రాఖీ... నువ్వు వేసే ప్రతి అడుగు విజయం వైపు సాగాలని 

రాఖీ... నువ్వు వేసే ప్రతి అడుగు విజయం వైపు సాగాలని 

అన్నా..తమ్ముడూ..! నువ్వు వేసే ప్రతి అడుగు విజయం వైపు సాగాలని ఈ రోజు రక్ష కడతారు అక్కాచెల్లెళ్లు.  ప్రపంచంలోని ప్రతి సంతోషం వాళ్లకి దక్కాలని కోరుకుంటూ నుదుట కుంకుమ దిద్ది, హారతి పడతారు. బదులుగా వాళ్ల ప్రేమని జీవితాంతం గుర్తుంచుకుంటామని,  ప్రతి కష్టం నుంచి వాళ్లని కాపాడతామని  మాట ఇస్తారు అన్నదమ్ములు. 

కులమతాలు, కలిమిలేముల భేదాలు లేకుండా అన్నదమ్ముల వరసయ్యే వాళ్లకి  రాఖీ కడతారు అక్కాచెల్లెళ్లు.  జంధ్యాల పౌర్ణమి, రక్షా బంధన్ పేర్లతో  పిలిచే ఈ పండుగ ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితం. కానీ, తర్వాత తర్వాత దేశమంతటా జరుపుకోవడం మొదలైంది. పురాణాల్లో ఈ పండుగ గురించి కొన్ని కథలున్నాయి. 

శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు

 శిశుపాలుడ్ని వధించేటప్పుడు శ్రీకృష్ణుడి చేతికి గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసిన  ద్రౌపది  తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడి గాయానికి రక్షగా చుడుతుంది. అప్పుడు కృష్ణుడు.. ‘నీకు .. ఎలాంటి ఆపద వచ్చినా నన్ను తలుచుకో కాపాడతాను’ అని చెప్తాడు. తర్వాత దుశ్శాసనుడు  ద్రౌపది చీరను లాగి అవమానించినప్పుడు... శ్రీకృష్ణుడు చీరలు అందించి  ద్రౌపది గౌరవమర్యాదలను కాపాడటానికి రాఖీ కారణమైంది. అలాగే  బలి చక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనితో పాటు పాతాళ లోకంలో ఉండిపోతాడు. అప్పుడు శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొస్తుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడిందని పురాణాలు చెప్తున్నాయి.

ఓసారి దేవతల రాజు ఇంద్రుడు రాక్షసులతో జరుగుతున్న యుద్ధంలో ఓడిపోతాడు. ఆ ఓటమిని తట్టుకోలేక ఇంద్రుడు దేవతలందరినీ తీసుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. అంతలోనే రాక్షస రాజులు అమరావతిపైనా యుద్ధానికి వస్తున్నారని తెలుస్తుంది. అప్పుడు ఇంద్రుని భార్య శచీ దేవి.. పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణుల ముందు రక్షని ఉంచి పూజిస్తుంది. దాన్ని ఇంద్రుడి చేతికి కడుతుంది. దాంతో తన శక్తిని తిరిగి తెచ్చుకున్న ఇంద్రుడు రాక్షసరాజును ఓడించి తిరిగి మూడులోకాలను గెలుచుకుంటాడు. సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ అవడంతో  శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనోత్సవ తోరణం.. తర్వాతి కాలంలో రాఖీ పౌర్ణమి అయింది. ఆ తర్వాత అదే పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముళ్ల ప్రేమకి ప్రతిరూపమైందని చెప్తారు.  అయితే ప్రాంతాన్ని బట్టి ఈ పండుగ పేర్లు, జరుపుకునే విధానం మారుతున్నా.. ఈరోజు ప్రతి ఇల్లు అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముల ప్రేమతో నిండిపోతుంది.