
- బార్డర్ లో జోరుగా దందా
- ఇక్కడి పోలీసులు, ఏపీ ఇసుక వ్యాపారుల కుమ్మక్కు?
- మెన్నిపాడు ఇసుక రీచ్ కు భారీగా తగ్గిన గిరాకీ
గద్వాల, వెలుగు: రాష్ట్రంలోకి ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రతీరోజు పదుల సంఖ్యలో టిప్పర్లను తెలంగాణ బార్డర్ దాటించి, అలంపూర్ నియోజకవర్గంలోని పలుచోట్లకు సరఫరా చేస్తున్నారు. స్థానిక పోలీసులు, లీడర్లు ఏపీ ఇసుక వ్యాపారులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలున్నాయి. ఈ దందా కారణంగా మానవపాడు మండలం మెన్నిపాడు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ కు గిరాకీ భారీగా తగ్గింది. ఏపీలో ఇసుక ఉచితంగా సరఫరా చేసుకునే వెసులుబాటు ఉండడంతో అక్కడి వ్యాపారులు రాత్రి వేళల్లో ఇక్కడికి తీసుకొచ్చి, విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నెలకు ఒక టిప్పర్ కు ఇంత అంటూ పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారని, ఇవ్వకపోతే వాహనాలను సీజ్చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
పగలు డంప్.. రాత్రి లిఫ్ట్
ఏపీలోని పంచలింగాల, తాండ్రపాడు, దేవమాడ గ్రామాల్లో తుంగభద్ర నది నుంచి ఇసుకను పగలు తోడేసి, సమీపంలోని తెలంగాణకు చెందిన సింగవరం, బైరాపురం గ్రామాల్లో డంప్చేస్తున్నారు. రాత్రివేళ తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ ఇసుకను రూ.25 వేల నుంచి రూ.30 వేలకు పైగా విక్రయిస్తున్నారు.
నెలకు రూ.లక్షన్నర?
ఏపీ నుంచి రాష్ట్రంలోకి ఇసుకు తీసుకువచ్చే ఒక్కో టిప్పర్ కు సంబంధించి పోలీసులకు నెలకు రూ.లక్షన్నర వరకు ఇసుక వ్యాపారులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం 5 టిప్పర్లు వస్తున్నాయని, ఈ లెక్కన ప్రతి నెలా రూ.7.50 లక్షలు పోలీసులకు ముడుతున్నాయన్న
చర్చ జరుగుతోంది.
అలంపూర్ మొత్తం ఏపీ ఇసుకనే..
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుకను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మెన్నిపాడు విలేజ్ లో ఇసుక రీచ్ ఏర్పాటు చేసింది. దీన్ని ప్రారంభించిన మొదట్లో గిరాకీ బాగానే ఉండేది. ఏపీ నుంచి ఇసుక అక్రమంగా వస్తుండటంతో గిరాకీ భారీగా తగినట్లు మైనింగ్ ఆఫీసర్ల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా అమ్ముడుపోని పరిస్థితి ఉందంటే.. ఏపీ ఇసుక వ్యాపారుల దందా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అలంపూర్ నియోజకవర్గం మొత్తం ఏపీ ఇసుకనే సరఫరా చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఏపీ నుంచి తెలంగాణలోకి అక్రమ ఇసుక తరలింపుపై నిఘా పెడతాం. అలంపూర్ నియోజకవర్గ పోలీసులపై వస్తున్న ఆరోపణలపై ఎంక్వైరీ చేస్తాం. ఇసుక దందాపై కఠిన చర్యలు తీసుకుంటాం. డబ్బు వసూలు చేస్తున్నట్లు తేలితే సంబంధిత ఆఫీసర్ల పైనా చర్యలు తప్పవు.
మొగులయ్య, డీఎస్పీ, గద్వాల