మెదక్ – హైదరాబాద్ నేషనల్ హైవేకు ఇరువైపులా పెద్దసంఖ్యలో ఇండ్లను కట్టేశారు. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు గడువు ఉండటంతో ఈ ఇండ్ల సంఖ్య పెరుగుతున్నది. మెదక్ మండలానికి చెందిన బీఆర్ఎస్ లీడర్ సపోర్ట్‌‌‌‌తోనే ఇక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, డీపీఓ ఈ రూట్​లోనే కలెక్టరేట్​కు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఈ నిర్మాణాలను పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల కింద మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని అవుసులపల్లి వద్ద 765 డీజీ నేషనల్ హైవే వెంట కూడా పదుల సంఖ్యలో ఇండ్లు వెలిశాయి. ఇప్పుడు నర్సాపూర్ రూట్​లో మెయిన్ రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ జాగలోనూ  ఇలాంటి ఇండ్లు పుట్టుకొస్తున్నాయి. రాత్రికిరాత్రే  సిమెంట్ ఇటుకలు, రెడీమెడ్ చౌకోట్లు, కిటికీలు, రేకులు తెప్పించి ఇండ్లను లేపుతున్నారు. వాటికి అప్పటికప్పుడు  సున్నాలు కూడా వేసి రెడీ చేస్తున్నారు.