మళ్లీ కరోనా రూల్స్‌‌ పాటించాలని ఐఎంఏ డాక్టర్ల సూచన

మళ్లీ కరోనా రూల్స్‌‌ పాటించాలని  ఐఎంఏ డాక్టర్ల సూచన

పెండ్లిండ్లు, సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని వినతి

న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇండియాలో కరోనా రూల్స్‌‌ పాటించాలని ప్రజలకు ఇండియన్‌‌ మెడికల్‌‌ అసోసియేషన్‌‌ (ఐఎంఏ) విజ్ఞప్తి చేసింది. రాబోయే వైరస్‌‌ వ్యాప్తిని అధిగమించడానికి అవరసమైన చర్యలు తీసుకోవాలని కోరింది. పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులు ధరించాలని, సోషల్‌‌ డిస్టెన్స్‌‌ పాటించాలని, సబ్బు, శానిటైజర్‌‌‌‌లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని సూచించింది. వీలైనంత తొందరగా అందరూ బూస్టర్‌‌‌‌ డోస్‌‌ వేసుకోవాలని ఐఎంఏ డాక్టర్లు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. 

పెండ్లిండ్లు, సమావేశాలు, సభలు, ఇంటర్నేషనల్‌‌ టూర్లకు దూరంగా ఉండాలని చెప్పారు. జ్వరం, గొంతునొప్పి, దగ్గు, లూజ్ మోషన్‌‌లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కోరారు. కాగా, అమెరికా, జపాన్‌‌, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌‌, బ్రెజిల్‌‌ వంటి ప్రధాన దేశాల్లో గడిచిన 24 గంటల్లో 5.34 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 145 కొత్త కేసులు వచ్చాయి. వీటిలో 4 కేసులు కొత్త చైనా వేరియంట్‌‌ బీఎఫ్‌‌.7 అని డాక్టర్లు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా లేదని, భయపడాల్సిన పని లేదన్నారు. అయితే, చికిత్స కంటే నివారణ మంచి మార్గమని పేర్కొన్నారు.