
జహీరాబాద్, వెలుగు: గోవా నుంచి నల్గొండకు కారులో అక్రమంగా తరలిస్తున్న 162 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం మొగుడంపల్లి మండలం చిరాకుపల్లి ఆర్టీఏ చెక్‌పోస్ట్ సమీపంలో వెహికల్స్ తనిఖీ చేస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులకు కారులో తరలిస్తున్న అక్రమ మద్యం పట్టుబడింది. ఎక్సైజ్ పోలీసుల వివరాల ప్రకారం నల్గొండ జిల్లా పెద్ద అడిసెపల్లికి చెందిన ఓ కుటుంబం టూర్ కోసం గోవాకు వెళ్లారు.
అక్కడ తక్కువ ధరకే మద్యం లభించడంతో తమకు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో అవసరం పడుతుందని 162 మద్యం బాటిళ్లను కొనుగోలు చేసుకొని కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. మద్యం విలువ 1.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. 162 మద్యం బాటిళ్లు, కారును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. జయంత్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.