హుస్సేన్ సాగర్‌‌లోనే నిమజ్జనం చేస్తాం

హుస్సేన్ సాగర్‌‌లోనే నిమజ్జనం చేస్తాం

హైదరాబాద్ : వినాయక విగ్రహాలను ఈ నెల 9న హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రకటించింది. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయకుంటే ఎక్కడి విగ్రహాలు అక్కడే పెట్టి నిరసనలు చేపడతామని తెలిపింది. సోమవారం సిద్ధంబర్ బజార్ లోని ఆఫీసులో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధానకార్యదర్శి భగవంత్ రావు మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఎందుకు రివ్యూకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హిందూ ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీలో ఈ విషయంపై మాట్లాడాలని కోరారు. వినాయకుడి నిమజ్జనాలపై ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిమజ్జనాల వల్ల హుస్సేన్ సాగర్ కలుషితం కావడం లేదన్నారు. ఈ నెల 9న గణేశ్ నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగర్ గణేశ్ఉత్సవ సమితి నిర్ణయించిందని, హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరుపుతామన్నారు. కొంతమంది పోలీసులు 9న నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారన్నారు.

శనివారం చతుర్దశి కావడంతో శుక్రవారమే నిర్వహించాలన్నారు. గతేడాది లాగే నిమజ్జనం నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఏర్పాట్లు చేయడంలేదన్నారు. సీఎం కేసీఆర్ హిందూ వ్యతిరేక ధోరణి అవలంబిస్తున్నారని, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ, క్రిస్ మస్, రంజాన్, మొహర్రం పండుగల మీద చూపే ఆసక్తి గణేశ్ ఉత్సవాలపై చూపడంలేదన్నారు. 2001లో సత్యవతి సిన్హా జడ్జిమెంట్ లో కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని చెప్పలేదన్నారు. తమిళనాడులో జల్లికట్టు అంశంలో కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఏవిధంగా చర్యలు తీసుకున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా నిమజ్జనాలకు అదేవిధమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాలాపూర్ గణేశ్ విగ్రహాన్ని హుస్సే న్ సాగర్​కు తీసుకురాకుండా ఉత్సవ సమితికి పోలీసు లు కౌన్సిలింగ్ ఇచ్చారని అటువంటి చర్యలు మానుకోవాలన్నారు. పర్యావరణానికి హాని కలుగకుండా 24 గంటల్లోనే నిమజ్జనం చేసిన వ్యర్థాలను తొలగిస్తున్నామన్నారు. గణేశ్ నిమజ్జనంలో ఎలాంటి అపశృతి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే చేయాలని మంగళవారం ట్యాంక్ బండ్ పై బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.