డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు అవకాశాలపై ప్రభావం

డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు అవకాశాలపై ప్రభావం
  • నాలుగో రోజు తప్పిదాలతోనే ఓటమి
  • స్లో ఓవర్​ రేట్​ కారణంగా జట్టుపై 2 పాయింట్ల పెనాల్టీ
  • డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు అవకాశాలపై ప్రభావం

(వెలుగు స్పోర్ట్స్​ డెస్క్​) రోహిత్‌‌ శర్మ, లోకేశ్‌‌ రాహుల్  జట్టుకు దూరమయ్యారు. ప్రిపరేషన్స్‌‌ అంత బాగాలేవు. కెప్టెన్సీ అనుభవమే లేని బుమ్రాకు నాయకత్వం అప్పగించారు. దాంతో ఐదో టెస్టులో ఇండియా గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే, రిషబ్‌‌ పంత్‌‌, జడేజా, బుమ్రా గొప్పగా రాణించి,  మూడు రోజులూ ప్రత్యర్థిపై పైచేయి సాధించి విజయంపై ఆశలు రేపారు. కానీ, నాలుగో రోజు ఆటలో తడబాటు జట్టును ముంచింది. తొలి ఇన్నింగ్స్‌‌లో 132 పరుగుల ఆధిక్యం రాబట్టిన తర్వాత  కూడా ఓడిపోవడం టీమిండియా స్వయంకృతమే. ఈ ఓటమితో పాటు, స్లో ఓవర్‌‌ రేట్‌‌ కారణంగా  వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియషిప్‌‌ (డబ్ల్యూటీసీ)లో  ఇండియాపై  రెండు పాయింట్ల పెనాల్టీ పడటం మరో దెబ్బ. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో నాలుగో ప్లేస్​లో ఉన్న ఇండియా ఫైనల్‌‌ చేరే అవకాశాలపై కూడా  ప్రభావం పడనుంది.  ఫలితాన్ని పక్కనబెడితే  కెప్టెన్‌‌గా తొలి మ్యాచ్‌‌లో బుమ్రా అద్భుతంగా రాణించినప్పటికీ.. సీనియర్లతో కూడిన  జట్టు అనేక తప్పులు చేసి మూల్యం చెల్లించుకుంది. రెండో ఇన్నింగ్స్‌‌లో 125 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోవడం మొదలు... సోమవారం చివరి సెషన్‌‌లో బౌలింగ్‌‌, ఫీల్డింగ్‌‌ వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. డీప్‌‌ ఎక్స్‌‌ట్రా కవర్‌‌, డీప్‌‌ మిడ్‌‌ వికెట్‌‌, డీప్‌‌ ఫైనల్‌‌ లెగ్‌‌లోనే  ఫీల్డర్లను పెట్టి  బౌలింగ్‌‌ చేయించి బుమ్రా, ద్రవిడ్​ తప్పుచేశారు. లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్‌‌ జడేజా ఇన్నింగ్స్‌‌ మొత్తం ఓవర్‌‌ ది వికెట్‌‌ బౌలింగ్‌‌ చేసి  బ్యాటర్లు ఎల్బీ అయ్యే చాన్సే లేకుండా చేయడం మరో గమ్మత్తు.  మూడో, నాలుగో పేసర్లుగా ఉన్న సిరాజ్‌‌, శార్దూల్‌‌ నాలుగో ఇన్నింగ్స్‌‌లో అసలేమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇద్దరూ ఎక్కువగా షార్ట్‌‌ పిచ్‌‌ బాల్స్‌‌ లేదంటే ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్స్‌‌ వేసి  ఇంగ్లండ్​ పని సులువు చేశారు.