మేడిగడ్డ బ్యారేజీ.. కీలక ఫైళ్లు దొరుకుతలేవ్!

మేడిగడ్డ బ్యారేజీ.. కీలక ఫైళ్లు దొరుకుతలేవ్!
  • ఇరిగేషన్ అధికారులే మాయం చేశారని ఆరోపణలు
  • భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు విజిలెన్స్ ఎంక్వైరీ
  • భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు విజిలెన్స్ ఎంక్వైరీ
  • ఇక్కడి నుంచే వేల కోట్ల రూపాయల లావాదేవీలు
  • ఇరిగేషన్ ఈఈతో మేడిగడ్డ ఆఫీస్​కు వెళ్లిన విజిలెన్స్ ఎస్పీ
  • గంట పాటు వెతికినా దొరకని ఫైళ్లు
  • ఇయ్యాల కూడా విచారణ కొనసాగే అవకాశం
  • ఇప్పటి దాకా విచారణపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయని అధికారులు


జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు:మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కీలకమైన ఫైళ్లు విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ ఆఫీసర్లకు ఇంకా దొరకలేదని తెలుస్తున్నది. రెండో రోజు బుధవారం కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో విజిలెన్స్‌‌‌‌ ఎస్పీ రమేశ్‌‌‌‌ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ నిర్మాణాలకు సంబంధించిన ఫైల్స్‌‌‌‌ పరిశీలించారు. 

మంగళవారం 3 ఆఫీసుల నుంచి తీసుకొచ్చిన ఫైల్స్​ను మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లోని ఓ గదిలో ఉంచి తాళం వేసి సీల్ వేశారు. మఫ్టీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను గదికి కాపలాగా ఉంచారు. తిరిగి బుధవారం ఉదయం 11 గంటలకు విజిలెన్స్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ అధికారులు ఇరిగేషన్‌‌‌‌ డివిజన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు వెళ్లారు. మీడియాను లోపలికి అనుమతించ లేదు. కొన్ని కీలకమైన ఫైళ్లు దొరక్కపోవడంతో గురువారం కూడా ఎంక్వైరీ కొనసాగనున్నట్లుగా తెలిసింది.

ఫైల్స్ అన్నీ భూపాలపల్లిలోనే!

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణ మొదలుకొని పనులు పూర్తయ్యేనాటికి జరిగిన లావాదేవీల ఫైల్స్‌‌‌‌ అన్నీ భూపాలపల్లి జిల్లా ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసుల్లోనే ఉంచారు. వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఇక్కడి నుంచే జరిగాయి. సర్కారు మారిన వెంటనే ఇక్కడి ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు కొన్ని ఫైళ్లు మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం చేపట్టిన తనిఖీల్లో అవి దొరకకపోవడంతో బుధవారం వరకు అప్పగించాలని ఇరిగేషన్‌‌‌‌ ఇంజనీర్లకు విజిలెన్స్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ అధికారులు ఆదేశించారు. అయినా, ఆ ఫైల్స్‌‌‌‌ దొరకలేదనే చర్చ జరుగుతున్నది.

భూపాలపల్లి జిల్లాలోని ఫైల్సే కీలకం! 

మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం బ్యారేజీ కింద బుంగలు ఏర్పడటం, కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ నీట మునగడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ పనుల ప్లానింగ్, డిజైనింగ్​లో లోపాలు ఉన్నట్టు స్పష్టమైంది. ఈ రెండు బ్యారేజీలతో పాటు పంప్‌‌‌‌హౌస్​ను భూపాలపల్లి జిల్లాలోనే నిర్మించారు. ఈ జిల్లాలో దొరికే ఫైల్స్​తోనే అన్నీ విషయాలు బయటికొస్తాయి. బుధవారం కూడా 8 గంటల పాటు ఆఫీసర్ల ఎంక్వైరీ జరిగింది. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించి కీలకమైన ప్రాజెక్ట్‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌, డిజైన్స్‌‌‌‌తో పాటు మెజర్​మెంట్ బుక్స్‌‌ ‌‌(ఎంబీలు) ఫీల్డ్‌‌‌‌ లెవల్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్షన్‌‌‌‌ బుక్స్‌‌‌‌, క్రాస్‌‌‌‌ సెక్షన్స్‌‌‌‌, ఎల్‌‌‌‌ఎస్‌‌‌‌ బుక్స్‌‌‌‌, డిజైన్‌‌‌‌ డ్రాయింగ్స్‌‌‌‌, హైడ్రాలిక్‌‌‌‌ పర్టిక్యులర్స్‌‌‌‌, డిజైన్‌‌‌‌ డిశ్చార్జీ పేపర్స్‌‌‌‌, మోడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పేమెంట్, కాంట్రాక్ట్‌‌‌‌, సబ్‌‌ ‌‌కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థలకు చెల్లించిన బిల్స్‌‌, ఎర్త్‌‌‌‌, సిమెంట్‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌, భూసేకరణ, ప్రపోజల్స్‌‌‌‌, రివైజ్డ్‌‌‌‌‌‌ ఎస్టిమేట్స్‌‌‌‌కు సంబంధించిన ఫైల్స్​లో కొన్ని మిస్‌‌‌‌ అయినట్లు ఇంజనీర్లు చెప్పుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లాలో రెండ్రోజులుగా ఎంక్వైరీ జరుగుతున్నా ఆఫీసర్లు ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించ లేదు. గురువారం కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

కరీంనగర్​లో ముగిసిన తనిఖీలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌‌ఎండీ కాలనీలోని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిత ఇరిగేషన్ ఆఫీస్​లో విజిలెన్స్ తనిఖీలు బుధవారంతో ముగిశాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుబంధ ఇరిగేషన్ ఆఫీసుల్లో మంగళవారం నుంచి విజిలెన్స్ ఆఫీసర్లు సోదాలు చేపడ్తున్నారు. ఎల్ ఎండీ కాలనీలోని ఇరిగేషన్ ఆఫీస్​లో విజిలెన్స్ ఎస్పీ వెంకటరమణా రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. మంగళవారం సుమారు 11.30 గంటలపాటు ఫైళ్లు పరిశీలించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా సోదాలు చేపట్టారు. తర్వాత ముఖ్యమైన ఫైళ్లు, హార్డ్ డిస్క్ లను సీజ్ చేసి హైదరాబాద్ లోని విజిలెన్స్ ఆఫీస్​కు తరలించారు.

ఇరిగేషన్ ఆఫీసర్లపై విజిలెన్స్ ఎస్పీ అసహనం

మేడిగడ్డ బ్యారేజీ డీఈలు బుధవారం కొన్ని లెడ్జెర్లను తీసుకొని మహాదేవపూర్ ఇరిగేషన్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఒక కారులో మేడిగడ్డ బ్యారేజీ నుంచి మరికొన్ని ఫైల్స్ తీసుకొచ్చినట్టు తెలిసింది. వీటిలో కీలకమైన ఫైల్స్‌‌ లేకపోవడంతో బుధవారం సాయంత్రం 5 గంటలకు విజిలెన్స్ ఎస్పీ రమేశ్, స్థానిక ఇరిగేషన్‌‌‌‌ ఈఈ తిరుపతి రావును వెంట పెట్టుకుని మేడిగడ్డ ఆఫీస్‌‌‌‌కు వెళ్లారు. తర్వాత 6.05కు మహాదేవ​పూర్ ఇరిగేషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కీలక ఫైళ్లు ఇంకా చేతికి రాకపోవడంతో ఒకానొక దశలో ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లపై ఎస్పీ రమేశ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.