చైనా నుంచి తగ్గుతున్న ఎలక్ట్రానిక్స్​ దిగుమతులు

చైనా నుంచి తగ్గుతున్న ఎలక్ట్రానిక్స్​ దిగుమతులు

చైనా నుంచి తగ్గుతున్న ఎలక్ట్రానిక్స్​ దిగుమతులు
ఎరువులు, యూరియా దిగుమతులు కూడా..
96 శాతం పెరిగిన బ్యాటరీల కొనుగోళ్లు

న్యూఢిల్లీ :  చైనా నుంచి ల్యాప్‌‌టాప్‌‌లు, పర్సనల్ కంప్యూటర్లు (పీసీలు), ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌‌లు, సోలార్​ సెల్స్​ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు 2022-–23లో తగ్గాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద లోకల్​గా  ఎలక్ట్రానిక్ వస్తువులు తయారవుతున్నందున ఇవి తగ్గుముఖం పట్టాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్​ఐ) రిపోర్ట్​ పేర్కొంది. 2021-–22తో పోలిస్తే మెడికల్​ పరికరాల దిగుమతి గత ఆర్థిక సంవత్సరంలో 13.6 శాతం తగ్గి 2.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సోలార్​సెల్స్​, వీటి విడిభాగాలు, డయోడ్‌‌ల దిగుమతి 2022-–23లో 70.9 శాతం తగ్గి 1.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

2021-–22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ల్యాప్‌‌టాప్‌‌లు, పీసీల దిగుమతి 23.1 శాతం తగ్గి 4.1 బిలియన్ డాలర్లకు, మొబైల్ ఫోన్‌‌ల దిగుమతి 4.1 శాతం తగ్గి 857 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల ఇన్‌‌బౌండ్ షిప్‌‌మెంట్‌‌లు 4.5 శాతం తగ్గి  4.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. యూరియా,  ఇతర ఎరువుల దిగుమతులు 2022-–23లో 26 శాతం తగ్గి 2.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో లిథియం- అయాన్ బ్యాటరీల దిగుమతి 96 శాతం పెరిగి  2.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్​ వాడకం పెరగడమే ఇందుకు కారణం.

“చైనా నుంచి భారతదేశం  దిగుమతులు  తగ్గుతున్నాయి.   ఆ దేశం నుంచి భారతదేశ ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 2022 ఆర్థిక సంవత్సరంలో  30.3 బిలియన్ డాలర్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో  27.6 బిలియన్ డాలర్లకు తగ్గాయి.   చైనా నుంచి భారతదేశం  మొత్తం వస్తువుల దిగుమతులు 2023 ఆర్థిక సంవత్సరంలో 4.2 శాతం తక్కువ రేటుతో వృద్ధి చెందాయి " అని జీటీఆర్​ఐ కో–ఫౌండర్​అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. భారతదేశ సరుకుల దిగుమతిలో చైనా వాటా 2018 ఆర్థిక సంవత్సరంలో 16.4 శాతం నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో 13.8 శాతానికి తగ్గింది. ఎలక్ట్రానిక్స్​ కొనుగోళ్లు తగ్గుతుండగా, మెషినరీ, కెమికల్స్, స్టీల్,  ప్లాస్టిక్స్ వంటి ప్రొడక్టుల దిగుమతులు మాత్రం పెరుగుతున్నాయి. భారతదేశ సరుకుల దిగుమతుల్లో చైనా వాటా 2017–-18లో 16.4 శాతం నుంచి 2022–-23 నాటికి 13.8 శాతానికి తగ్గింది. అయినా చైనాకు భారతదేశం ఇప్పటికీ అతిపెద్ద మార్కెట్​.  

ఎగుమతులూ తగ్గినయ్​

చైనా భారతదేశానికి నాలుగో అతిపెద్ద ఎగుమతి మార్కెట్​. తరువాతిస్థానాల్లో యూఎస్​, యూఏఈ,  నెదర్లాండ్స్ దేశాలు ఉన్నాయి. ఈ మూడు దేశాలకు భారత్​నుంచి ఎగుమతులు పెరిగాయి కానీ గత ఆర్థిక సంవత్సరంలో చైనాకు తగ్గాయి. 2022–-23లో చైనాకు ఇండియా అవుట్‌‌బౌండ్ ఎగుమతులు 36 శాతం తగ్గి  13.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.  “పీఎల్​ఐ వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి.  మనం వేగంగా ముందుకు సాగాలంటే, భారతదేశం తయారీ పెంపు కోసం భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఈవీ బ్యాటరీల కోసం మనం తప్పనిసరిగా లిథియం -అయాన్ సెల్స్​ఉత్పత్తి చేయాలి. ల్యాప్‌‌టాప్‌‌ల కోసం ప్రింటెడ్​ సర్క్యూట్​ బోర్డులను తయారు చేయాలి. మొబైల్ ఫోన్‌‌ల కోసం కూడా స్పేర్​పార్ట్స్​ తయారు చేయగలగాలి. కేవలం ఫోన్ల ఫైనల్​ప్రొడక్ట్​ అవుటర్​షెల్స్​ తయారు చేస్తే సరిపోదు ”అని ఆయన వివరించారు.