
- 8 వాహనాలు స్వాధీనం.. రూ.1.70 లక్షల జరిమానా
లక్సెట్టిపేట, వెలుగు: నాటు సారా తయారుచేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని లక్సెట్టిపేట ప్రొహిబిషన్ అండ్ఎక్సైజ్ సీఐ ఎస్.సమ్మయ్య హెచ్చరించారు. నాటు సారా నిర్మూలన కోసం ఈ నెల 30 వరకు ప్రత్యేక రైడ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
లక్సెట్టిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు 152 నాటు సారా కేసులు నమోదయ్యాయని చెప్పారు. 145 మందిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు.
గుడ్ బిహేవియర్ కోసం 111 మందిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయగా అందులో నలుగురిపై బైండోవర్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయన్నారు. వారికి రూ.1.70 లక్షల జరిమానా విధించామని, మరొకరికి మూడు నెలల జైలు శిక్ష పడిందన్నారు. నాటుసారా రవాణా చేస్తున్న 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.