వలస వచ్చినోళ్లే కాంగ్రెస్లో ముందుంటున్నరు: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వలస వచ్చినోళ్లే కాంగ్రెస్లో ముందుంటున్నరు: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్, వెలుగు: పదేండ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తే.. కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నాయకులే ముందు వరసలో ఉంటున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం పొలాసలో పర్యటించిన ఆయన పౌలస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందినవారు పనికిరారా.. అంటూ పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.  వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంచేశారు.  సెలెక్ట్, ఎలెక్ట్ పద్ధతిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధంగా కాంగ్రెస్ విధానం రూపొందించాలని కోరారు. 

సాయంత్రం పౌలస్తీశ్వర కొత్త ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై..  జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించారు.  ఆయన మాట్లాడుతూ..  కొందరు అనవసరంగా రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. ట్రస్ట్ సభ్యులు ఏడుగురిలో ముగ్గురు పొలాసకు చెందినవారేనని ఎమ్మెల్యే తెలిపారు.