వనపర్తి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక పత్రాలు మాయం

వనపర్తి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక పత్రాలు మాయం
  •       ఔట్​ సోర్సింగ్ ఉద్యోగులపై కేసు నమోదు
  •       చేతులు దులుపుకున్న జిల్లా అధికారులు 
  •       జిల్లా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంపార్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డులకు భద్రత కరవు 

వనపర్తి, వెలుగు : వనపర్తి కలెక్టరేట్ నుంచి రాజీవ్ గాంధీ భీమా ప్రాజెక్టుతో పాటు ఇతర భూసేకరణకు సంబంధించిన కీలక కోర్టు పత్రాలను కొందరు మాయం చేశారు.  రైతులకు పరిహారం అందించి సేకరించిన భూముల రికార్డులు, అవార్డు కాపీలు,  గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి కీలక పత్రాలు కనిపించడం లేదు.  గతంలో పరిహారం వచ్చినా మరోసారి  పొందేందుకు అడ్డదారులు వెతుక్కుంటూ కీలక రికార్డులను కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మాయం చేశారని ఆరు నెలలుగా చర్చ సాగుతోంది.  కోర్టు వివాదాలకు సంబంధించిన కీలక పత్రాలు లేవని భూసేకరణ అధికారులు న్యాయస్థానానికి చెప్పడంతో ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించ లేకపోతున్నారు.

 దీనిపై సీరియస్ అయిన జిల్లా కలెక్టర్ తేజస్ పవార్ రికార్డుల మాయంపై సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. అయినా వారిలో మార్పు రాకపోవటంతో  కలెక్టర్ తేజస్ సంబంధిత అధికారి వెంకటేశ్వర్ల తో వనపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు.  విచారణ మొదలు కావటంతో భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.  జిల్లా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  పై అంతస్తులో ఉన్న భూసేకరణ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కీలక పత్రాలు కలెక్టరేట్ నుంచి బయటకు వెళుతున్నా  ఈ విభాగం చూస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎందుకు పట్టించుకోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

 ఈ నెల 19న కేసు నమోదు చేసినా..

 ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  రాజీవ్ గాంధీ భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కానాయపల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు.  ఈ ప్రాజెక్టును 2006   సంవత్సరంలో ప్రభుత్వం రూ. 55  కోట్లతో నిర్మించింది.  ఈ నిధులకు మూడింతల పరిహారం శంకర సముద్రంలో నిర్వాసితులకు అందింది.  అధికారులు కొందరు న్యాయవాదులు పరిహారాల పేరుతో ప్రభుత్వం నుంచి  రెండు వందల కోట్ల రూపాయలకు పైగా పరిహారం పొందారని విమర్శలు ఉన్నాయి.  

చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని జిల్లాలోని పాత, కొత్త సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల తవ్వకాల కోసం చేపట్టిన భూ సేకరణపై వివాదాలు సృష్టిస్తున్నారని పలువురు అంటున్నారు.  పరిహారం సరిపోలేదని, ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇస్తూ తమకు వడ్డీతో కలిపి చెల్లించాలని  కోర్టులో దావా  వేశారు.  ఇందుకు సంబంధించిన 20కి  పైగా కేసుల్లోని కీలక పత్రాలు లేవని పోలీసుల ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

నిబంధనలకు తూట్లు పొడిచేందుకే

ప్రభుత్వం అవసరాలకు రైతుల నుంచి భూమి సేకరించాల్సి వస్తే గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా షెడ్యూల్ ప్రాపర్టీని తెలియజేస్తారు. ఇందులో కండీషన్ పెట్టి తాము సూచించే పరిహారానికి అంగీకారం తెలిపితేనే నిర్వాసితుల  ఖాతాలో పరిహారం జమ చేస్తారు.  లేని పక్షంలో ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమి సేకరించి కోర్టులో దావా ద్వారా కోరినంత పరిహారం కోసం సవాల్ చేయవచ్చు.  భూసేకరణ కార్యాలయంలో అండర్ ప్రొటెస్ట్ ను  సమర్పించాలి.  కానీ పరిహారానికి ఒకసారి సమ్మతించి ఆ తర్వాత కొందరు తప్పుడు పత్రాలతో  కేసులు వేసేందుకు రికార్డులను తారుమారు చేస్తున్నారని అంటున్నారు.

దోషులెవరో పోలీసులే గుర్తిస్తారు

కోర్టుల్లో నమోదవుతున్న కేసులకు సంబంధించిన పత్రాలు మాయం కావటం పై వనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాం.  ఇందులో దోషులెవరో త్వరలోనే పోలీసులు గుర్తిస్తారు. బాధ్యులు ఎవరైనా వారు జైలుకు వెళ్లక తప్పదు.  యూపీ అప్లికేషన్ రికార్డు, ఇన్, అవుట్ వార్డు రిజిస్టర్లు, యూపీ ఇయర్ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్టర్లతో పాటు కొన్ని కీలక పత్రాలు కనిపించటం లేదు.  ఈ వ్యవహారంలో ఆఫీస్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బయటి వ్యక్తుల హస్తం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. 

 వెంకటేశ్వర్లు,  భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్