ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ డే.. ఇంగ్లీషు దేశంలో పాకితే..

ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్  డే.. ఇంగ్లీషు దేశంలో పాకితే..

ప్రతి సంవత్సరం అక్టోబర్​ 5న ఇండియన్​ ఇంగ్లీష్​ డే మనం జరుపుకుంటాం.  ఎందుకు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. 1817లో అక్టోబర్​ 5న కోల్​కతా నగరంలో.. బ్రిటన్​లో పుట్టి చెప్పులు కుట్టే పనిచేసుకునే ఒక క్రిష్టియన్​ మిషనరీ ఒక చిన్న ఇంగ్లీష్​ మీడియం స్కూల్​ స్థాపించాడు. దానికి రాజారామ్మోహన్​ రాయ్​ పూర్తిగా సహకరించాడు. భారతదేశంలో మొట్టమొదట ఇంగ్లీషు నేర్చుకున్న వ్యక్తి కూడా రాజా రామ్మోహన్​ రాయ్​నే. బ్రాహ్మణ కుటుంబాల్లో సంఘ సంస్కరణ చేయడం కోసం ఆయన పట్టుబట్టి ప్రైవేటుగా ఇంగ్లీష్​ నేర్చుకొని బ్రిటిష్​వారితో కొన్ని  స్త్రీ విముక్తి చట్టాలు చేయించాడు. ఆయన విలియంకేరికి పూర్తిగా అండగా నిలిచాడు. అక్కడ ప్రారంభమైన ఇండియన్​ ఇంగ్లీష్​ ఇప్పటికీ దేశ పరిపాలనా భాషగా కొనసాగుతూనే ఉంది. 

దే శంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రైవేటు స్కూళ్లతో పాటు, ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్​ బోధన జరుగుతుంది. తెలంగాణలో గత మూడు ఏండ్లుగా మొత్తం గ్రామీణ స్కూళ్లలో ఇంగ్లీషు​ భాషలో బోధన జరుగుతుంది. దీన్ని సులభంగా జరిపేందుకు ప్రభుత్వం ద్విభాష (Mirror image text books) పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నది. ఈ సంవత్సరం జూన్​ 12న స్కూళ్లు తెరిచిన రోజుకే ద్విభాషా పుస్తకాలు అందాయి. ఇది మెచ్చుకోదగ్గ అంశం.

అయితే, ఈ సంవత్సరం ఇండియన్​ ఇంగ్లీష్​డే ఆదివారం రావడంతో దాన్ని స్కూళ్లలో జరుపుకోవడం సాధ్యంకాలేదు. కానీ ప్రతి ఏటా ప్రజావేదికల మీద జరుపుకోవచ్చు. ఈసారి దసరా సెలవుల సందర్భంకావడంతో ఆ దినాన్ని స్కూళ్లలో జరుపుకోవడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదే రోజు ఇంటర్నేషనల్​ టీచర్స్​డే కూడా కనుక ప్రతి ఏటా రెండింటిని కలిపి జరుపుకోవడం చాలా మంచిది. వ్యక్తిగా నాకు ఈ డే చాలా ప్రత్యేకమైంది. 

నా పుట్టిన రోజు స్కూల్లో డిసైడ్ అయింది

నాకు1960 ప్రాంతంలో మొదట మా ఊళ్లోని స్కూల్లో చేరినపుడు సీహెచ్​ రాజలింగం అనే సింగిల్​ స్కూల్ ​ టీచర్​ నా బర్త్​డే కూడా అక్టోబర్​5 చేశాడు. నిజానికి ఏతేదీన  పుట్టానో ఈనాటికీ నాకు తెలియదు. ఇప్పటికీ చాలా మంది గ్రామీణ, ఆదివాసి పిల్లల పరిస్థితి కూడా అదే.  స్కూల్​టీచర్​ సృష్టించిన బర్త్​డేనే వారి బర్త్​డే. అందుకే మనది ‘ బర్త్​ విథౌట్​ బర్త్​డే’ అనే పుస్తకం కూడా నేను రాశాను. అయితే ఆ తేదీ ప్రకారం నేను ఈ భూమి మీద  ఈదేశంలో 73 ఏండ్లు బతికాను.

అనేక సంకలనాలు

దేశ, విదేశాల్లో, మార్కెట్​లో, అద్యయనంలో ఉన్న పదకొండు పుస్తకాలు ఇంగ్లీషు​లోనే రాశాను. ఒక మూడు పుస్తకాలు మాత్రం తెలుగులో రాశాను.  వందలాది వ్యాసాలు ఇంగ్లీషులో, తెలుగులో రాశాను. ‘బర్త్ విథౌట్​బర్త్​డే’ అనే వ్యాసాల సంకలనం, ‘ప్యూడలిజం మల్లొచ్చింది’ అనే వ్యాసాల సంకలనం, ‘బఫెల్లో నేషనలిజం’ దేశంలోని వివిధ ఇంగ్లీషు పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనం. ఈ మధ్య ప్రచురణ మైన ‘శూధ్ర రిబెల్లియన్​’ వివిధ మ్యాగజైన్లలో రాసిన పెద్ద వ్యాసాల సంకలనం ఉన్నాయి.

తిట్లు అన్నం తిన్నట్లు అలవాటయింది

ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో..  నేను చిన్నపుడు చూడని ఊహించని విధంగా నడుస్తున్నప్పటికీ, ఇంగ్లీషు భాష అంటే భయం, అది మనదికాదనే భావన పెద్దల్లో, పిల్లల్లో బలంగా ఉంది. అతి చిన్న అరణ్యప్రాంత గ్రామంలో పుట్టి తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీలోనే పి.హెచ్​. డి వరకు చదువుకొని నిరంతరం ఇంగ్లీషులో రాసే, మాట్లాడే నన్ను ఇంగ్లీషు మీడియంలో చదువుకొని, తమ పిల్లలను కూడా ఇంగ్లీష్​లోనే చదివిస్తూ ఇంగ్లీషు భాష గొప్పతనం గురించి ప్రచారం చేస్తున్నందుకు తిట్టుకునే వారే ఎక్కువ. వారి తిట్లు తినడం  ప్రతిరోజు నాకు అన్నం తిన్నట్లు అలవాటయింది. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి పెట్టుబడిదారీ ఇంగ్లీషులో ఆలోచించడంలో వారికి పట్టుదొరక్కపోవడం కూడా నన్ను తిట్టడానికి ఒక కారణం. నేను 1977లో ఇంగ్లీషులో మొదటి వ్యాసం ‘మెయిన్​ స్ట్రీమ్’​ వార పత్రికలో రాసినప్పటి నుంచి ఇప్పటికీ ఇంగ్లీషులో రాయడం, చదవడం నాకు ప్రతినిత్యం పని. ఒక గ్రామీణ గొర్రెలకాపరి కుటుంబం నుంచి వచ్చి, గ్రామంలోనే 11వ తరగతి వరకు చదువుకున్న వ్యక్తికి  ఇది ఎలా సాధ్యమని  చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. 

నాకు ఎలా సాధ్యమైంది?  

మొదట నేను ఇంగ్లీషు భాషను పరాయి భాషగా చూడలేదు. దాన్ని మన దేశంలో అధికారిక పవర్​ భాషగా చూశాను. ఇంగ్లీషు తెలుగు కంటే చాలా సులభంగా నేర్చుకోగలిగే రిచ్​ భాష అని నాకు డిగ్రీ చదువుతున్నపుడు అర్థమైంది. ఆ భాషలో రోజూ పుస్తకాలు, వారపత్రికలు చదవడంతో పాటు నాలో నేను ఆ భాషలో మాట్లాడుకోవడం మొదలుపెట్టాను. అద్దం ముందు నిలబడి గట్టిగా చదవడం, పదాల అర్థాలు, ప్రొనౌన్సేషన్లను డిక్షనరీలో వెతకడం తప్పక చేయాలి. వీటన్నిటికంటే ముఖ్యం మనం నేర్చుకునే కొత్త భాషను మనం పుట్టి, పెరిగిన పరిసరాలకు అనువదించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను.  A అనే అక్షరం నాకు Apple తో పోల్చదగ్గది కాదు. దాన్ని Agriculture తో జతచేసి చర్చించుకోవాలి. అలాగే B for Buffalo. ఈ విధంగా ఇంగ్లీషును నేను మనదేశపు గ్రామీణ భాషగా మార్చాను. ప్రతి వస్తువుకు, ప్రతి పనికి, ప్రతి పంటకు, ప్రతిసామెతకు ఇంగ్లీషు పదకోశం రూపొందించుకున్నాను. అందుకే ‘బురదలేనిదే బువ్వలేదు’ అని దాన్ని ఇంగ్లీషులో ‘విథౌట్​మడ్​ దేరీజ్ ​నో ఫుడ్​’  అనే సామెతలోకి మార్చాను. అక్కడి నుంచి ఇంగ్లీషు భాషను మనదేశపు గ్రామాల మీద, శ్రమ మీద, పంటల మీద, గ్రామీణ సైన్స్​ మీద, కుల రహిత జీవన విధానం మీద రాయడానికి ఒక సాధనంగా మలిచాను.

అన్ని శాస్త్రాలు ఇంగ్లీషులోనే అభివృద్ధి చెందుతున్నాయి

ఇంగ్లీషు నిజానికి చాలా సులువైన వాడుక భాష. కానీ అదే అధికంగా రాసే భాషగా ఎదిగింది. ఇంగ్లీషులో వస్తున్న గొప్ప రచనలు ఇపుడు ప్రపంచంలో  ఏ భాషలో  రావడం లేదు. సైన్సు, టెక్నాలజీ, మెడిసిన్​, అగ్రికల్చర్​, జీవశాస్త్రం, చరిత్ర, రాజకీయశాస్త్రం, ఆర్థికశాస్త్రం, భౌగోళికశాస్త్రం మొదలగునవన్నీ ఇంగ్లీషు భాషతోనే అభివృద్ధి చెందుతున్నాయి. మనదేశపు చదువులను ప్రాంతీయ భాషలకు పరిమితం చేస్తే ఆ భాషలో అంతవిస్తృతి, సులభమైన ప్రపంచం గుర్తించే రచనలు లేవు.  అందుకే ప్రాంతీయ భాషల్లో చదువుకునే విద్యార్థుల జ్ఞానం పరిమితంగా ఉంటుంది. ఈ స్థితిలో ఇంగ్లీషు భాషపై అవగాహన పెంచేందుకే అక్టోబర్​ 5 ఇండియన్​ ఇంగ్లీష్​ డే జరుపు కోవాలి. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఆ భాషపైన అవగాహన పెంచాలి. ఇంగ్లీషులో చదవడం, రాయడం వైపునకు వారిని ప్రేరేపించాలి.

ఇంగ్లీషు దేశంలో పాకితే  సైన్సు బలపడుతుంది

ఇంగ్లీషు దేశ భాషగా.. ఆదివాసి, దళిత, బీసీ, ఇతర ఉత్పత్తి కులాల మధ్య పాకిన నాడు దేశంలో సైన్స్​ పునాది బలపడుతుంది.  సైన్సు ఒక భాషలో అభివృద్ధి చెందాలంటే ఆ భాష పదకోషం, ఝటిల సమస్యను సులభతర భాషలో చెప్పగలగాలి. ఇప్పటి వరకు ఇంగ్లీషు భాష ఎదిగినంతగా  ఏ భాష ఎదగలేదు.  అది మనకు అందుబాటులో ఉంది కనుక దాన్ని పట్టుపట్టి నేర్చుకోవడం మంచి మార్గం. పిల్లలకు స్కూళ్లలో ఇంగ్లీషు సులభతరంగా  నేర్పాలంటే తమ గ్రామం, ప్రాంతం, పరిసరాల మీద, పనుల మీద కథల్లాగా ఇంగ్లీషులో చెప్పడానికి టీచర్లు ప్రయత్నించాలి.  

గ్రామాల్లోని పనుల మీద  నేను ఇంగ్లీషులో  ‘డిగ్నిటీ ఆఫ్​ లేబర్​ఇన్​ అవర్​ టైమ్స్​’ రాసిన పుస్తకం టీచర్లకు, పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం మనగ్రామాల్లోని ఇంటి పనుల చుట్టూ ఉంటుంది. అదే పుస్తకం తెలుగులో కూడా బొమ్మలతో ఉంటుంది. మనకాలపు శ్రమగౌరవ పాఠాలు అనే పేరుతో మేధోరంగంలో ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఊరు చుట్టూ ఉండే పంటలు, పశువులు, పనిముట్లు, పిల్లల సైన్సు జ్ఙానాన్ని  పెంచుతాయి.  చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇంగ్లీషు అక్షరాలతో ఉండి, బొమ్మలు ఉన్న పుస్తకాలను తిరిగేసే అలవాటు చేయించాలి.

- ప్రొ. కంచ ఐలయ్య షెఫర్డ్​