పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతోంది. దర్గా చెరువులో నల్ల రేగడి మట్టి పేరుతో స్థానిక వార్డు మెంబర్ తన బంధువులు, స్నేహితుల పేర్ల మీద సంబంధిత ఆఫీసర్లతో పర్మిషన్ తీసుకుని మొరాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
110 సర్వే నెంబర్ దర్గా శిఖం భూమిలో మాత్రమే మట్టిని చెరువుకట్టకు దూరంగా తీయాలి, కానీ, నల్లరేగడి మట్టికి అనుమతులు పొంది ప్రైవేటు అవసరాలు, ఖాళీ ప్లాట్లు, ఎఫ్టీఎల్ భూములు, చుట్టుపక్కల గ్రామాల ఇటుక బట్టీలకు అర్ధరాత్రి వరకు తరలిస్తూ అమ్ముకుంటున్నారు. ఐబీ ఆఫీసర్లు ఈనెల 26 నుంచి మట్టి తవ్వకాలకు పర్మిషన్ ఇస్తే ఇవ్వగా, 21వ తేదీ నుంచే వేల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నా ఆఫీసర్ల పర్యవేక్షణ కరువైంది. ఇప్పటికైనా ఆఫీసర్లు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
