
- వారం రోజుల కింద నోటీసులు
జూలూరుపాడు, వెలుగు: ఖమ్మం జిల్లాలో అక్రమంగా క్వారీ నడిపిస్తున్న క్వారీ యజమానికి మైనింగ్ ఆఫీసర్లు భారీ జరిమానా విధించారు. జూలూరుపాడు, గుండెపూడి గ్రామాల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా మెటల్ క్వారీలో తవ్వకాలు జరిపినందుకు క్వారీ యజమానికి మైనింగ్ అధికారులు వారం రోజుల కింద నోటీసులు జారీ చేసి, రూ.21 కోట్ల 61 లక్షల 73 వేల 240 పెనాల్టీ విధించారు. అలాగే ఒకచోట అనుమతులు పొంది, మరోచోట తవ్వకాలు జరిపినట్లు వచ్చిన ఆరోపణలు రావడంతో గురువారం మైనింగ్, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు.
ఆర్ఐ ఆదినారాయణ, మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ పరశురాం, సర్వేయర్లు పూర్ణ, ప్రవీణ్ లు జూలూరుపాడు, గుండెపుడి రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. క్వారీ యజమాని అనుమతులకు విరుద్ధంగా మైనింగ్ చేపట్టినట్లు తేల్చారు. ఇదిలాఉంటే క్వారీలో అక్రమ తవ్వకాలు జరిపిన యజమాని భూక్యా రత్నాకు రాయల్టీ కింద రూ.21.61 కోట్లు చెల్లించాలని గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ, స్పందించకపోవడంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా రాయల్టీ రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తహసీల్దార్ స్వాతి బిందు నోటీసులు అందజేశారు.