యుద్ధాలు ఆపడంలో నేనే తోపు.. మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ట్రంప్

యుద్ధాలు ఆపడంలో నేనే తోపు.. మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. యుద్ధాలు ఆపడంలో తానే తోపునని.. తనను మించినవారే లేరని ఆయనకు ఆయనే గొప్పలు చెప్పుకున్నారు. నోబెల్ బహుమతి కోసమే తాను ఇదంతా చేస్తున్నాననే వాదనలను ఆయన తోసిపుచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికే యుద్ధాలను ఆపానని కవర్ చేశారు. తన శాంతి కార్యక్రమాలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయని.. ఇది తనకు చాలా గౌవరమని అన్నారు.

 అమెరికా మధ్యవర్తిత్వంతో గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.  2025, అక్టోబర్ 13న ఈజిప్ట్ వేదికగా ఇరుపక్షాలు గాజా శాంతి ఒప్పందంపై సంకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరుదేశాలు బందీలు, ఖైదీలను పరస్పరం అప్పగించుకోనున్నాయి. గాజా శాంతి ఒప్పందం కుదిరిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధాలు ఆపడంలో తాను స్పెషలిస్టుని అని బీరాలు పలికారు. ఇప్పటి వరకు ఏడు యుద్ధాలు ఆపానని.. హమాస్-ఇజ్రాయెల్ వార్ తాను ఆపిన ఎనిమిదో యుద్ధమని చెప్పారు. 

తాను ఇదంతా చేసేది నోబెల్ శాంతి బహుమతి కోసం కాదని.. అమాయక ప్రజల ప్రాణాలను కాపాడటం కోసమేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను రక్షించానన్నారు. తన దౌత్యం అవార్డులు గెలుచుకోవడం కంటే ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఉందని స్పష్టం చేశారు. సుంకాలు విధిస్తానని హెచ్చరించి ఇండియా, పాక్ వార్ కూడా ఆపానని మళ్లీ అదే పాత పాడారు. తాజాగా పాకిస్తాన్-ఆప్ఘానిస్తాన్ యుద్ధం గురించి విన్నానని.. ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్పానన్నారు. పాక్, ఆప్ఘాన్ యుద్ధాన్ని కూడా తానే పరిష్కరిస్తానని చెప్పారు.