ఆఫీసర్లు కూల్చేస్తే.. లీడర్లు కట్టిస్తున్రు 

ఆఫీసర్లు కూల్చేస్తే.. లీడర్లు కట్టిస్తున్రు 
  •  అమీన్ పూర్ మండలం పటేల్​గూడలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు 
  •   ఆఫీసర్లపై రూలింగ్​ పార్టీ లీడర్ల ఒత్తిడి  బిల్డర్లతో లీడర్లు   కుమ్మక్కై ఖాళీ స్థలాల కబ్జాలు 

సంగారెడ్డి/రామచంద్రపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్​మండలం పటేల్​గూడ లోని చెరువు బఫర్​జోన్​ భూముల్లో అక్రమ నిర్మాణాల విషయంలో  లీడర్లు వర్సెస్ ​ఆఫీసర్లుగా మారింది. అక్రమ నిర్మాణాలను ఆఫీసర్లు కూల్చేస్తే లీడర్లు మళ్లీ వాటిని కట్టిస్తున్నారు. చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించిన ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. బఫర్ జోన్ లో టీఆర్ఎస్​ లీడర్ల అక్రమ నిర్మాణాల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆక్రమణలు చేసే బిల్డర్లతో కుమ్మక్కై అంతా తామే చూసుకుంటామనే విధంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ యాక్ట్ ప్రకారం చర్యలకు పోతే దౌర్జన్యం చేస్తున్నారని ఆఫీసర్లు చెబుతుండటం.. రియల్టర్లు, ప్రజాప్రతినిధుల ఆగడాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది. అమీన్​పూర్​ మండలానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అధికార వ్యవస్థను తొక్కిపెట్టి పటేల్ గూడను శాసిస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఈ ప్రాంతంలో భూములు, ప్లాట్ల ధరలు రూ.కోట్లల్లో పలకడంతో పటేల్ గూడతోపాటు అమీన్ పూర్ మండలంలో కొందరు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలను కంట్రోల్​చేయడం తమ వల్ల కావట్లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. 

పటేల్ చెరువు కింది భాగంలో...

ఇప్పటికే పటేల్​గూడ పరిధిలోని చెరువులు ఎకరాల కొద్దీ కబ్జా అయ్యాయి. తాజాగా మిగిలిన బఫర్ జోన్​ల స్ధలాలను కూడా అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. బఫర్ జోన్ లోని కాలనీల్లో అక్కడక్కడ మిగిలిన స్థలాలతోపాటు వెంచర్లలో నిబంధనల ప్రకారం వదిలిన ఖాళీ భూములను కూడా వదలడం లేదు. పటేల్ చెరువు కట్ట కింది భాగంలో కొన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు వాటిని ఐదు రోజుల కింద కూల్చేశారు. కబ్జాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు కొందరు అదే స్థలంలో మళ్లీ రీకన్​స్ర్టక్షన్​ చేయిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రెండు ఎకరాల బఫర్ జోన్ స్థలాలు కబ్జా అయినట్లు ఆఫీసర్లు గుర్తించారు. పటేల్​గూడ పంచాయతీ పరిధిలో ఇటీవల కొన్ని అక్రమ నిర్మాణాలను అధికారులు మూడు సార్లు కూల్చేసినా మళ్లీ అక్కడ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.  నోటీసులిచ్చినా పట్టించుకోకపోగా వాటిని చించేస్తున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి మిగిలిన స్థలాలనైనా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

కూల్చడానికి వెళ్తే ఆఫీసర్లను అడ్డుకుంటున్రు..

ఆక్సిస్​కాలనీకి వెళ్లే దారిలో తప్పుడు పర్మిషన్లతో ఓ కమర్షియల్ ​బిల్డింగ్​నిర్మించారు. ఇది అక్రమ నిర్మాణమని గుర్తించి కూల్చడానికి వెళ్తే లీడర్లు అడ్డుకున్నట్లు రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. పైగా ఆక్రమణదారుల వద్ద బేరాలు మాట్లాడుకొని నెలల వ్యవధిలోనే ఆ నిర్మాణాన్ని పూర్తిచేయించారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు రూల్స్​కు విరుద్ధంగా ఖాళీ జాగాల్లో  భారీ షెడ్ల నిర్మాణాలను దగ్గరుండి కట్టిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఇలా అక్రమాలను ప్రోత్సహించడంపై ప్రజలు మండిపడుతున్నారు. పటేల్ గూడ చెరువు కింది భాగంలో జరుగుతున్న ఆక్రమణలపై స్థానికులు కొందరు 2 రోజుల క్రితం హెచ్ఆర్ సీపీసీకి  ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాల్లో పెద్ద సంఖ్యలో జరుగుతున్న అక్రమ కట్టడాలను నియంత్రించి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మళ్లీ కూల్చేస్తాం..

అమీన్​పూర్​ పరిధిలోని పటేల్​గూడ పంచాయతీలోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు వాస్తవమే. గతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. పొలిటికల్​సపోర్టుతో రీ కన్​స్ర్టక్షన్​ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీకి వివరిస్తూ కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించాం. త్వరలో అక్రమ నిర్మాణాలను కూల్చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
- డీఎల్పీవో సతీశ్​రెడ్డి