పెద్దపల్లి ఇటుకబట్టీలకు .. కరీంనగర్ చెరువుల మట్టి

పెద్దపల్లి ఇటుకబట్టీలకు .. కరీంనగర్ చెరువుల మట్టి
  • రామడుగు మండల చెరువుల నుంచి తరలింపు 
  • అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన ఇరిగేషన్ ఆఫీసర్లు
  • ఇష్టారాజ్యంగా ఇటుక బట్టి యజమానుల మట్టి తవ్వకాలు
  • పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు

కరీంనగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ఇటుక బట్టీలకు కరీంనగర్ జిల్లా చెరువుల్లోని రేగడి మట్టి తరలుతోంది. ఇటుక బట్టీల యజమానులు, మట్టి కాంట్రాక్టర్లతో కుమ్మక్కయిన ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలకు పర్మిషన్లు ఇస్తున్నారు. రామడుగు మండలం గుండిచెరువు, షానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎల్లమ్మ చెరువు, చొప్పదండి మండలం రేవెల్లిలోని ఎల్లమ్మ చెరువు నుంచి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మట్టి తరలించేందుకు అనుమతులు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మట్టి తరలింపునకు అనుమతులు ఇవ్వగా.. రాత్రింబవళ్లు తేడా లేకుండా పదుల సంఖ్యలో లారీల్లో తరలిస్తున్నారు. ఇంతా జరుగుతున్నా ఆయా మండలాల రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాకో తీరుగా పర్మిషన్లు

ప్రతి ఏటా ఎండాకాలంలో ఇటుక బట్టీల యజమానులు చెరువుల్లోని బంకమట్టిని తరలించి నిల్వ చేసుకుంటారు. చెరువుల్లో మట్టి తరలింపునకు ఇరిగేషన్ ఆఫీసర్ల అనుమతి తప్పనిసరి. పెద్దపల్లి జిల్లాలో ఎక్కువగా ఇటుకబట్టీలు ఉన్న విషయం తెలిసిందే. ఇటుక బట్టీ వ్యాపారులు కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాయల్టీ చెల్లించి సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో క్యూబిక్ మీటర్ల చొప్పున కాకుండా  ట్రిప్పుల చొప్పున కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే బ్రిక్స్ యజమాని పేరు, ట్రిప్పుల సంఖ్యను ఇస్తున్నారు.  ట్రిప్పునకు రూ.2700 చొప్పున రాయల్టీ, సీనరేజీ చార్జీలు వసూలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మాత్రం క్యూబిక్ మీటర్ల చొప్పున ఇరిగేషన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ స్థాయిలోనే అనుమతులు ఇచ్చేస్తున్నారు. 

ట్రిప్పుల చొప్పున తీసుకోవడం కంటే.. క్యూబిక్ మీటర్ల చొప్పున అనుమతి తీసుకుంటే ఇష్టారాజ్యంగా తవ్వుకోవచ్చనే ఉద్దేశంతో కరీంనగర్ ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లతో సదరు కాంట్రాక్టర్లు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని తక్కువ రాయల్టీ చెల్లించి మట్టిని తరలించుకుపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువుల్లోనూ పర్యవేక్షణ లేకపోవడంతో అనుమతులకు మించి తోడేస్తూ లారీల్లో సామర్థ్యానికి మించి మట్టిని తరలిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. 

అనుమతులు గోరంత.. తవ్వేది కొండంత..

చెరువుల్లో అనుమతులకు మించి కాంట్రాక్టర్లు మట్టి తవ్వేస్తున్నారు. రేవెల్లి చెరువులో 2 వేల క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకున్నప్పటికీ.. 6 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామడుగు మండలం గుండి చెరువులో 1500 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకుని 4 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించారనే విమర్శలు ఉన్నాయి. షానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎల్లమ్మ చెరువులోనూ అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

1.20 మీటర్ల మేర మట్టి తవ్వాల్సి ఉండగా.. రెండు, మూడు మీటర్ల లోతులో జేసీబీతో మట్టి తవ్వడం, అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై కొత్తపల్లి డివిజన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సుధాకిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వివరణ కోరగా.. చెరువుల్లో సిల్ట్ తొలగించేందుకే మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చామన్నారు. నిబంధనల మేరకే మట్టి తరలిస్తున్నారని, తమ డిపార్ట్ మెంట్ వర్క్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని
 వివరించారు. 

ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు 

పర్మిషన్ కు మించి ప్రకృతి సంపదలను ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తే మా వెనుకాల పెద్దపెద్ద వాళ్లున్నారు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇందుకు నిరసనగా లారీలు వెళ్లే రోడ్డుకు అడ్డుగా కూర్చొని నిరసన కూడా తెలియజేశాం. అయినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.

మేడి శ్రీనివాస్, గుండి మాజీ ఉపసర్పంచ్