వనపర్తి జిల్లా విద్యాశాఖలో గందరగోళం .. అక్రమ డిప్యుటేషన్లపై రగడ

వనపర్తి జిల్లా విద్యాశాఖలో గందరగోళం .. అక్రమ డిప్యుటేషన్లపై రగడ

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా జిల్లా విద్యాశాఖలో అక్రమ డిప్యుటేషన్లు, రీప్యాట్రియేషన్లు, పోస్టింగులతో గందరగోళం నెలకొంది. విద్యాశాఖలో ఓ ఉన్నతాధికారి తనకు నచ్చిన వారికి అక్రమంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. రూల్​ ప్రకారం వెళితే పనులు చేయడం లేదని పలువురు టీచర్లు చెబుతున్నారు. డిప్యుటేషన్లు, అక్రమ పోస్టింగులపై ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, వివిధ పార్టీల చోటామోటా నాయకులు పైరవీలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.

రూల్స్​ పాటించట్లే..
    

  • గత ఏడాది ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చారు. ఇంగ్లిష్  ప్రమోషన్​ పొందిన టీచర్లలో సీరియల్​ నంబర్ 1 నుంచి 16 వరకు రోస్టర్​లో ఉన్న వారిలో కొందరు గైర్హాజరయ్యారు. వారి నంబర్ల నుంచి కాకుండా 17వ నంబర్​ నుంచి రోస్టర్​  ఫిక్స్​ చేయడంతో మెరిట్​ ఉన్న తమకు అన్యాయం జరిగిందని పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత స్కూల్​ డైరెక్టర్​ ఆఫీస్​ నుంచి జిల్లా కేంద్రంలోని హైస్కూల్​కు డిప్యుటేషన్​ వేశారు.    
  • డీఈవో ఆఫీస్​లో ఫారెన్​ సర్వీసెస్​ కింద ఇద్దరు టీచర్లు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. వారు  రీప్యాట్రియేషన్​ కింద గతంలో పని చేసిన స్కూళ్లకే వెళతామనడంతో ఉత్తర్వులు ఇచ్చారు. ఒకరికి గతంలో పని చేసిన స్కూల్​కే ఇవ్వగా, మరొకరికి ఆయన పని చేసిన స్కూల్​లో ఖాళీ లేకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్​కు కేటాయించారు. రీప్యాట్రియేషన్​ ఉత్తర్వుల్లో ఫారెన్​ సర్వీసెస్​ కింద వెళ్లిన వారి ప్లేస్​ ఖాళీ లేకుంటే అదే మండలంలోని పక్క స్కూల్  లేదంటే పక్క మండలంలో ఇవ్వాలని నిబంధన ఉంది. కానీ, సదరు టీచర్​కు వెల్టూరులో ఖాళీ ఉన్నా జిల్లా కేంద్రంలో రీప్యాట్రియేషన్​ ఇచ్చారు.    
  • కొత్తకోట మండలం నుంచి ఎల్ఎఫ్ఎల్​ హెచ్ఎంను గత ఏడాది జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్​కు డిప్యుటేషన్​ ఇచ్చారు. పాన్​గల్​ మండలంలోని ఓ ఎల్ఎఫ్ఎల్​ హెచ్ఎంను గోపాల్​పేట మండలానికి డిప్యుటేషన్​ ఇచ్చారు. పెద్దమందడి మండలంలోని ఓ స్కూల్​ అసిస్టెంట్​కు జిల్లా కేంద్రానికి సమీపంలోని స్కూల్​కు, అదే మండలంలోని మరో స్కూల్​ నుంచి ఖాళీ అయిన స్కూల్​కు డిప్యుటేషన్  ఇచ్చారు. డిప్యుటేషన్​ మీద వెళ్లిన వారు అకడమిక్​ ఇయర్​ ముగిసే రోజు పోస్టింగ్​ ఉన్న స్కూల్​లో రిపోర్ట్​ చేయాలి. ఆ తర్వాత మళ్లీ డిప్యుటేషన్​ కోసం అప్లై చేసుకోవాలి. ఇవేమి లేకుండానే కొనసాగుతున్నారు. 

కొత్తగా పోస్టులొచ్చినా?

డీఈవో ఆఫీస్​కు ఇటీవల కొత్తగా ప్రమోషన్​పై ఇద్దరు సీనియర్​ అసిస్టెంట్లు, గ్రూప్–-4 కింద ముగ్గురు సిబ్బంది వచ్చారు. అయినప్పటికీ ఫారెన్​ సర్వీసెస్, అడిషనల్​ చార్జ్  కింద స్కూళ్లలో పని చేసే టీచర్లను తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. పాన్​గల్​ మండలంలోని ఓ ప్రైమరీ స్కూల్​లో ముగ్గురు టీచర్లు  ఉండగా, ఒకరు డీఈవో ఆఫీస్​లో ఫారెన్​ సర్వీసెస్​ కింద చేరారు. అక్కడి హెచ్ఎం ఈ నెలాఖరులో రిటైర్  కానున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఈ స్కూల్​లో మరో వారం రోజుల తరువాత ఒక్క టీచరే ఉండనున్నారు. 

డీసీఈబీ సెక్రటరీ పోస్టు నుంచి ఒకరిని తప్పించి, మరొకరిని తీసుకోవడంపై రచ్చ జరిగింది. ఇలా విద్యాశాఖలో డిప్యుటేషన్లు, ఫారెన్​సర్వీస్​, అడిషనల్​ చార్జి పేరుతో అక్రమాలు జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ విషయమై డీఈవో అబ్దుల్​ ఘనిని ఫోన్​లో సంప్రదించగా, ఆయన స్పందించలేదు.