ఐనవోలు కాలేజీ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్లకు అస్వస్థత

ఐనవోలు కాలేజీ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్లకు అస్వస్థత

గండీడ్, వెలుగు: పురుగుల అన్నం తినలేక రెండు వారాలుగా ఒక్క పూట భోజనంతో సరిపెట్టుకుంటున్న ఏడుగురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్​నగర్ ​జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని షెడ్యూల్ కులాల ఆనంద నిలయంలో 60 మంది బాలికలు ఉంటూ మండల కేంద్రంలోని గర్ల్స్​హైస్కూల్‭లో చదువుకుంటున్నారు. హాస్టల్‭లో ఉంటున్న ఏడుగురు బాలికలు శనివారం స్కూల్​లో స్పృహ తప్పి కింద పడిపోయారు. వెంటనే పాఠశాల సిబ్బంది వారిని మండల కేంద్రంలోని పీహెచ్​సీకి తరలించారు. ఘటనపై విద్యార్థులను అడగగా ఆనంద నిలయంలో పురుగుల కూడు వండి పెడుతుండడంతో తినలేకపోతున్నామని చెప్పారు. రెండు మూడు వారాల నుంచి పురుగుల అన్నం, నీళ్ల చారు, పులిహోరలో పసుపు వేసి ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని తెలిపారు. 

అన్నంలో రాళ్లు వస్తున్నాయంటే తీసేసి తినాలని అంటున్నారని, పురుగులొస్తున్నాయని వంట నిర్వాహకులకు చెబితే వార్డెన్ మేడం ఇచ్చినవి వండి పెడుతున్నాం.. తింటే తినండి లేకుంటే మీ ఇష్టం అంటున్నారని చెప్పారు. వార్డెన్ కు చెబితే నాకే ఎదురు చెప్తారా.. పెట్టింది తినండి.. లేదంటే టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తానని బెదిరిస్తున్నారని బాలికలు వాపోయారు. విషయం తెలుసుకున్న డీడీ యాదయ్య, మహమ్మదాబాద్ తహసీల్దార్ ఆంజనేయులు పీహెచ్​సీకి వెళ్లి స్టూడెంట్లతో మాట్లాడారు. వార్డెన్ మేడం మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, బెదిరిస్తున్నారని, వార్డెన్​ను మార్చాలని ఆఫీసర్లతో బాలికలు మొరపెట్టుకున్నారు. పిల్లలు నీరసంగా ఉన్నారని, బ్లడ్ లెవెల్ తక్కువ ఉండడంతో సెలైన్​పెట్టామని డాక్టర్లు చెప్పారు. ట్రీట్​మెంట్​తర్వాత స్టూడెంట్లను ఆటోలో స్కూల్‭కు తీసుకెళ్లారు.

స్టూడెంట్లకు అస్వస్థత

పర్వతగిరి/ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఫున్నెలు క్రాస్ శివారులో ఉన్న మైనారిటీ స్కూల్, కాలేజీ రెసిడెన్షియల్ స్కూల్లో నలుగురు స్టూడెంట్లు అస్వస్థకు గురయ్యారు. స్థానికులు, స్టూడెంట్లు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే స్టూడెంట్లకు శనివారం భోజనం పెట్టారు. అన్నం సరిగా ఉడకకపోవడంతో అది తిన్న నలుగురు స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే టీచర్లు వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి జాగ్రత్తపడ్డారు. ఉడకని అన్నాన్ని బయటపడేసి స్టూడెంట్లకు మళ్లీ వండి పెట్టారు. సరైన సమయంలో టీచర్లు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, సాంబార్ మొత్తం నీళ్లలా ఉంటోందని స్టూడెంట్లు చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.